తొలి టెస్టులో పాక్‌దే విజయం

by Shyam |
తొలి టెస్టులో పాక్‌దే విజయం
X

దిశ, స్పోర్ట్స్ : పాకిస్తాన్‌లో పర్యటిస్తున్న దక్షిణాఫ్రికా జట్టు ఆడిన తొలి టెస్టులో పరాజయం పాలైంది. కరాచీలోని జాతీయ స్టేడియంలో జనవరి 26న ప్రారంభమైన తొలి టెస్టు నాలుగో రోజు ముగిసింది. టాస్ గెల్చిన సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. డీన్ ఎల్గర్ (58), జార్జ్ లిండే (35) రాణించడంతో తొలి ఇన్నింగ్స్‌లో 220 పరుగులకు ఆలౌట్ అయ్యింది. పాకిస్తాన్ బౌలర్లు యాసిర్ షా 3, నౌమన్ అలీ 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్తాన్ జట్టు ధీటైన సమాధానం ఇచ్చింది. ఫవాద్ ఆలమ్ (109), ఫాహిమ్ అష్రాఫ్ (64) రాణించడంతో పాకిస్తాన్ జట్టు 378 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ అయ్యింది.

తొలి ఇన్నింగ్స్‌లో పాకిస్తాన్‌కు 158 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా జట్టును పాకిస్తాన్ బౌలర్లు బెంబేలెత్తించారు. నౌమన్ అలీ 5 వికెట్లతో చెలరేగాడు. అతనికి తోడు యాసిర్ షా 4 వికెట్లు తీసి సఫారీల బ్యాటింగ్‌కు అడ్డు కట్ట వేశారు. దీంతో దక్షిణాఫ్రికా జట్టు 245కే ఆలౌట్ అయ్యింది. మాక్రమ్ (74), రస్సీ వాన్ డస్సెన్ (64) జట్టును ఆదుకున్నారు. మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ చేతులెత్తేశారు. దీంతో పాకిస్తాన్ ముందు 88 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచారు.

లక్ష్య ఛేదనకు దిగిన పాకిస్తాన్ జట్టు మూడు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. అజర్ అలీ (31 నాటౌట్), బాబర్ ఆజమ్ (30) కలసి పాకిస్తాన్ జట్టుకు విజయాన్ని అందించారు. కెప్టెన్‌గా బాబర్ అజమ్‌కు ఇదే తొలి విజయం. ఫవాద్ ఆలమ్‌కు మ్యాన్ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

స్కోర్ బోర్డు క్లుప్తంగా

సౌత్ ఆఫ్రికా
తొలి ఇన్నింగ్స్ 220 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్ 245 ఆలౌట్

పాకిస్తాన్
తొలి ఇన్నింగ్స్ 378 ఆలౌట్
రెండో ఇన్నింగ్స్ 90/3

Advertisement

Next Story