Haldi Functions Trend వచ్చుండాయ్ పీలింగ్సూ.!

by Daayi Srishailam |
Haldi Functions Trend   వచ్చుండాయ్ పీలింగ్సూ.!
X

నేటితరం.. చాలా ఓపెన్.

సంతోషమొచ్చినా.. బాధొచ్చినా ఆపుకోదు.

యాంగ్జయిటీ ఎక్కువై ఎమోషన్సును సరిగా క్యారీ చేయడంలేదు.

ఇవి చాలవన్నట్టు తుమ్మినా దగ్గినా ఫొటో షూట్స్ ఒకటీ.

అరే ఏంట్రా ఇదీ అని అడిగితే.. మీకు తెలవదు ఊకోండ్రీ అనే దబాయింపు.

ఇంట్లో సంసారాన్ని బయటకు తీసుకొచ్చి హ‌ల్దీ ఫంక్ష‌న్స్ రూటునే మార్చేస్తున్న యువత వింత పోకడపై స్పెషల్ స్టోరీ.!

సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరలయ్యింది. ఎంత వైరలయ్యిందో అంతకంటే ఎక్కువ ట్రోల్ అవుతోంది. ఏమయ్యిందీ జనాలకు, మరీ ఇంత దిగజారిపోతున్నారూ అని నెటిజన్లు పొట్టు పొట్టు తిడుతున్నారు. మీరేం మనుషులురా అయ్యా.. లోపటింట్లో చేసుకోవాల్సినవి బజార్లో షూట్లుపెట్టి చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇదో చెత్త ట్రెండ్ అని గుస్సా అవుతున్నారు.

ఏముంది ఆ వీడియోలో?

అదొక హల్దీ ఫంక్షన్ వీడియో. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ నెట్టింట్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. మామూలుగా పెండ్లప్పుడు వధూ వరులకు మంగళ స్నానాలు చేయిస్తుంటారు కదా ఇదికూడా అదే అన్నమాట. అయితే ఇక్కడ మంగళ స్నానాలు చేస్తున్న వధూ వరుడు అర్ధనగ్నంగా ఉన్నారు. ఒళ్లంతా పసుపు పూసుకొని, నిండా పూలు చల్లుకున్నారు. అక్కడితో ఆగకుండా ముద్దూ మురిపెం అన్నీ కానిచ్చేస్తున్నారు ఫొటోలకు ఫోజులిస్తూ. ఇది చూసినవాళ్లంతా హవ్వా అని నోరు మూసుకుంటున్నారు.

ఆచారం పాతదే

మ్యారేజీల్లో మంగళ స్నానాలు సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. వాస్తవానికి ఇది ఎప్పట్నుంచో వస్తున్న ఆచారం. అయితే అప్పట్లో ఒళ్లంతా పసుపు పూసి ముత్తయిదువలతో స్నానాలు చేయించేవాళ్లు కానీ, బహిరంగ స్నానాలు చేసేవారు కాదు. ప్రముఖుల ఇండ్లలో చేస్తున్నా 2015-16 వరకు కూడా మంగళస్నానాలు పెద్దగా ప్రచారంలో లేవు. 2017లో కొంత విస్తరించి, 2018లో ప్రతీ పెండ్లిలో పక్కా అయిపోయింది. కొత్తగా వెడ్డింగ్ ప్లానర్స్ పుట్టుకొచ్చి జీవితాంతం గుర్తుండిపోయేలా హల్దీ ఫంక్షన్స్ ను రూపొందిస్తున్నారు.

నలుగు పెట్టడం

మంగళస్నానం పెండ్లికి కొత్త శోభను తీసుకొచ్చి ఒక మరుపురాని మధురానుభూతిని కలిగిస్తుంది. హల్దీ ట్రెండ్ రాకముందు దీనినే నలుగు పెట్టడం అనేవాళ్లు. వదిన, మరదలు వరసయ్యేవాళ్లు పెండ్లి కొడుకుకు, పెండ్లి కూతురుకి వారి వారి ఇండ్లలో పసుపు, గంధం పూసి స్నానాలు చేయించేవారు. మిరపకాయల దండలు, సీమ చింతకాయ దండలు మెడలే వేసి ఆటపట్టిస్తుండేవాళ్లు. రారాకుమార నలుగుకు.. శ్రీరామ అలుగకు.. పోరాట మేల సీతతో.. భూపాల చంద్రమా లాంటి పాటలు పాడేవారు.

ఎంగిలి స్నానాలా.?

మంగళస్నానం కాన్సెప్ట్ మంచిదే. కానీ యూత్ దానిని ఎంగిలి స్నానాలుగా మారుస్తోందని తిడుతున్నారు నెటిజన్లు. రిలేటివ్స్, ఫ్రెండ్స్ అంతా యెల్లో డ్రెస్సులేస్కొని బిందెలతో, జల్లెడతో పసుపు నీళ్లు, గులాభీ పూలు పోసి స్నానాలు చేయించడం వరకు ఓకే. కానీ ఒకరిమీద ఒకరుపడి దొర్లడం, పొర్లడం, అందరూ చూస్తుండగానే ముద్దులు పెట్టుకోవడం, పసుపు నీళ్లకు బదులు బీర్లు, ఇతర ఆల్కహాల్ పోసి హల్దీ ఫంక్షన్ ను పెంట చేయొద్దని సూచిస్తున్నారు.

ఫొటో షూట్ మోజు

హల్దీ ఫంక్షన్ ఒక్కటే కాదు. ఇంట్లో నాలుగ్గోడల మధ్య జరగాల్సిన తంతునంతా ఇప్పుడు ఫొటోషూట్ పేరిట బజారున పడేస్తోంది యువత. ప్రీ వెడ్డింగ్ షూట్, పోస్ట్ వెడ్డింగ్ ఫూట్, ప్రీ డెలివరీ షూట్, పోస్ట్ డెలివరీ షూట్, ఆఖరికి శోభనం షూట్ కూడా పెట్టి గబ్బులేపుతున్నారు. ఒక లిమిట్ వరకు ఏదైనా మంచిగానే అనిపిస్తుంది. కానీ లిమిట్స్ క్రాస్ అవుతున్నారు కాబట్టే విమర్శల పాలవుతున్నారు. బుద్ధున్నోడు ఎవడైనా శోభనం షూట్ అని బెడ్ రూంలో ఫొటోగ్రాఫర్లను పంపి షూటింగ్స్ చేస్తరా అని తిట్లు తింటున్నారు.

అంతా ఓపెన్

హల్దీ ఫంక్షన్ ఎపిసోడ్ లో కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ మొత్తం ఫొటోగ్రాఫరే. బాగా రావాలనే ఐడియాతో కొత్త కొత్త యాంగిల్స్ ట్రైచేస్తూ మొత్తం కాన్సెప్టునే ఛేంజ్ చేస్తున్నారు. లోపటింట్లో చేయాల్సిన వాటిని సినిమాటిక్ గా అందరిముందూ షూట్ చేస్తున్నారు. ఇంకేముందీ.. నేటి యూత్ ముందే ఓపెన్ హార్టెడ్. నటించండ్రా అయ్యా అనంటే జీవించి మరీ వస్తున్నాయ్ పీలింగ్సూ అనే రేంజిలో విజృంభిస్తున్నారు. సెటప్ కోసం రూ. 30 వేల నుంచి రూ. 40 వేలు, ఫొటో గ్రాఫర్ కోసం మరో రూ.30 వేల నుంచి రూ. 40 వేల వరకు చెల్లించి చెల్లియో చెల్లకో అని పాడుకుంటూ పండగ చేసుకుంటున్నారు.

హెల్దీ హల్దీ

మంగళస్నానం ఉల్లాసం కోసం మాత్రమే చేసేది కాదు. దీనికీ ఓ లాజిక్ ఉంది. పసుపు యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్-ఫ్లమేటరీ ఏజెంటుగా పనిచేసి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అంటే హెల్త్ పరంగా హల్దీ కొత్త జంటలకు మంచిది. ఆ లాజిక్కు మిస్ చేసి కాన్సె్ప్ట్ అర్థాన్ని మార్చకండీ.

పసుపు ప్రకాశం

చర్మానికి పసుపు ఎక్స్- ఫోలియేటింగ్ ఏజెంటుగా పనిచేసి శరీరంపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. అందుకే పెండ్లప్పుడు వధూ-వరుల ముఖాలు ప్రకాశవంతంగా కనిపిస్తుంటాయి. కాబట్టీ మంగళస్నానాల్లో నలుగు పెట్టండికానీ, ముద్దుల పోటీలతో నసపెట్టకండీ.

ప్రతికూల శక్తులు

హల్దీ వెనకాల ఇంకో ఉద్దేశం.. పసుపు రాసి, మంగళస్నానం చేయించడం వల్ల ప్రతికూల శక్తులుంటే తొలగిపోతాయట. ఇంకా ముత్తయిదువులు పసుపు రాస్తారు కాబట్టీ.. వారి దీవెనలు ఆ జంటకు దక్కుతాయట. ఇంత అర్థమున్న మంగళస్నానం కాన్సెప్టును కంగాళీ చేయకండీ.

Advertisement

Next Story

Most Viewed