బెగ్గర్ ఫర్ బిగ్గర్ కాజ్.. క్లాప్స్ కొట్టకుండా ఉండలేం!

by vinod kumar |
బెగ్గర్ ఫర్ బిగ్గర్ కాజ్.. క్లాప్స్ కొట్టకుండా ఉండలేం!
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వేళ.. మానవత్వం పరిమళించింది. రెండేళ్ల చిన్నారుల నుంచి శతాధిక వృద్ధుల వరకు.. ఎవరికి తోచినంత వారు కరోనా బాధితులకు, వలస కూలీలకు, అనాథలకు అందజేస్తూ తమ ఔదార్యాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన ఓ భిక్షకుడు కూడా పది వేల రూపాయల్ని విరాళంగా ఇచ్చి తన పెద్ద మనసును చాటుకున్నారు. 68 ఏళ్ల పూల్ పాండియన్ రెండు చిరిగిపోయిన బ్యాగులను ఓ చేత పట్టుకుని, మాసిపోయిన బట్టలతో మదురై కలెక్టర్ కార్యాలయం ఎదుట నిలుచున్నాడు. కలెక్టర్ రాగానే.. తన మరోచేతిలో ఉన్న పది వేల రూపాయలను ‘సీఎం పబ్లిక్ రిలీఫ్ ఫండ్’కు దానం చేశాడు. తాను భిక్షాటన చేయగా వచ్చిన డబ్బును ఈ విధంగా సాయం చేస్తున్నట్లు పూల్ పాండియన్ తెలిపాడు.

తూత్తుకుడి జిల్లా ఆలంకినరుకు చెందిన పూల్‌ పాండియన్‌.. చుట్టుపక్కల ప్రాంతాల్లో భిక్షమెత్తుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. భిక్షమెత్తగా వచ్చిన డబ్బులను పొదుపు చేయడం అతడికి అలవాటు. అలా పొదుపు చేసిన డబ్బులతో తూత్తుకుడి, తంజావూరు, పడుకొట్టాయ్ జిల్లాల్లోని పలు పాఠశాలలకు టేబుళ్లు, కుర్చీలు, మ్యాట్స్, స్టేషనరీ ఐటెమ్స్, వాటర్ ప్యూరిఫయర్ వంటివి అందజేస్తుంటాడు. లాక్‌డౌన్ ప్రకటించగానే మదురైకి వచ్చిన పాండియన్‌.. పలు ప్రాంతాల్లో భిక్షాటన చేస్తున్నాడు. ‘నాకు ఎవరో ఒకరు తినడానికి సాయం చేస్తుంటారు, కరోనా సమయంలో అధికారులు తనకు ఆహారం సమకూరుస్తున్నారు. కానీ, కరోనా వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎంతోమంది పస్తులుంటున్నారు. అందుకే ఈ డబ్బులను సీఎం రిలీఫ్ ఫండ్‌‌కు అందజేశాను’ అని అతడు తెలిపాడు.

Advertisement

Next Story