రూ.54 వేల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు లైన్ క్లియర్

by John Kora |
రూ.54 వేల కోట్ల విలువైన ఆయుధాల కొనుగోలుకు లైన్ క్లియర్
X

- ఆమోదం తెలిపిన డీఏసీ

- దేశ రక్షణ మరింత బలోపేతం

దిశ, నేషనల్ బ్యూరో: వాయు మార్గంలో ముందస్తు హెచ్చరిక చేసే ఏఈడబ్ల్యూ అండ్ సీ వ్యవస్థతో పాటు, టార్పెడోలు, ట్యాంక్ ఇంజన్లు సహా ఇతర ఆయుధాలను రూ.54 వేల కోట్లతో కొనుగోలు చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ (డీఏసీ) గురువారం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. దేశ రక్షణ తయారీ రంగంలో స్వావలంబనకు ప్రోత్సహకరంగా ఉండేందుకు స్థానికంగా తయారు చేసి 307 ఆర్టిలరీ గన్స్‌తో పాటు రూ.7 వేల కోట్ల విలువైన టోయింగ్ వాహనాలకు భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఎస్) ఆమోదం తెలిపిన తెలిపిన మరుసటి రోజే కేంద్ర రక్షణ మంత్రి నేతృత్వంలోని డీఏసీ.. అక్సెప్టెన్స్ ఆఫ్ సెస్ససిటీ (ఏఓఎన్)కి ఓకే చెప్పింది. భారత రక్షణ రంగంలో ఏ కొనుగోలు జరగాలన్నా ముందు కౌన్సిల్ ద్వారా ఏఓఎన్ లభించాల్సి ఉంటుంది.

భారత వైమానిక దళ అవసరాల కోసం ఏఈడబ్ల్యూ అండ్ సీ వ్యవస్థల సామర్థ్యాన్ని పెంచడానికి,ఇతర ఆయుధ వ్యవస్థల పోరాట సామర్థ్యాన్ని పెంచటానికి ఈ అనుమతులు ఉపయోగపడతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2017 ఫిబ్రవరిలో బ్రెజిలియన్ ఎంబ్రార్-145 జెట్‌లో మొట్టమొదటి సారిగా స్వదేశంలో అభివృద్ధి చేసిన ఏఈడబ్ల్యూ అండ్ సీ వ్యవస్థను అమర్చారు. ఇది శత్రు దేశ విమానాలు, క్షిపణులు, మానవ రహిత వైమానికి వాహనాలను గుర్తించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. దీన్ని డీఆర్డీవో అభివృద్ధి చేసి త్రినేత్ర ఏఈడబ్ల్యూ అండ్ సీని నిర్వహిస్తుంది. ఈ వ్యవస్థ విమానంలో ఉన్న పైలట్లే కాకుండా నేలపై ఉండే ఆపరేటర్లు కూడా ముప్పును గుర్తించడానికి, వాటిని నాశనం చేయడానికి మార్గనిర్దేశనం చేస్తుంది.

ఇక వైమానిక దళం మరో ఆరు నేత్ర ఎంకే-1ఏ వ్యవస్థలను ప్రవేశపెట్టాలని భావిస్తోంది. డీఆర్‌డీవో అభివృద్ధి చేస్తున్న ఈ ఆరు నేత్ర వ్యవస్థలను ఎయిర్‌బస్ ఏ321 విమానంలో అమర్చనున్నారు. డీఏసీ ఆమోదించిన దానిలో ట్యాంక్ ఇంజిన్లుకూడా ఉన్నాయి. సైన్యంలో ఉన్న టీ-90 ట్యాంకుల ప్రస్తుత 1000 హెచ్‌పీ ఇంజన్లను కొత్త 1350 హెచ్‌పీ ఇంజన్లుగా అప్‌గ్రేడ్ చేయనున్నారు. ఇది యుద్ద భూమిలో మరితం వేగంగా, ఎత్తైన ప్రాంతాల్లో కూడా సులభంగా నడపడానికి వీలు కల్పిస్తుంది. ఇక నౌకాదళంలో టార్పెడోలను కూడా కొనుగోలు చేయనున్నారు. భారీ పరిమాణంలో టార్పెడోలను ప్రవేశపెట్టడం ద్వారా నావికా దళ సామర్థ్యం మరింత పెరగనుంది. భారత రక్షణ రంగంలో ఆయుధ సేకరణ విధానాలు నెమ్మదించడం, కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేవపెట్టడంపై చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనర్ల అనిల్ చౌహాన్ ఆందోళన వ్యక్తం చేసిన మరుసటి రోజే డీఏసీ ఈ భారీ కొనుగోలుకు ఓకే చెప్పడం గమనార్హం.

Next Story