Vem Narender Reddy: ప్రభుత్వానికి - జర్నలిస్టులకు మధ్య వారధిగా ఉంటా

by Gantepaka Srikanth |
Vem Narender Reddy: ప్రభుత్వానికి - జర్నలిస్టులకు మధ్య వారధిగా ఉంటా
X

దిశ, తెలంగాణ బ్యూరో: ‘కాంగ్రెస్ పార్టీ జర్నలిస్టుల పక్షపాతి. గతంలో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చింది కాంగ్రెస్ పార్టీనే. ఇప్పుడు కూడా జర్నలిస్టులకు అండగా ఉంటాం. ప్రభుత్వానికి, జర్నలిస్టులకు మధ్య వారధిగా ఉంటా’ అని సీఎం ప్రధాన సలహాదారులు వేం నరేందర్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి(ప్రజా వ్యవహారాల) సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ది జర్నలిస్ట్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షులు బ్రహ్మాండభేరి గోపరాజు నేతృత్వంలోని కార్యవర్గం శనివారం కలిసింది.

ఇటీవల జరిగిన ఎన్నికల తీరును, ఫలితాలపై వేం నరేందర్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల పక్షపాతనీ, జర్నలిస్టుల కుటుంబాలు సంతోషంగా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామనీ, జర్నలిస్టుల సంక్షేమం కోసం రేవంత్ రెడ్డి సర్కార్ దృఢ సంకల్పంతో ఉందని వేం నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికైన నూతన కమిటీకి ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ కార్యదర్శి ఎం.రవీంద్రబాబు, కోశాధికారి భీమగాని మహేశ్వర్ గౌడ్, కార్యవర్గ సభ్యులు డి. కమలాకరాచార్య, సీనియర్ జర్నలిస్టు ఏ.రాజాబాబు పాల్గొన్నారు.

Advertisement

Next Story