AP Politics: కడప ధీరులెవరో..? అంతుచిక్కని ఓటరు అంతరంగం..!

by Indraja |
AP Politics: కడప ధీరులెవరో..? అంతుచిక్కని ఓటరు అంతరంగం..!
X

దిశ, ప్రతినిధి, కడప: రాష్ట్ర రాజకీయాల్లో ఓ ప్రత్యేక స్థానాన్ని సంతరించుకున్న ఉమ్మడి కడప జిల్లా బ్యాలెట్ పోరులో ధీరులుగా నిలిచేది ఎవరు ?ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఆయన పార్టీ గత ఎన్నికల్లో లాగా పదికి పది స్థానాలు దక్కించుకుంటుందా? గత ఎన్నికల్లో పూర్తిగా చతికలబడ్డ తెలుగుదేశం పార్టీ కూటమితో కలిసి జిల్లాలో కోల్పోయిన పట్టు సాధిస్తుందా..?

పార్లమెంటు పోటీలో తలపడ్డ అవినాష్, షర్మిల, భూపేష్ రెడ్డిలలో ఎవరు స్థానాలు ఏమిటి? షర్మిల వచ్చే ఓటింగ్ శాతం ఎంత? పోలింగ్ ముగిసినప్పటినుంచి ఎక్కడ చూసినా ఇవే చర్చలు జరుగుతున్నాయి. అంచనాల కోసం రాజకీయ పరిశీలకులు రకరకాల విశ్లేషణలు చేస్తున్నారు. రాజకీయ నాయకులతోపాటు సీనియర్ జర్నలిస్టులు పలు కోణాల్లో సమాచారం సేకరిస్తూ లెక్కలు వేసుకుంటున్నారు.

అంతుచిక్కని ఓటరు అంతరంగం

గత ఎన్నికలతో పోలిస్తే ఈ ఎన్నికల్లో ఓటర్ నాడీ అంతు చిక్కడం కష్టంగా మారింది. జిల్లాలో ఓటింగ్ శాతం గతం కంటే ఎక్కువగా పెరిగింది. మండే వేసవిలోనూ ఓటు వేసేందుకు పోటెత్తారంటే అధికార పక్షంపై వ్యతిరేకతా? లేకుంటే అధికార పక్ష ప్రభుత్వం సంక్షేమ పథకాలే ఓటర్ బ్యాలెట్ వద్దకు పోటెత్తడానికి కారణమా అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

కడప వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలో మినహా మిగతా అన్ని చోట్ల పోలింగ్ శాతం భారీగా పెరిగింది. పెరిగిన పోలింగ్ శాతం ప్రతిపక్షంకు అనుకూలమని కూటమి నాయకులు చెప్పుకొస్తున్నా, అధికార పక్షం తమ సంక్షేమ పథకాలే ఇందుకు కారణమనే అంచనాల్లో ఉన్నారు.

ఓటర్లపై డబ్బు ప్రభావం..

ఇక డబ్బు పంపిణీ విషయానికొస్తే కూడా ఇరువురు అభ్యర్థులు పోటీపడ్డారు. అయితే తెలుగుదేశం పార్టీ ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇస్తారని ఓటరు ఊహించడం, ఆ తర్వాత వైసీపీ, టీడీపీ ఇద్దరు కూడా వెయ్యి రూపాయలే పంచడం జరిగింది. కొన్నిచోట్ల వైసీపీ 1500 రూపాయలు కూడా పంచిన సందర్భాలు ఉండడంతో ఆయా ప్రాంతాల నాయకులు ఓటింగ్ శాతంపై నమ్మకంతో ఉన్నారు.

డబ్బు ప్రభావం కూడా ఓటర్లపై చూపించడంతో వారు పంపిణీ చేసిన డబ్బులను బట్టి కూడా ఓటింగ్ శాతాన్ని అంచనా వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదిలా ఉంటే మొదటి నుంచి ఓటర్లను రెండు వర్గాలుగా విభజించి మాట్లాడుతూ వస్తున్నారు. వీళ్లలో తెలుగుదేశం ఊహించిన ఒక వర్గం ఓటరు పోలింగ్ కు ఎక్కువగా రాకపోవడంతో ఆ ప్రభావం టీడీపీ పై పడే అవకాశం ఉందనే అభిప్రాయం విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.

అయితే పోలింగ్ మేనేజ్ మెంట్ గట్టి ప్రయత్నాలు చేశామని, ఓటరు తమకి అనుకూలంగా ఓటు వేశారన్న నమ్మకం తెలుగుదేశం పార్టీలో ఉండడంతో కడపలో ఫలితం ఉత్కంఠగా మారిందనే చెప్పాలి.

ఎవరి లెక్కల్లో వారు...

జిల్లాలోని అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన వైసీపీ కూటమి అభ్యర్థులు ఎవరి అంచనాలు వారు వేసుకుంటున్నారు. బూత్ లెవెల్ నుంచి సమాచారం సేకరించి క్రోడీకరించుకుంటున్నారు. అనుకూలంగా వచ్చేటివెన్నీ, ప్రత్యర్థులకు వెళ్లేవెన్నీ అనే లెక్కలు తీస్తున్నారు. ఈ లెక్కల ప్రకారం వైసీపీ పదికి పది స్థానాలు మావే అనే ధీమాతో ఉంది.

అయితే ఆ పార్టీకి ఈసారి ఒకటి రెండు స్థానాల మినహా అన్నిచోట్ల కూటమి నువ్వా నేనా అంటూ గట్టి పోటీ నెలకొంది. ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి వరదరాజుల రెడ్డి తన సత్తా చాటే విధంగా పోటీలో నిలబడ్డాడు. వైసీపీ నుండి రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి పోటీలో ఉన్నారు. పలువురు అంచనా వేస్తున్న ప్రకారం ఇక్కడ టీడీపీకి కొంత మొగ్గు ఉంటుందని భావిస్తున్నారు. అయితే పోలింగ్ సరళి ప్రకారం మాకే అనుకూలమన్న అంచనాల్లో వైసీపీ నేతలు ఉన్నారు.

కమలాపురంలో టీడీపీకి సానుకూలం

కమలాపురం నియోజకవర్గంలో టీడీపీకే ఓటింగ్‌ సానుకూలంగా మారిందని భావిస్తున్నారు. పోలింగ్‌కు ముందు నుంచే ఇక్కడ టీడీపీకి కలిసి వస్తుందన్న అంచనాలు వేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో టీడీపీ కమలాపురంపై ధీమాతో ఉండగా మూడోసారి అభ్యర్థి రవీందర్ రెడ్డి గెలుపు ఖాయమని వైసీపీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందులలో పెద్దగా లెక్క కట్టాల్సిన అవసరం లేదు.

కాకపోతే గత ఎన్నికల్లో జగన్‌కు వచ్చిన ఓట్లశాతంలో తేడాలు ఉంటాయా..? అదే తరహాలో ఎన్నికలు జరిగాయా? అనే అంచనాలు వేసుకుంటున్నారు. మైదుకూరు నియోజకవర్గంలోను ఈసారి టీడీపీ గట్టి పోరు సాగించింది. ఇక్కడ కూడా కమలాపురం లాగే టీడీపీకి అనుకూలంగా ఉంటుందని భావిస్తున్నారు. అయితే ఇక్కడ సామాజిక ఓట్లను పరిగణలోకి తీసుకుంటే మాత్రం వన్ సైడ్ ఎన్నికలు జరిగాయన్న అభిప్రాయాలకు పెద్దగా తావు ఉండక పోవచ్చన్న అంచనాలు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో మైదుకూరు పలితం కూడా ఉత్కంఠగానే ఉందని చెప్పవచ్చు.

కమలం బోనీ కొట్టేనా!

ఈ సారి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నుంచి బీజేపీ రెండు స్థానాల్లో పోటీ చేసింది. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి, బద్వేల్ నుంచి రోషన్నలు కమలం అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. అయితే ఇక్కడ ఓటింగ్ సరళి జరిగిన విధానాన్ని పరిశీలిస్తే సీనియర్ రాజకీయ పరిశీలకు కూడా ఫలితాలు అంచనాలోకి రావడం లేదని చెప్పవచ్చు. ఈ రెండు చోట్ల ఓటింగ్ శాతం బాగా పెరిగింది.

దరిదాపు పులివెందుల ఓటింగ్ తో పోటీబడటం చూస్తే ఇక్కడ కమలం వైపు ఓటర్లు మొగ్గు చూపారా! లేక కమలం పార్టీ కంటే అక్కడ వైసీపీ బలంగా ఉంది కాబట్టి అలా జరిగిందా అన్నది అంచనాలకు అందని పరిస్థితిగా మారింది. జమ్మలమడుగులో మాజీ మంత్రి, బలమైన నాయకుడు ఆయిన ఆది నారాయణ రెడ్డి బరిలోకి దిగడంతో ఆయనకు అనుకూలంగా ఓటింగ్ మారిందా అన్న అభిప్రాయాలు లేక పోలేదు.

ఇక్కడ ఓటింగ్ 86 శాతం దాటడంతో కూటమి‌ అభ్యర్థికి విజయ అవకాశాలు ఉంటాయా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. బద్వేల్లో సైతం 78.55 శాతం ఓటింగ్ జరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఓట్లు కమలానివా, వైసీపీవా అనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది.

ఆ మూడు చోట్లా ఎవరు?

ఉమ్మడి జిల్లాలోని రాజంపేట పార్లమెంటు అసెంబ్లీల్లో గల రాయచోటి, రాజంపేట, రైల్వే కోడూరు లలో కూడా వైసీపీ గట్టి ధీమాతో ఉంది. రాయచోటిలో వైసీపీకి అను కూలించే అభిప్రాయాలు ఉన్న మైనార్టీ సామాజిక ఓట్లు అధికంగా ఉండడం ,జిల్లా కేంద్రాన్ని రాయచోటికి తీసుకు రావడం, ఇందుకు తోడు టీడీపీ ఇన్చార్జిగా ఉన్న బలమైన నాయకుడు మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి వైసీపీలో చేరడం లాంటివి ఆ పార్టీకి కలిసి వస్తుండగా, టీడీపీ నుంచి పోటీ చేసిన రాంప్రసాద్ రెడ్డికి ఇలాంటి సానుకూల పరిస్థితులు పెద్దగా లేవు.

కానీ ప్రభుత్వ వ్యతిరేక ఓటే ఆయనకు ఆధారమైంది. ఈ నేపథ్యంలో అక్కడ గెలుపు పై వైసీపీ వారు ఎక్కువ ధీమాతో ఉన్నారు. మరో వైపు రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి రాయచోటి నుండి అభ్యర్థిగా సుగవాసి సుబ్రహ్మణ్యంను బరిలో దించడం జరిగింది. రాజంపేటలో టీడీపీకి చాలా సానుకూల పరిస్థితులున్నాయి. ఇందుకు తోడు జనసేన బాగా సహకరించి ప్రచారంలో దిగింది.

పరిస్థితులు సానుకూలంగా ఉన్నప్పటికీ పోల్ మేనేజ్మెంట్ లో గానీ, డబ్బు పంపిణీలో కానీ వైసీపీతో పోటీ పడలేక పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఇక్కడ అంచనాలు మారిపోనున్నాయా అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇక జనసేన కేటాయించిన రైల్వే కోడూరులో వరుసగా నాలుగు సార్లు విజయం సాధించి ఐదోసారి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగిన కొరముట్ల శ్రీనివాసులు విజయం సాధించే దిశగా కసరత్తు చేశారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉంది. జనసేనకు కూడా సానుకూలమైన ఓటింగ్ శాతం ఇక్కడ కనిపిస్తోంది.

షర్మిల ఓటింగ్ శాతంపై అంచనాలు

కడప పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి త్రిముఖ పోటీ జరిగింది. ఏపీసీసీ అధ్యక్షురాలు, దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి తనయ షర్మిల పోటీ చేయడంతో కడప పార్లమెంటు రాష్ట్ర వ్యాప్త దృష్టిని ఆకర్షించింది. పార్లమెంట్‌లో గెలుపోటములను అటుంచితే షర్మిలకు వచ్చే ఓటింగ్ శాతం ఎంత, ఆమె చరిష్మాకు తగినన్ని ఓట్లు వస్తాయా? ఆమె గెలుస్తుందా అనే దానిపై అంచానాలు వేస్తున్నారు.

కొందరు ఆమెకు వచ్చే ఓట్లపై కూడా పందేలు కాస్తున్నట్లు సమాచారం. ఈ ఎన్నికల్లో పోటీపడుతున్న వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి, టీడీపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలా రెడ్డిల్లో ఎవరు ఏ స్థానంలో నిలబడతారన్న దానిపై చర్చ జరుగుతోంది.

Advertisement

Next Story