ఆంక్షలపై వాళ్లిద్దరూ సేమ్ టు సేమ్!

by Rajesh |   ( Updated:2023-01-05 05:56:10.0  )
ఆంక్షలపై వాళ్లిద్దరూ సేమ్ టు సేమ్!
X

దిశ, వెబ్ డెస్క్: ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం, సభలు నిర్వహించడం, ధర్నాలు చేయడం యేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఆనాటి స్వాతంత్ర్య ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ధర్నాలు, సభలదే ప్రధాన పాత్ర అనడంలో సంశయం లేదు. అయితే రాజకీయ పార్టీలు తమ పంథాను మార్చుకుని ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయి. ప్రజాస్వామ్య పునాదులనే అపహాస్యం చేస్తున్నాయి. 'వీధులు నిర్మానుష్యమైతే చట్టసభలు దారితప్పుతాయి' అని స్వాతంత్య్ర ఉద్యమ కారుడు, సోషలిస్ట్ నాయకుడు రామ్ మనోహర్ లోహియా అన్నారు. ఈ విశిష్ట వ్యాఖ్యల స్పృహను పార్టీలు విస్మరిస్తున్నాయి.

ధర్నాచౌక్ విషయంలో కేసీఆర్..

తెలంగాణ ఉద్యమ అనంతరం సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కేసీఆర్ ధర్నాచౌక్ ఎత్తేశారు. రాష్ట్రం సాధించుకున్నాం సమస్య తీరిపోయిందనుకున్నారో ఏమో కానీ అనుకున్నదే దరిమిలా అందుకు జీఓ జారీ అయింది. కాగా కోర్టు మాత్రం ఈ విషయంలో సర్కారుకు మొట్టికాయలు వేసింది. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తం చేసే హక్కు ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఎక్కడో ఊరు బయట ధర్నా చేసుకోమంటే ఎవరు వింటారని ప్రభుత్వాన్ని గతంలో ప్రశ్నించింది.

మనుషులు ఉండని అడవిలో సెల్ ఫోన్ టవర్ నిర్మిస్తారా అని అప్పట్లో ఘాటు వ్యాఖ్యలు చేసింది. ధర్నాచౌక్‌ను కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవల తెలంగాణలో ప్రతిపక్షాలపై ప్రభుత్వం ఉక్కు పాదం మోపుతోంది. ప్రజాసమస్యలపై ఆందోళన బాట పట్టే నాయకులను గృహనిర్భంధం చేయడం తరచూ చూస్తునే ఉన్నాం. అనుమతి లేదనే సాకుతో ప్రతిపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం మొదటి నుంచి కొనసాగుతూనే ఉంది.

ఏపీలోనూ ఇదే తరహాలో..

ఇదే తరహాలో ఏపీలో కూడా ప్రస్తుతం సభలపై వైసీపీ ప్రభుత్వం ఆంక్షలు విధించడం చర్చనీయాంశంగా మారింది. పోలీసు చట్టం ప్రకారం సెక్షన్ 30, 30ఏ, 31 ప్రకారం రాష్ట్రంలో ఎవరైనా సరే ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించాలంటే అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకోవాల్సిందేనని ఏపీ ప్రభుత్వం నిశిరాత్రి జీఓ జారీ చేయడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. చంద్రబాబు సభలలో తొక్కిసలాట మృతులను సాకుగా చూపుతూ ఈ నిర్ణయానికి ఏపీ ప్రభుత్వం వచ్చినట్లు పైకి చెబుతున్నా కేవలం రాజకీయంగా పార్టీలను నిలువరించేందుకేనని చర్చ జోరందుకుంది.

కాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ సైతం ఇటీవల బస్సు యాత్ర చేపట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో రాజకీయ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేందుకే సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే అంశంపై స్పందించిన ఉభయ కమ్యూనిస్టు పార్టీల నాయకులు సైతం అడవిలో సభలు పెట్టుకోవాలా అని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే ప్రతిపక్షాలు తప్పనిసరిగా ఉండాల్సిందే.. కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తీరు ఇందుకు భిన్నంగా సాగుతోంది. ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చిన కేసీఆర్, పాదయాత్రతో అధికారంలోకి వచ్చిన జగన్ నిరసనలపై ఉక్కుపాదం మోపడంలో మాత్రం సేమ్ టు సేమ్ అనే వాదన వినిపిస్తోంది. ఇప్పటికైనా ఈ రెండు ప్రభుత్వాలు తీరు మార్చుకుంటాయో లేదో చూడాల్సిందే..

Also Read....

నాకు ఈ కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఒద్దు... రాజీనామా చేస్తా: Revanth Reddy

Advertisement

Next Story

Most Viewed