కనువిందు చేసిన ‘ఫ్లాట్ రెయిన్‌బో’

by Anukaran |   ( Updated:2020-08-30 05:14:52.0  )
కనువిందు చేసిన ‘ఫ్లాట్ రెయిన్‌బో’
X

దిశ, వెబ్‌డెస్క్: వర్షం వస్తూనే.. అందరికీ మధురానుభూతులను తీసుకొస్తుంది. వాటితో పాటే మరో వర్ణ చిత్రాన్ని సైతం ఆకాశ దేశంలో అందంగా ఆవిష్కరిస్తుంది. వానొచ్చిందంటే చాలు.. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇంద్రధనస్సు ఎప్పుడు ప్రత్యక్షమవుతుందా? అని ఎదురు చూస్తుంటారు. అయితే, రెయిన్‌బోను ఎప్పుడూ చూసినా.. అర్ధ వృత్తాకారంలోనే కనిపించి కనువిందు చేస్తుంది. కానీ, ఇంగ్లండ్‌లోని డెవన్‌‌లో కనిపించి రెయిన్‌బో మాత్రం ఫ్లాట్‌గా ఉంది. మరి ఎందుకలా ఉందన్నదే ప్రశ్న?

సూర్యుడి కాంతి.. నీటి బిందువుల గుండా ప్రసరించినపుడు ఆ కాంతి ఏడు వర్ణాలుగా విచ్ఛిన్నమై ‘ఇంద్రధనస్సు’ ఏర్పడుతుందన్నది తెలిసిందే. అయితే ఎండ, వర్షం రెండూ కలిసి ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుంది. అది కూడా అర్ధ వృత్తాకారంలోనే కనిపిస్తుంది. నిజానికి.. రెయిన్‌బో వృత్తాకారంలోనే ఏర్పడుతుంది. కానీ, విమానం నుంచి చూసినప్పుడు మాత్రమే అది గుండ్రంగా, వలయాకారంలో కనిపిస్తుంది. అయితే, డెవాన్ సముద్ర తీరంలో ఏర్పడిన రెయిన్‌బో.. ఫ్లాట్‌గా ఉండటంతో నెటిజన్లు కంగారు పడుతున్నారు. 2020లో వింతలు చోటుచేసుకుంటున్నాయని, చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయని కామెంట్లు చేస్తున్నారు. హాఫ్ సర్కిల్‌లో కనిపించే రెయిన్‌బో.. ఇలా కనిపించడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు వివరించారు. ‘ఫ్రాన్సిస్ తుఫాన్ వల్ల డెవాన్ సముద్ర తీరంలో బలమైన గాలులు వీస్తుండటంతోనే సముద్రంలోని నీరు.. చిన్న చిన్న చినుకులుగా పైకి లేచింది. అదే సమయంలో.. సూర్యుని కాంతి ఆ నీటి తుంపర్లపై పడటంతో.. ఇంద్రధనస్సు కనిపించింది’ అని తేల్చి చెప్పారు. అయితే, ఈ ఫ్లాట్ రెయిన్‌బో చిత్రాలు మాత్రం నెట్టింట్లో తెగ వైరల్ అయ్యాయి.

ఫ్లాట్ రెయిన్‌బో కనిపించడం ఇదేం కొత్త కాదు. 2013 – పారిస్‌లో, 2017- బ్రిస్టోల్‌లో ఇలాంటి ఇంద్రధనస్సులు కనువిందు చేశాయి.

Advertisement

Next Story

Most Viewed