పోలీసులకు ఎంత కష్టమొచ్చే..!

by Anukaran |   ( Updated:2020-11-26 12:13:54.0  )
పోలీసులకు ఎంత కష్టమొచ్చే..!
X

దిశ, క్రైమ్ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీల ప్రచార యుద్ధంలో పోలీసులు నలిగిపోతున్నారు. ‘గ్రేటర్’ పోరులో అనుమతి లేని ర్యాలీలు, సభలను నిలువరించాలా? లేక అనుమతించాలా? తెలియక మానసికంగా కుంగిపోతున్నారు. అనుమతి లేని ర్యాలీలను అడ్డుకున్నట్లుగా మీడియాలో ప్రచారం అవుతుండటంతో ప్రభుత్వం, అధికార పార్టీ ఇరకాటంలో పడకుండా ఉండేందుకు తామెవరినీ అడ్డుకోలేదంటూ వివరణ ఇచ్చుకోవాల్సిన స్థితికి పోలీసుల పరిస్థితి నెట్టివేయబడుతోంది.

టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ..

బల్దియా ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలుపొంది మళ్లీ మేయర్ పీఠం దక్కించుకునేందుకు రాష్ట్రంలోని అధికార పార్టీ టీఆర్ఎస్ జోరుగా ప్రచారం చేస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా ఈసారి దుబ్బాక గెలుపు ఎఫెక్ట్‌తో మేయర్ పదవి మాదేనంటూ ప్రచార పర్వంలో దూసుకెళ్తోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ప్రధాన పోటీలో ఉన్నప్పటికీ దూకుడుగా వ్యవహారించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీజేపీ తనకున్న శక్తి యుక్తులన్నింటినీ కూడగట్టి టీఆర్ఎస్‌కి తీవ్రపోటీ ఇస్తోందనడంలో ఎలాంటి సందేహం లేదు.

క్షేత్రస్థాయికి ఢిల్లీ నాయకత్వాన్ని కూడా దించుతోంది. ఈ క్రమంలో ఈ నెల 20న బీజేపీ స్టేట్ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ నాంపల్లి బీజేపీ ఆఫీసు నుంచి చార్మినార్ భాగ్యలక్ష్మీ టెంపుల్ వరకు మధ్యాహ్నం 12 గంటల సమయంలో ర్యాలీ చేపట్టారు. అదేరోజు శుక్రవారం కావడంతో పక్కనే ఉన్న మక్కా మసీదులో మధ్యాహ్నం ఒంటి గంట ప్రాంతంలో ప్రార్థనలు జరిగాయి. ఈ పరిస్థితులు హిందూ, ముస్లిం వర్గాల మధ్య ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తాయోనని పోలీసు వర్గాలు ఆందోళన చెందాయి. ఇదిలా ఉండగా, బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ తేజస్వీ సూర్య మంగళవారం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్దకు వెళ్లారు. అక్కడ ఆయన్ను పోలీసులు అడ్డుకున్నట్లు మీడియాలో ప్రచారమైంది. దాంతో పోలీసు ఆఫీసర్లు తామెవరిని అడ్డుకోలేదని వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

అయోమయంలో పోలీసులు..

వాస్తవంగా బండి సంజయ్, తేజస్వీ సూర్య ర్యాలీలకు అనుమతి లేకుంటే పోలీసులు అడ్డుకోవాలి. ఎన్నికల నిబంధనలు కూడా అవే చెబుతున్నాయి. కానీ, ర్యాలీలను పోలీసులు అడ్డుకుంటే, ఆ ప్రభావం ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తాయోనని మథనపడుతున్నారు. ఒకవేళ ప్రభుత్వానికి, గ్రేటర్‌లోని అధికార పార్టీకి ఇబ్బందికి పెట్టేవిగా ఉంటే చివరకు విధుల్లో ఉండే పోలీసుల మెడకు ఉచ్చుగా మారే అవకాశం కూడా లేకపోలేదు.

ఈ తరహా పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోలేక, ఉన్నతాధికారుల నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో పోలీసులు అయోమయానికి గురవుతున్నారు. ఫలానా పార్టీ ర్యాలీని అడ్డుకున్నట్లు, ఆ ప్రదేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్లు మీడియాలో ప్రచారం కావడంతో..తామెవరిని అడ్డుకోలేదంటూ పోలీసు ఆఫీసర్లు ప్రకటన చేయాల్సి వస్తోంది. బండి సంజయ్, తేజస్వి ర్యాలీ సమయంలో తామెవరిని అడ్డుకోలేదంటూ సీపీ అంజనీకుమార్, ఈస్ట్ జోన్ డీసీపీ రమేష్‌ ట్విట్టర్ వేదికగా ప్రకటించుకోవాల్సి వచ్చింది. ఈ పరిణామాలతో పోలీసులకు లా అండ్ ఆర్డర్‌ నిర్వహణ కత్తిమీద సాములాగా మారుతోంది.

Advertisement

Next Story