రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో సరికొత్త నినాదం

by GSrikanth |   ( Updated:2022-09-05 06:53:42.0  )
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో సరికొత్త నినాదం
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో తిరిగి అధికారంలోకి వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో పేరుతో దేశవ్యాప్తంగా యాత్ర చేపట్టేందుకు సిద్దమైంది. సెప్టెంబర్ 7వ తేదీ సాయంత్రం 5 గంటలకు కన్యాకుమారి నుంచి ఈ పాదయాత్ర మొదలు కానుంది. ఇప్పటికే సన్నాహక కార్యక్రమాలు అన్నింటిని పూర్తి చేసుకున్న పార్టీ ఇవాళ యాత్రకు సంబంధించిన ప్రచార వీడియోను విడుదల చేసింది. కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్‌ ఇన్‌చార్జి జైరాం రమేష్ హిందీ వెర్షన్ పాటను రిలీజ్ చేశారు. ఈ పాటను అన్ని ప్రాంతీయ భాషల్లో విడుదల చేస్తామని కన్యాకుమారిలో తమిళ వెర్షన్, యాత్ర కేరళలో ప్రారంభం అయ్యే ముందు మలయాళీ పాటను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. రాహుల్ గాంధీ చేపడుతున్న భారత్ జోడో యాత్రలో భారీ ఉపన్యాసాలు ఉండవని స్పష్టం చేసారు. ప్రజల బాధలు వినడం కోసమే ఈ యాత్ర చేపడుతున్నట్లు తెలిపారు. మొత్తం పాదయాత్రలో ప్రజల కష్టసుఖాలు తెలుసుకోవడం, ప్రభుత్వం పేదల పట్ల మోపుతున్న భారాలను వారికి వివరించడమే లక్ష్యంగా సాగుతుందన్నారు. 'ఏక్ తేరా కదం, ఎక్ మేరా కదం' (ఒక అడుగు మీది... ఒక అడుగు నాది) కలిసి ముందుకు సాగుదాం అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లనుంది.

తండ్రి మరణించిన చోట రాహుల్ సర్వమత ప్రార్థనలు:

భారత్ జోడో యాత్ర వివరాలను జైరాం రమేష్ వివరించారు. 7వ తేదీ ఉదయం తన తండ్రి మృతి చెందిన చోటు శ్రీపెరంబుదూర్‌లో రాజీవ్ గాంధీకి రాహుల్ గాంధీ నివాళులు అర్పించనున్నారు. సుమారు గంట సేపు పలు మతాల ఆచారాల ప్రకారం రాహుల్ గాంధీ ప్రార్థనలు జరుపుతారు. అనంతరం కన్యాకుమారి చేరుకుని వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లూర్ మెమోరియల్, కామరాజ్ మెమోరియల్‌ను సందర్శిస్తారు. రాహుల్ గాంధీతో పాటు తమిళనాడు, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ సీఎంలు సైతం హాజరు అవుతారు. సాయంత్రం బహిరంగ సభ అనంతరం పాదయాత్ర ప్రారంభం అవుతుంది. ఉదయం 7గంటలకు మొదలయ్యే పాదయాత్రలో ప్రతిరోజు సుమారు 22-23 కి.మీ సాగుతుంది. ఇందులో ఉదయం 15 కి.మీ, సాయంత్రం 7-8 కి.మీ పాదయాత్ర సాగుతుందని జైరాం రమేష్ వెల్లడించారు. రాహుల్ గాంధీ చేసే పాదయాత్రకు మద్దతుగా ప్రతి రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ నేతలు పాదయాత్రలు చేస్తారని ప్రతి చోట భారత్ జోడో యాత్రకు మద్దతుగా అనేక కార్యక్రమాలు జరగనున్నాయని పేర్కొన్నారు.

Also Read : బీజేపీ హయాంలో దేశంలో విద్వేషం పెరిగింది.. Rahul Gandhi

Advertisement

Next Story