తొలిసారిగా ఆన్‌లైన్‌లో.. ఆస్ట్రేలియా ప్రధానితో మోడీ భేటీ

by Shamantha N |   ( Updated:2020-06-04 11:11:02.0  )
తొలిసారిగా ఆన్‌లైన్‌లో.. ఆస్ట్రేలియా ప్రధానితో మోడీ భేటీ
X

న్యూడిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ గురువారం ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్‌తో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక చర్చలు నిర్వహించేందుకు ఇరుదేశాల ప్రధానులు ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. ప్రధాని మోడీ తొలిసారిగా ఆన్‌లైన్‌లో ఇటువంటి సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రెండు దేశాలకు సంబంధించిన కీలక విషయాలు, ఒప్పందాలపై చర్చించారు. వాణిజ్యం, రక్షణ, విద్య, సహా పలు అంశాలపై మాట్లాడారు. ఇరుదేశాల మధ్య ఉన్న వ్యూహాత్మక భాగస్వామి స్థాయి ఒప్పందాలను మరింత బలపరిచి సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి స్థాయికి చేర్చాలని ఇరుదేశాల ప్రధానులు ప్రతినబూనారు. సుదీర్ఘంగా పెండింగ్‌లో ఉన్న రక్షణపరమైన సహకారానికి సంబంధించిన మ్యూచువల్ లాజిస్టిక్ సపోర్ ఒప్పందంపై ఇరువురూ సంతకాలు పెట్టారు.

ఇండియా, ఆస్ట్రేలియా దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలపరుచుకునేందుకు ఇదే సరైన సమయం అంటూ ప్రధాని మోడీ సంభాషణను ప్రారంభించారు. ఇరుదేశాల మధ్య సంబంధాన్ని మరింత పటిష్టం చేసుకునేందుకు ఎన్నో అవకాశాలను ఉన్నాయని, ఆ పటిష్టత కేవలం ఇరుదేశాలకే కాదు, ఇండో పసిఫిక్ రీజియన్‌కు ఉపయోగపడుతుందని తెలిపారు. ప్రజాస్వామ్యాన్ని, చట్టబద్ద పాలన, స్వేచ్ఛ, పరస్పర గౌరవం, అంతర్జాతీయ సంస్థలకు గౌరవం ఇవ్వడం వంటి విలువలను ఇరుదేశాలు పవిత్ర బాధ్యతగా భావించి పాటించాలని అన్నారు. ఈ కరోనా సంక్షోభాన్ని భారత్ ఒక అవకాశంగా మలుచుకుందని, ఈ కాలంలోనే ఎన్నో సంస్కరణలు చేశామని చెప్పుకొచ్చారు.

ఈ సమావేశంలో.. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామిగా వ్యవహరించడం, మ్యూచువల్ లాజిస్టిక్స్ సపోర్ట్ అరేంజ్‌మెంట్, ఇండో పసిఫిక్ రీజియన్‌లో సముద్ర జలాలపై సంయుక్త ప్రకటన, మైనింగ్ రంగంలో పరస్పర సహాకారానికి ఎంఓయూలు వంటి తొమ్మిది ఒప్పందాలపై ఇరుదేశాల ప్రధానులు సంతకాలు చేశారు.

జీ-20 కూటమిలో క్రియాశీలక పాత్ర పోషించారని ప్రధాని మోడీని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ కొనియాడారు. కరోనా సంక్షోభంపై పోరులో ప్రపంచ వైఖరిని ప్రభావితం చేశారని అన్నారు. భారత తమకు ఎప్పుడూ నమ్మకమైన మిత్రదేశమని, ఈ దేశంతో తమది సహజమైన మైత్రి అని తెలిపారు. సాంకేతికరంగంలో ఇండియా దూసుకెళ్తున్నదని చెప్పారు. ప్రస్తుతమే కాదు, భవిష్యత్తులోనూ ఈ రంగం ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు. భారత్‌తో ఒప్పందాలను మరింత ధృడం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని, అటువైపుగా అడుగులు వేయాలని కోరారు. అలాగే, ఈ భేటీలో కిచిడీ గురించి మాట్లాడారు. గతవారం తాను ట్వీట్ చేసిన సమోసాను గుర్తుచేశారు. వచ్చేసారి కచ్చితంగా కిచిడీ వండతానని చెప్పారు. అది ప్రధాని మోడీతో షేర్ చేసుకుంటారని వివరించారు. దీనికి స్పందనగా ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed