పెయిడ్ క్వారంటైన్లు సిద్ధం: మాధవీలత

by srinivas |
పెయిడ్ క్వారంటైన్లు సిద్ధం: మాధవీలత
X

కరోనా వైరస్ వ్యాప్తి లాక్‌డౌన్ నేపథ్యంలో వివిధ దేశాల్లో చిక్కుకున్న తెలుగువారు రేపు గన్నవరం విమానాశ్రయం ద్వారా రాష్ట్రంలో అడుగుపెట్టనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో వారందర్నీ క్వారంటైన్ కేంద్రాల్లో ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే అక్కడ సరైన సౌకర్యాలు ఉండవని భావించేవారి కోసం పెయిడ్ క్వారంటైన్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసినట్టు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టరు, పర్యవేక్షాణాధికారి మాధవీలత తెలిపారు.

గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన వారందరినీ 14 రోజుల పాటు క్వారంటైన్ కు తరలిస్తామని అన్నారు. పెయిడ్ క్వారంటైన్‌లలో నాలుగు కేటగిరీలుగా రూమ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. అక్కడ వారు కోరుకున్న సౌకర్యాలు వివిధ ధరల్లో లభిస్తాయని ఆమె వెల్లడించారు. అంతే కాకుండా పెయిడ్ క్వారంటైన్స్ వద్ద మెడికల్, పారిశుద్ధ్య సిబ్బంది అందుబాటులో ఉంటారని, పోలీసుల పర్యవేక్షణలో ప్రత్యేక నిఘా ఉంటుందని అన్నారు.

కాగా, విదేశాల నుంచి వచ్చిన వారిని విమానాశ్రయం నుంచి ప్రత్యేక బస్సుల్లో హోటల్స్ కు తరలిస్తామని చెప్పారు. 14 రోజుల తర్వాత కరోనా పరీక్షలు చేసి నెగిటివ్ వస్తేనే ఇళ్లకు పంపుతామని అన్నారు. ఆరోగ్యసేతు యాప్‌లో అందరినీ రిజిస్టర్ చేస్తామని, విదేశాల నుంచి వచ్చిన వారందరికీ ఇండియా సిమ్ కార్డులు ఇస్తామని వివరించారు. కృష్ణా, ఉభయగోదావరి, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన రెండు వేల మంది గన్నవరం ఎయిర్ పోర్టుకు రావొచ్చని అంచనా.

Advertisement

Next Story