రికార్డు అమ్మకాలను నమోదు చేసిన పార్లె-జీ బిస్కెట్లు!

by Harish |
Parle G
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ బిస్కెట్ల తయారీ సంస్థ పార్లె-జీ భారీ అమ్మకాలను నమోదు చేసినట్టు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో అనేక కంపెనీలు నష్టాలను చూస్తుండగా, నిత్యావసర విభాగంలో ఉన్న పార్లె-జీ కంపెనీకి భారీగా లాభాలు వచ్చాయి. కరోనా ముందు మార్కెట్లో అనేక ఒడిదుడుకులను ఎదుర్కొన్న పార్లె-జీకి కరోనా సమయం బాగా కలిసొచ్చింది. 1938 నుంచి ఇప్పటివరకూ ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదని కంపెనీ స్పష్టం చేసింది. గడిచిన 80 ఏళ్ల కాలంలో ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లోనే భారీ స్థాయిలో పార్లె-జీ బిస్కెట్ల అమ్మకాలు నమోదయ్యాయని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. పార్లె కంపెనీ మొత్తం మార్కెట్ షేర్ 5 శాతం పెరిగిందని, ఇందులో 80 నుంచి 90 శాతం వృద్ధి పార్లె-జీ బిస్కెట్ల నుంచే వచ్చినట్టు పార్లె-జీ బిస్కెట్స్ హెడ్ మయాంక్ షా చెప్పారు. ఇది ఆశ్చర్యం కలిగించే అంశం. ఇంతకుముందెన్నడూ ఈ స్థాయి అమ్మకాలు చూడలేదని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా పార్లె-జీ బిస్కెట్ల ఉత్పత్తులను పెంచారు. తయారీ కేంద్రాల్లో సిబ్బంది కోసం ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసి సరఫరా వ్యవస్థకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తగిన జాగ్రత్తలను కంపెనీ నిర్వహించింది. లాక్‌డౌన్ వల్ల లక్షల్లో పేదలు ఆహారం దొరక్క ఇబ్బందులు పడ్డారు. వారికి తక్కువ ధరలో అందుబాటులో ఉండేలా పార్లె-జీ బిస్కెట్ల ధరలు ఉండటంతో వాటిని కొని తిన్నారు. అనేక స్వచ్చంద సంస్థలు పేదల కోసం పార్లె-జీ బిస్కెట్లను కొని పంచారు. లాక్‌డౌన్ వల్ల నడక మార్గంలో వెళ్లిన వలస కార్మికులు కూడా వీటినే కొని ఆకలి తీర్చుకున్నారు. రూ.5 కే పార్లె-జీ బిస్కెట్లు లభించడంతో కామ మ్యాన్ బిస్కెట్‌గా ప్రచారం పొందిందని కంపెనీ వర్గాలు చెబుతున్నాయి. పార్లె-జీ కంపెనీ రోజుకు 40 కోట్ల బిస్కెట్లను తయారు చేస్తుందని, కిలో బిస్కెట్లను రూ. 77కె విక్రయిస్తుండటంతో అందరికీ పార్లె-జీ ప్రజలు చేరువైందని చెబుతున్నారు. లాక్‌డౌన్ కాలంలో అత్యధిక బిస్కెట్ల అమ్మకాలతో పార్లె-జీ బిస్కెట్లకు ఎంత క్రేజ్ ఉందో తెలుస్తోందని తెలిపారు. వీటితో పాటు క్రాక్ జాక్, హైడ్ అండ్ పీస్, బ్రిటానియా కంపెనీకి చెందిన టైగర్, బార్బన్ అండ్ మ్యారీ, గుడ్‌డే బిస్కెట్లు ఎక్కువ మొత్తంలో అమ్ముడయ్యాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement

Next Story