ఓటీపీ లేకుంటే రేషన్ కట్​

by Anukaran |
ఓటీపీ లేకుంటే రేషన్ కట్​
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం రేషన్ సరుకుల సరఫరాలో తీసుకొచ్చిన కొత్త విధానం ముప్పుతిప్పలు పెడుతోంది. ఫిబ్రవరి నుంచి రేషన్ సరుకులు తీసుకోవాలంటే మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీ లేదా ఐరిస్ విధానం తప్పనిసరి అయ్యింది. రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత, కరోనా వైరస్ నివారణకు చెక్ పెట్టేందుకేనని అధికారులు చెబుతున్నారు. ఈ విధానం వల్ల రేషన్ సరుకులు తీసుకోవడం గగనంగా మారుతోంది. ఇప్పటి వరకు రేషన్ దుకాణంలో లబ్ధిదారులు సరుకులు తీసుకోవాలంటే.. కుటుంబ సభ్యులెవరైనా వేలిముద్రలు నమోదు చేసి సరుకులు తీసుకునే అవకాశం ఉండేది. కొత్త విధానం వల్ల రేషన్ సరుకులు తీసుకోవాలంటే ఆధారు కార్డు అనుసంధానం చేసిన మొబైల్ నంబరు ఉండాలి.

ఆ నంబరుకు వచ్చిన ఓటీపీని రేషన్ డీలర్ నమోదు చేసుకుని సరుకులు ఇస్తారు. ఒక వేళ ఆధార్ కార్డుకు మొబైల్ నంబరు అనుసంధానం కాకపోతే ఐరిస్ ద్వారా సరుకులు తీసుకోవచ్చు. అయితే గ్రామీణ ప్రాంతాల్లో అమలు అసాధ్యమని స్పష్టమవుతోంది. విద్యావంతులే వారి ఆధార్​నంబరుకు మొబైల్​నంబరును అనుసంధానం చేసుకున్న వారి సంఖ్య తక్కువ. జనాభాలో 20 శాతం మంది కూడా మొబైల్​నంబరును లింక్​ చేసుకోలేదు. ఇప్పటి వరకు ఎవరైనా నంబరు నమోదు చేసుకున్నారంటే వారేదైనా అవసరానికి మాత్రమే.. ప్రధానంగా ప్రావిడెంట్​ఫండ్​సొమ్మును డ్రా చేసుకునేందుకు తప్పనిసరి చేశారు.

చాలా మంది ఆ సొమ్ము కోసం నంబరును నమోదు చేయించుకున్నారు. ఇప్పుడేమో నిత్యావసర వస్తువులను స్వీకరించాలంటే తప్పనిసరి అయ్యింది. పైగా రేషన్ దుకాణానికి కుటుంబంలో ఎవరు అందుబాటులో ఉంటే వారు వెళ్తారు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులందరి ఆధార్​నంబరుకు మొబైల్​నంబరును అనుసంధానం చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో సోమవారం నుంచి మీ సేవా కేంద్రాల దగ్గర భారీ క్యూలైన్లు దర్శనమిస్తున్నాయి. ప్రతి రోజూ 20 నుంచి 30 మందికి మాత్రమే చేయగలుగుతున్నారు. లక్షలాది మంది ఆధార్ కార్డులకు మొబైల్​నంబర్ల అనుసంధాన ప్రక్రియ ఎప్పటికి పూర్తవుతుందో అధికారులే చెప్పాలి. ఇక ఫిబ్రవరి నెలకు సంబంధించిన రేషన్ పొందడం కష్టంగానే కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం నుంచి మీ సేవా కేంద్రాలన్నీ కిటకిటలాడుతున్నాయి.

అందరికీ సెల్‌ ఫోన్లు ఉన్నాయా?

రాష్ట్రంలో నేటికీ రేషన్ బియ్యం వండుకొని తినే వారి సంఖ్య గణనీయంగానే ఉంది. అలాంటి నిరుపేదల దగ్గర సెల్​ఫోన్లు ఉన్నాయని అధికారులు భావించడం సమంజసం కాదని లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్‌, ఖమ్మం, వరంగల్​అటవీ బిడ్డల్లో ఎంత మందికి ఫోన్లు ఉన్నాయని ఈ విధానాన్ని అమలు చేస్తున్నారో అర్థం కావడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికీ మొబైల్​సిగ్నల్​లేని గ్రామాలు అనేకం ఉన్నాయి. అలాంటప్పుడు రేషన్ డీలర్ల దగ్గరికి వెళ్లడం, కార్డు నంబరు ఎంట్రీ చేయగానే వచ్చే ఓటీపీ చెప్పడం ఎంత వరకు సాధ్యమో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారులే చెప్పాలి. మండల, డివిజన్, జిల్లా కేంద్రాలకు పల్లె జనం వస్తున్నారు. అక్కడే మీ సేవా కేంద్రాలు ఉండడం వల్ల పనులు మానేసుకొని వస్తున్నారు. ఆధార్ కార్డుకు మొబైల్ నంబరు అనుసంధానం చేయడం కోసం 20 నుంచి 30 కి.మీ. దూరంలోని పల్లె ప్రజలు మీ సేవా కేంద్రాల బాట పట్టారు.

రేషన్ కార్డు ఉన్నా.. ఓటీపీ ఎందుకు?

రేషన్ సరుకులు తీసుకునేందుకు లబ్ధిదారులకు రేషన్ కార్డులను ప్రభుత్వం జారీ చేసింది. ఆ కార్డుల ఆధారంగానే సరుకుల పంపిణీ జరుగుతోంది. అయితే బోగస్ రేషన్ కార్డులు ఉన్నాయనే సమాచారంతో ప్రభుత్వం గతంలో పలుమార్లు బోగస్ కార్డులను ఏరివేసింది. మళ్లీ తాజాగా రేషన్ సరుకులు తీసుకోవాలంటే.. ఓటీపీ, ఐరిస్​అంటూ కొర్రీలు పెట్టడంతో నిరుపేదలు పనులు మానుకొని మీ సేవా కేంద్రాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. గంటల తరబడి అక్కడే కూర్చుంటున్నారు. రేషన్ కార్డు ఉన్న తర్వాత ఓటీపీ, ఐరిస్ విధానం ఎందుకని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. దీనికి తోడు ప్రతి పథకం అమలు చేసేందుకు ఆధార్ కార్డును తప్పనిసరి చేయడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పథకానికి సంబంధించి కార్డు ఉన్నా.. ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకోవడం దేనికంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed