సర్వీస్‌ రోడ్డు మీద కార్పొరేట్ వ్యాపారుల అడ్డ..!

by Shyam |
సర్వీస్‌ రోడ్డు మీద కార్పొరేట్ వ్యాపారుల అడ్డ..!
X

దిశ, కుత్బుల్లాపూర్: సర్వీస్​రోడ్డు కార్పొరేట్ ​వ్యాపారులకు పార్కింగ్ ​అడ్డగా మారింది. నిబంధనల ప్రకారం సర్వీస్​రోడ్డుపై ఎలాంటి వ్యాపారాలు, వాహనాల పార్కింగ్​ చేపట్టరాదు. కానీ కుత్బుల్లాపూర్​ సర్కిల్​పరిధిలో మాత్రం ఇందుకు విరుద్ధంగా కొనసాగుతోంది. ఇదే సర్వీస్​రోడ్డుపై వారం క్రితం చిరువ్యాపారుల దుకాణాలను ఏ మాత్రం జాలి చూపకుండా తొలగించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ, అదే సర్వీస్​ రోడ్డుపై కార్పొరేట్​ వ్యాపార సంస్థల వాహనాలను పార్కింగ్​ చేస్తుంటే పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. బడా వ్యాపారుల కోసమే చిరుదుకాణాలను తొలగించారా అని పులువురు బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

44వ నెంబర్ జాతీయ రహదారికి ఇరువైపులా సర్వీసు రోడ్డు అక్రమ పార్కింగ్ కు అడ్డగా మారుతోంది. ప్రధాన రహదారిలో ట్రాఫిక్ కు ఇబ్బందులు తలెత్తితే దారి మళ్లించడానికి ఈ రోడ్డు ఉపయోగపడుతుంది. కానీ, కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో మాత్రం నిబంధనలు పూర్తిగా విరుద్ధంగా ఉన్నాయి. ఈ రోడ్డంతా వాహనాలు పార్కింగ్​ చేస్తుండడంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

చిరు వ్యాపారులపైనే ప్రతాపమా..

కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సుచిత్ర నుంచి ఎన్ సీఎల్ కాలనీ వరకు ఉన్న సర్వీసు రోడ్డుపై నిరుపేదలు పానీపూరి, టీ కొట్టు, పండ్ల దుకాణాలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. వారం రోజుల క్రితం గ్రేటర్ ఉన్నతాధికారుల ఆదేశాలంటూ దుకాణాలను తొలగించాలని సూచించారు ఆ పేదలు దుకాణాలు తీస్తే తమ పరిస్థితి ఏమిటని మిన్నకుండి పోయారు. కానీ, చెప్పిన మరుసటిరోజే ట్రాఫిక్ పోలీసులతో కలిసి గ్రేటర్ అధికారులు చిరు దుకాణాలను ఏమాత్రం కనికరం లేకుండా నేలమట్టం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉంది. కానీ, దుకాణాలను తొలగించిన స్థానంలో కార్పొరేట్ వ్యాపార సంస్థల వాహనాలను పార్కింగ్​కు ఉపయోగిస్తున్నారు. పేదల చిరు దుకాణాలు ట్రాఫిక్ కు అడ్డొస్తాయని తొలగించారు. కానీ, వాహనాలను పార్కింగ్ చేస్తే మాత్రం పట్టించుకోక పోవడంలో ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed