కల్లుకు 'జై'.. కరోనా జాగ్రత్తలకు 'నై' !

by Shyam |
కల్లుకు జై.. కరోనా జాగ్రత్తలకు నై !
X

దిశ, వెబ్‌డెస్క్: వెనకటికి ‘ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకు నిప్పడిగాడంట’ ఓ ప్రబుద్ధుడు. ఊళ్లల్లో ఈ సామెత ఎంత ఫేమసో మనందరికీ తెలిసే ఉంటుంది. ఓ వైపు ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్‌ నియంత్రణకు అలుపెరగని పోరాటం చేస్తుంటే.. ఈ సామెతల గొడవేమిటని అనుకోకండి ! ఇందుకో కారణముంది. వైరస్ బారి నుంచి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. వైద్యులు, పోలీసులు, పారిశుధ్య సిబ్బంది.. ఈ విపత్కర పరిస్థితుల్లో తమ ప్రాణాలను పణంగా పెట్టి మరీ.. ప్రజలకు సేవలందిస్తున్నారు. కానీ అవేవీ పట్టని వారు గుంపులుగా కూర్చొని పార్టీలు చేసుకుంటున్నారు. ఊళ్ళల్లో గుంపులుగా కూర్చొని కల్లు తాగుతూ.. ఇంత మంది శ్రమను మట్టిపాలు చేస్తున్నారు. పైగా ఇటువంటి నిర్లక్ష్యపూరిత చర్యలకు పాల్పడుతున్న వారిలో చదువుకున్న యువతే ఎక్కువగా ఉండటం గమనార్హం. దీంతో కల్లుకు సైతం డిమాండ్ పెరిగి, కల్లు కోసం అక్కడక్కడా చిన్నపాటి యుద్ధాలు కూడా జరుగుతున్నాయి. తాజాగా ఒక ఊళ్లో.. కల్లును ఆ ఊరి వాళ్ళకు కాకుండా, పక్క ఊరి వాళ్లకు పోశాడని ఓ గౌడ్‌కు జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో పట్టణాలు, నగరాల్లో ఉద్యోగాలు చేస్తున్నవారు, చదువుకుంటున్న వారంతా తమ సొంత ఊళ్లకు చేరుకున్నారు. అంతవరకు బాగానే ఉన్నా.. వారిలో చాలా మంది మందు పార్టీలు చేసుకుంటూ, గుంపులుగా పేకాట ఆడుతూ.. సామాజిక దూరానికి మంగళం పాడుతున్నారు. అయితే, కల్లు తాగితే సమస్యేం లేదు. కానీ ఈ కారణంగా గుంపులుగా కూర్చోవడమే తప్పు. ఈ నేపథ్యంలో ‘చదువుకున్న వారికి బాధ్యత ఉండక్కర్లేదా ? అని ఎవరైనా ప్రశ్నిస్తే.. ‘కరోనా వైరస్ మనదాకా రాలేదు కదా.. అని లైట్ తీసుకుంటున్నారు. మనదాకా వస్తే.. పరిణామాలు ఎలా ఉంటాయో, పక్క దేశాల్లో జరుగుతున్న మరణ మృదంగాన్ని చూసైనా బుద్ధి తెచ్చుకోవడం లేదు. పైగా.. ‘మన దేశంలో ఎండ తీవ్రత ఎక్కువ, మనవి మలేరియాను తట్టుకున్న శరీరాలు.. భారతీయులకు రోగ నిరోధక శక్తి ఎక్కువంటూ’ సొల్లు కబుర్లు చెబుతున్నారు. కానీ ఒక్క పాజిటివ్ కేసు నమోదయ్యిందంటే, పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతాయోనన్న సంగతి మరిచి పోతున్నారు.

పోలీసులకు తలకు మించిన భారం..

ఈ పరిస్థితుల్లో జనాలను కట్టడి చేయడం పోలీసులకు తలకు మించిన భారం అవుతోంది. లాక్ డౌన్ పీరియడ్‌లో తీరిక లేకుండా విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో విసిగిపోయిన పోలీసులు.. ఎవరైనా నిబంధనలు అతిక్రమించిన వారితో దురుసుగా ప్రవర్తిస్తే.. సోషల్ మీడియాలో పోలీసుల తీరుపై దుమ్మెత్తిపోస్తున్నారు. కానీ తమ తప్పులను ఎరగడం లేదు. ‘కరోనాకు మందు లేదు, నియంత్రణ ఒక్కటే మార్గమని.. సామాజిక దూరాన్ని పాటించి, కరోనా వ్యాప్తిని అరికట్టాలని’ ఎన్నో మాధ్యమాల ద్వారా అవగాహన కలిగిస్తూనే ఉన్నారు. అయినా పలు చోట్ల కొంతమంది బాధ్యతా రాహిత్యం ఈ వైరస్ వ్యాప్తికి కారణమవుతోంది. ఇందుకు దేశవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతున్న కేసులే నిదర్శనం. ప్రజలు గుమిగూడకుండా ఉండేందుకు పోలీసులు ఎంత నిఘా పెట్టినప్పటికీ, ఎవరికీ వారు స్వీయనిర్బంధం పాటించకపోతే వారి ప్రయత్నాలన్నీ వృథా ప్రయాసే కానున్నాయి. అందుకే ఎవరికి వారు ఆత్మ విమర్శ చేసుకొని, కరోనా నియంత్రణకు పాటు పడాల్సిన అవసరం ఉంది.

Tags: Village, Toddy, Social Distance, Doctors, Police

Advertisement

Next Story