పేట్ల బురుజులో డాక్టర్లకు కరోనా.. పేషంట్ల పరిస్థితి?

by Shyam |
పేట్ల బురుజులో డాక్టర్లకు కరోనా.. పేషంట్ల పరిస్థితి?
X

దిశ , హైదరాబాద్: పేట్ల బురుజు ఆస్పత్రిలో కరోనా కలకలం రేపింది. ఒకటి కాదు రెండు కాదు.. హాస్పిటల్‌లో ఏకంగా 34 మందికి కరోనా పాజిటివ్ రావడం ఆందోళనకరంగా మారింది. ఇందులో 18 మంది వైద్యులు, నలుగురు ఉద్యోగులు, 12 మంది పారిశుద్ధ్య సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఒకే ఆస్పత్రిలో తొలిసారిగా అత్యధిక కరోనా కేసులు నమోదు కావడం గమనార్హం. కరోనా బారిన వైద్యులు, సిబ్బంది పడుతుండడంతో దాని ప్రభావం ప్రభుత్వ ఆస్పత్రులకు వచ్చే రోగులపై పడుతోంది. ముఖ్యంగా పేట్లబురుజులోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రిపై కరోనా పంజా విసరడంతో ఇక్కడికి వచ్చే గర్భిణుల సంఖ్య గణనీయంగా పడిపోయింది.

ఔట్ పేషంట్‎కు వచ్చే వారితో పాటు ఇన్ పేషంట్ల చేరిక తగ్గింది. సాధారణ రోజులలో ఒక్క రోజులో ఇక్కడ 60 నుండి 80 వరకు ప్రసవాలు జరుగుతుండగా సోమవారం ఊహించని రీతిలో ప్రసవాల సంఖ్య పడిపోయింది. ఇందుకు కారణం ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది కరోనా భారిన పడడమే. కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో పని చేస్తున్న ఇద్దరు ప్రొఫెసర్లు, నలుగురు డాక్టర్లకు కరోనా వైరస్ సోకింది. వ్యాధిని గుర్తించకుండా వారు విధులకు హాజరు కావడంతో వైరస్ ఇతర వైద్యులు, సిబ్బంది కరోనా బాన పడ్డారు. ఇలా ఇప్పటి వరకు ఈ హాస్పిటల్ 34 మంది వ్యాధి బారిన పడ్డారు. దీంతో గర్భిణులకు అందించే వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపడంతో ఆస్పత్రికి వచ్చే వారి సంఖ్య తగ్గింది.

హాస్పిటల్‌లో 462 పడకలు:

పేట్ల బురుజు ప్రభుత్వ ప్రసూతి దవాఖానలో మొత్తం 462 పడకలు ఉన్నాయి. సాధారణ రోజులలో ప్రతి రోజు హాస్పిటల్‎లోని ఓపీ విభాగానికి 8 వందల నుంచి వెయ్యి వరకు గర్భిణులు వస్తుండగా.. 40 నుండి 80 వరకు ప్రసవాలు జరిగేవి. కొన్ని రోజులుగా ఆస్పత్రిలో పని చేస్తున్న వైద్యులు, సిబ్బందిపై కరోనా పంజా విసురుతుండడంతో ఇక్కడికి వచ్చే గర్భిణుల సంఖ్య తగ్గిపోయింది. కేవలం తొమ్మిది నెలలు నిండిన వారిని మాత్రమే ప్రసవం కోసం హాస్పిటల్‎లో చేర్చుకుంటున్నారు. సుమారు పది రోజులుగా హాస్పిటల్‎లో జరిగే ప్రసవాలు కూడా తగ్గిపోయాయి. ప్రతి రోజు 20 నుండి 25 డెలివరీలు మాత్రమే జరుగుతుండగా.. సోమవారం ఇది మరింత తగ్గి కేవలం 8 ప్రసవాలు మాత్రమే జరిగాయంటే పరిస్థతి ఎలా మారిందో ఇట్లే అర్థం అవుతోంది.

ప్రత్యమ్నాయ ఆస్పత్రులకు పేషంట్లు:

ఈ హాస్పిటల్‌లో ప్రతి నెల వైద్య పరీక్షల నిమిత్తం వచ్చే వారు.. సుల్తాన్ బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, నీలోఫర్ హాస్పిటల్‎తో పాటు సమీపంలోని పట్టణ ఆరోగ్య కేంద్రానికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో ఎనిమిది నెలల లోపు గర్భిణులు ఆయా ఆస్పత్రులకు వెళ్లి వైద్యం పొందుతుండడంతో ఇక్కడికి వచ్చే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది.

కరోనా అదుపులోకి వస్తేనే:

కరోనా వ్యాధి పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తేనే తప్ప.. పేట్ల బురుజు ఆస్పత్రిలో పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందుబాటులోకి వచ్చే పరిస్థితులు ఇక్కడ కనిపించడం లేదు. దీనికి తోడు వైద్యులు, సిబ్బంది హోం క్వారెంటైన్‎లోకి వెళ్లి పోతుండడం వైద్య సేవలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. నెలలు నిండిన గర్భిణులకు ప్రసవాలు చేయడం ప్రస్తుతం పని చేస్తున్న సిబ్బందికి తలకు మించిన భారం అవుతోంది. దీంతో తొమ్మిది నెలలలోపు ప్రతి నెల వైద్య పరీక్షలు పొందే మహిళలు గంటల తరబడి నిరీక్షించవలసి వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆస్పత్రి పాలక వర్గం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించి ఇతర ఆస్పత్రులకు వెళ్లి వైద్య పరీక్షలు పొందాలని సూచనలు చేస్తోంది.

Advertisement

Next Story

Most Viewed