డబ్బులు పంచుతున్నారు.. గ్రాడ్యుయేట్ ఓటు ఏటు..?

by Shamantha N |   ( Updated:2023-10-12 06:26:25.0  )
డబ్బులు పంచుతున్నారు.. గ్రాడ్యుయేట్ ఓటు ఏటు..?
X

దిశ ప్రతినిధి, హైదరాబాద్: పెద్దల సభగా గుర్తింపు పొందిన శాసనమండలికి ఎన్నికయ్యేందుకు అభ్యర్థులు అడ్డదారులు వెతుక్కుంటున్నారు. ఆదివారం మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. అయితే, పెద్దల సభకు వెళ్లేందుకు పెద్దనోట్ల అండ చూసుకుంటున్నారు కొందరు అభ్యర్థులు. సార్వత్రిక ఎన్నికలకు ఏ మాత్రమూ తీసిపోకుండా ఖర్చు చేస్తున్నారు. ఇప్పటికే నగదు ఏర్పాటు చేసుకున్న వీరంతా ప్రస్తుతం పంపకాలపై దృష్టి సారించారు. స్థానిక నేతల ద్వారా డబ్బులతో ఓటర్లకు ఎరవేశారు. కొన్ని గంటల్లోనే పోలింగ్ మొదలు కానుండడంతో హైదరాబాద్‌లోని పలు నియోజకవర్గాలలో ఇంటింటికి తిరిగి ఓటుకు ఇంత అంటూ పంపిణీ చేశారు.

ఇతర జిల్లాలకు చెందిన నాయకులకు.. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్ నగరంలో బాధ్యతలు అప్పగించారు. వీరికి స్థానిక నాయకులను జత చేసి పట్టభద్ర ఓటర్లు ఉన్న ఇండ్లకు తిరిగి ఓటరు స్లిప్పులు పంపిణీ చేయడం, మా పార్టీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరడం వంటివి ఇప్పటి వరకు జరిగాయి. అయితే, పోలింగ్‌కు కొన్ని గంటలు మాత్రమే మిగిలి ఉన్న తరుణంలో నగదు పంపిణీకి తెరతీశారు పార్టీల నాయకులు.

ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్ పార్టీ గోషామహల్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఒక్కో ఓటుకు రూ. 2 వేల చొప్పున పంపిణీ చేసినట్టు తెలిసింది. వాస్తవానికి ఓటుకు రూ.5 వేల చొప్పున పార్టీ అప్పగించగా ఓటరుకు చేరే సరికి రెండు వేలు మాత్రమే ముట్టినట్టు సమాచారం. ఇదే పరిస్థితి జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని నియోజకవర్గాలలో నెలకొంది.

గతంలో ఎన్నడూ లేని విధంగా.. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా నగదు, మద్యం పంపిణీ జరుగుతోందని స్వతంత్ర్య అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. పార్టీలు ఎంతగా డబ్బులు పంపిణీ చేసినా అన్ని తెలిసిన గ్యాడ్యుయేట్ ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించి ఓట్లు వేస్తారని ఇండిపెండెంట్‌లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. నిజాయితీగా గెలువ లేక ఇలా అక్రమార్గాలను అన్వేషించే వారిని చిత్తుగా ఓడించి సమర్థుడైన నాయకునికి పట్టం కట్టాలని పలువురు స్వతంత్ర్య అభ్యర్థులు గ్రాడ్యుయేట్ ఓటర్లను కోరారు.

Advertisement

Next Story

Most Viewed