- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పవర్ ‘సాయన్న’ బడ్జెట్ రూ. 200 కోట్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారి పిరియాడికల్ మూవీ చేయబోతున్నారని తెలుస్తోంది. క్రిష్ దర్శకత్వంలో బలహీన వర్గాల కోసం ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేసిన పండుగ సాయన్న కథను తెరపై ఆవిష్కరించబోతున్నాడు. చరిత్ర మరిచిన ఓ వీరుడి కథను సినిమా రూపంలో జనాలకు చేర్చబోతున్నాడు.
మహబూబ్‌నగర్ ప్రాంతంలోని గ్రామాల్లో పెత్తందార్లు రెచ్చిపోతుంటే బహుజన కులాలకు బాసటగా నిలిచాడు పండుగ సాయన్న. ధనవంతులు, భూస్వాములను చీల్చి చెండాడి ఆకలితో అలమటిస్తున్న ప్రజల కడుపు నింపాలన్న సూత్రంతో పని చేశాడు. ఆయుధం పట్టి జనాలను సాయుధం చేశాడు. బలహీనవర్గాలకు చదువు ఖచ్చితమని పిలుపునిచ్చిన సాయన్న పేదల ఆకలి తీర్చేందుకు అన్నదానాలు చేశాడు. భూ స్వాముల ఆగడాలకు అడ్డుపడుతూ జనాన్ని కాపాడుతూ వచ్చాడు. దీంతో పండుగ సాయన్నకు ప్రజల్లో ఆదరణ పెరిగింది. సాయన్నకు రోజురోజుకు పెరుగుతున్న ఆదరణను జీర్ణించుకోలేక పోయిన పెత్తందార్లు.. ఆయనను చంపేందుకు కుట్ర చేస్తారు. తప్పుడు కేసులతో జైల్లో పెట్టిస్తారు. దీంతో సాయన్నను జైలు నుంచి విడిపించాలని, ప్రజలు వనపర్తి మహారాణి శంకరమ్మపై ఒత్తిడి తెస్తారు. దీంతో ఆమె నిజాం పాలకులను కలవగా … సాయన్నను శిక్షించకుండా ఉండాలంటే రూ.10 వేల జరిమానా చెల్లించాలని షరతు పెడతారు. దీనికి ఆమె ఒప్పుకోగా ‘మార్ మత్. ఛోడో ‘ అని మహబూబ్ నగర్ ఎస్పీకి స్టే ఆర్డర్ పంపిస్తారు నిజాం పాలకులు. కానీ, జైల్లో ఉన్న సాయన్నను ఎలాగైనా చంపాలనే కుట్రతో పెత్తందార్లు, పోలీసులతో చేతులు కలిపి ‘మార్. మత్ ఛోడో’ అని ఆర్డర్ మారుస్తారు. దీంతో పండుగ సాయన్నకు ఉరిశిక్ష విధిస్తారు. ఆయన తల నరికి మొండాన్ని ఒక దగ్గర, తలను మరోచోట విసిరేస్తారు. దీంతో జనాలు ఆగ్రహించి పెత్తందార్లు ఉన్న భవనాలను చుట్టుముట్టి తగలబెడతారు. ఇది పండుగ సాయన్న వీరగాథ.
1840-1885 మధ్యలో జరిగిన ఈ కథను దృశ్య కావ్యంగా తెరకెక్కించనున్నారు క్రిష్. తెలంగాణ రాబిన్‌హుడ్ పండుగ సాయన్న కథను రూ. 200 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా మూవీగా తీయబోతున్నారు. సినిమాలో పవన్ కళ్యాణ్ లాంగ్ హెయిర్‌తో కనిపించబోతున్నారు. విప్లవ భావాలున్న పవన్. విప్లవ వీరుడిగా మెగా ప్రాజెక్ట్ చేయబోతున్నారు. వచ్చే ఏడాది జనవరి 8న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఏఎం రత్నం నిర్మాత కాగా ఎం.ఎం. కీరవాణి స్వరాలు సమకూర్చనున్నారు.