KTR : ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ అవాస్తవాలు : కేటీఆర్

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-12-24 05:04:21.0  )
KTR : ధాన్యం కొనుగోలులో కాంగ్రెస్ సర్కార్ అవాస్తవాలు : కేటీఆర్
X

దిశ, వెబ్ డెస్క్ : ధాన్యం కొనుగోలు( Pady Purchase)లో కాంగ్రెస్ ప్రభుత్వం(Congress government)కొన్నది కాకరకాయ కొసిరింది గుమ్మడికాయ అన్నట్లుగా అవాస్తవాలు ప్రచారం చేసుకుంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఎక్స్ వేదికగా విమర్శించారు. రాష్ట్రంలో 1.53 కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి అయితే ప్రభుత్వం కొన్నది కేవలం 46 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు. క్వింటాలుకు రూ.500 బోనస్ అని రైతులలో ఆశలు రేపి దొడ్డు వడ్లకు తెడ్డు చూపి, సన్న వడ్లకు సవాలక్ష కొర్రీలు పెట్టి విదిలించింది కేవలం రూ.530 కోట్లు మాత్రమేనన్నారు. రైతుభరోసా కింద ఎకరాకు ఏడాదికి రూ.15 వేల కోట్లకు గాను గత వానాకాలం, యాసంగి కలిపి ఎగ్గొట్టింది 26 వేల కోట్లు అని విమర్శించారు.

అసలు రైతుకే భరోసా లేదని.. ఇక కౌలు రైతులు, రైతుకూలీల ఊసెక్కడిదన్నారు. కల్లాల వద్దకే కొనుగోళ్లతో కేసీఆర్ ప్రభుత్వంలో రైతుకు భరోసా అందగా, కల్లోల కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోళ్లు లేక రైతన్నలు ఆందోళనలో పడిపోయారని కేటీఆర్ విమర్శించారు.

అంతకుముందు మరో ట్వీట్ లో కేటీఆర్ తెలంగాణలో ఏం జరుగుతుందంటూ కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు. కూల్చివేతలు, ఎగవేతలు, కరెంటు కోతలు, చిన్నారుల చావులు, కోడెల అమ్మకాలు, అల్లర్లు, అబద్ధాలు, పగలు, ప్రతీకారాలు, దాడులు, దౌర్జన్యాలు, ధర్నాలు, దీక్షలు, ఢిల్లీ టూర్లు, అప్పులు, తప్పులు, డైవర్షన్ లు, స్టంట్ లు, బూతులు, లూటీలు, కేసులు, అరెస్ట్ లు...ఇవేనా? ఇంకేమైనా ఉంటే చెప్పండంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనను దుయ్యబట్టారు.

Advertisement

Next Story

Most Viewed