ఒకే పుల్లను ఎందరి నోట్లో పెట్టి టెస్టులు నిర్వహిస్తారు..? పోలీసులను ప్రశ్నిస్తున్న జనం

by Sridhar Babu |   ( Updated:2021-12-18 00:30:00.0  )
breath-analyser
X

దిశ, పరకాల: డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులకు కరోనా నిబంధనలు వర్తించవా..? ఒకే పుల్ల ఎందరి నోట్లో పెట్టి టెస్టులు నిర్వహిస్తారంటూ డీవైఎఫ్ఐ హనుమకొండ జిల్లా నేతలు మంద సురేష్, దొగ్గెల తిరుపతి.. పరకాల పోలీసుల తీరుపై సోషల్ మీడియా వేదికగా విమర్శలకు దిగారు. దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అవగాహన కల్పించాల్సిన పోలీసులే.. ఒకే పుల్లతో పలువురికి డ్రంక్ అండ్ డ్రైవ్ విషయంలో బ్రీత్ అనలైజర్ టెస్ట్ నిర్వహించడమంటే ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడడమేనన్నారు.

శుక్రవారం రాత్రి వెల్లంపల్లి క్రాస్ పెద్దరాజిపేట స్టేజీ వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లు నిర్వహిస్తున్న పోలీసులకు పుల్ల మార్చాలని వాహనదారులు కోరినప్పటికీ ఎస్సై ప్రశాంత్ బాబు పుల్ల మార్చకపోగా అడిగిన వారినే దబాయిస్తున్నారంటూ ఆరోపించారు. కరోనా కంటే ఒమిక్రాన్ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తూ ఉంటే పరకాల పోలీసులు మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరించడం శోచనీయమన్నారు. పరకాల పోలీసుల తీరుపై పోలీస్ కమిషనర్ స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై పరకాల ఎస్సై ప్రశాంత్ బాబు వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

Advertisement

Next Story