రోడ్లకు వృద్ధ దంపతుల మరమ్మతులు.. హైకోర్టు సీరియస్

by Shyam |   ( Updated:2021-07-14 11:52:25.0  )
Thilak
X

దిశ, సిటీ బ్యూరో : మహానగర పాలక సంస్థ నిర్లక్ష్యం కారణంగా రోడ్లపై ఏర్పడిన గుంతలపై హై కోర్టు మరోసారి బల్దియాకు అక్షింతలు వేసింది. సిటీలో గుంతలమయమైన రోడ్లకు మరమ్మతులు చేసేందుకు గంగాధర్ తిలక్ దంపతులు సిద్ధమయ్యారు. వారు తమకు నెలనెలా వస్తున్న పెన్షన్ డబ్బులతో రోడ్లకు మరమ్మతులు చేస్తున్నారంటూ పలు సామాజిక ప్రచార మాధ్యమాల్లో వైరల్ అయిన పోస్టింగ్ పై హై కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలైనంది.

అయితే రోడ్లకు మరమ్మతులు చేయాల్సిన బల్దియా అధికారులు ఏం చేస్తున్నారు? వారికిస్తున్న జీతాలు మరమ్మతులు చేస్తున్న వృద్ధ దంపతులకు ఇవ్వటమే మేలని హైకోర్టు అక్షింతలు వేసినట్లు తెలిసింది. పని చేయనపుడు జీహెచ్ఎంసీకి బడ్జెట్ తగ్గించడం మంచిదని, రోడ్లు బాగా లేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు పోతుంటే, చూస్తూ కుర్చుంటారా? అని హై కోర్టు ప్రశ్నించినట్లు తెలిసింది. అద్భుతమైనన రోడ్లను నిర్మిస్తున్నామని బల్దియా న్యాయవాది పేర్కొనగా, రోడ్లపై గుంతలే లేవా? న్యాయవాదులతో తనిఖీ చేయించమంటారా? అని కోర్టు వ్యాఖ్యానించినట్లు సమాచారం.

కాగా, బల్దియాపై హైకోర్టు అక్షింతల నేపథ్యంలో రోడ్లకు చేపడుతున్న మరమ్మతులు, నిర్మిస్తున్న కొత్త రోడ్ల వివరాలతో కోర్టుకు త్వరలోనే నివేదికను సమర్పిస్తామని బల్దియా చీఫ్ ఇంజనీర్ దేవానంద్ మాడపాటి దిశతో చెప్పారు.

తిలక్ దంపతులకు గవర్నర్ తమిళి సై సన్మానం

రోడ్లు బాగా లేక ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్న సంఘటనలకు చలించి తమ సొంత డబ్బుతో పదేళ్లుగా రోడ్ల మరమ్మతులు చేస్తున్న గంగాధర్ తిలక్ దంపతులను గవర్నర్ తమిళి సై సౌందర రాజన్ సన్మానించారు. బుధవారం రాజ్ భవన్ లోని దర్బార్ హాల్ లో శాలువ కప్పి, మెమెంటోను అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. ఈ వయస్సులోనూ ఎంతో ఓపికగా రోడ్లకు మరమ్మతులు చేస్తున్న ఆ దంపతులను గవర్నర్ రోడ్ డాక్టర్ గా అభివర్ణించారు. గంగాధర్ వెంట ఆయన భార్య కూడా ఉంటూ రోడ్లకు మరమ్మతులు చేయటంతో ఎంతో స్ఫూర్తిదాయకమని గవర్నర్ వ్యాఖ్యానించారు.

అయితే రోడ్లపై జరిగిన పలు ప్రమాదాలను చూసిన తమకు ఎంతో బాధ కలిగిందని, అలా మరెవ్వరూ ప్రమాదాల బారిన పడరాదన్న ఉద్దేశ్యంతోనే రోడ్లకు మరమ్మతులు చేస్తున్నట్లు ఆ దంపతులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed