కౌశిక్ రెడ్డి రెంటికీ చెడ్డ రేవ‌డేనా..?

by Anukaran |   ( Updated:2023-03-20 20:38:18.0  )
Huzurabad Bypolls
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: హుజురాబాద్‌లో బలమైన నాయకునిగా ఎదిగిన కౌశిక్ రెడ్డి భవితవ్యం అగమ్యగోచరంగా తయారైందా? అన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా సాగుతోంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ సోదరుడిగా కాంగ్రెస్ పార్టీలో ఎదిగినప్పటికీ.. కౌశిక్ మాత్రం హుజురాబాద్‌లో ముఖ్యనేతగా తన పట్టు సాధించుకున్నారు. రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీకి పెద్దదిక్కుగా నిలుస్తారని భావించినప్పటికీ.. అనూహ్య పరిణామాలు ఆయనను చుట్టుముట్టాయి. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కొద్ది సేపటికే బహిష్కరణకు గురయ్యారు. అయితే ఇప్పుడు అసలైన చర్చ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా కౌశిక్ బరిలో నిలుస్తారా? లేదా? అన్నదే హాట్ టాపిక్‌గా మారింది.

కాంగ్రెస్ అభ్యర్థి ఖాయమనే ప్రచారం

రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గా నియామకం అయిన తరువాత కౌశిక్ రెడ్డికి టికెట్ ఇస్తారా? లేదా? అన్న చర్చ జరిగినప్పటికీ.. హుజురాబాద్ కాంగ్రెస్‌లో కౌశిక్ అంత చరిష్మా ఉన్న నాయకుడు ఎవరూ లేరన్నది వాస్తవం. దీంతో చివరి నిమిషంలో అయినా కౌశిక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయని భావించారంతా. గత అసెంబ్లీ ఎన్నికల్లో 61 వేల ఓట్లు సాధించిన కౌశిక్ రెడ్డిని బైపోల్ బరిలో నిలిపితే కాంగ్రెస్ ట్రయాంగిల్ ఫైట్ లో ఉండే అవకాశాలు ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా అంచనా వేశాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డికి సోదరుడు కూడా అయిన కౌశిక్ రెడ్డి వైపు రేవంత్ మొగ్గు చూపుతారా? లేదా? అన్నదే ప్రధాన చర్చగా సాగింది. ఈ అనుమానం అటు కౌశిక్ రెడ్డి వర్గంలో కూడా నెలకొంది. రేవంత్ తప్పనిసరి పరిస్థితుల్లో ఆయనకే టికెట్ ఇవ్వాల్సి వచ్చేదన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

టీఆర్ఎస్‌లో డౌటేనా..?

అయితే టీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్న కౌశిక్ రెడ్డికి టికెట్ ఖాయామేనా? అన్నదే ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. టీఆర్ఎస్ పార్టీ చేయించిన పలు సర్వేలు, నిఘా వర్గాల నివేదికల్లో చాలా మంది పేర్లను పరిశీలించారు. ఇందులో ఎవరికి టికెట్ ఇస్తారన్నదే ఇప్పుడు అంతుచిక్కకుండా తయారైంది. గ్రౌండ్ లెవల్లో బలంగా ఉన్న ఈటలను ఓడించేందుకు అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎంపికలో మల్లగుల్లాలు పడుతోంది. ఈ నేపథ్యంలో కౌశిక్ గులాబీ కండువా కప్పుకున్నా.. టీఆర్ఎస్ టికెట్ ఆయనకే ఖచ్చితంగా ఇస్తారా..? లేదా..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఇటీవల కాలంలో జరిగిన పరిణామాల వల్ల నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి గ్రాఫ్ కూడా క్రమక్రమంగా తగ్గిపోతోంది. ఈ విషయాన్ని నిఘా వర్గాలు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపిన నివేదికల్లో కూడా పోందుపర్చాయి. దీంతో కేసీఆర్ కౌశిక్ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసేందుకు మొగ్గు చూపుతారా? లేదా? అన్నదే మిస్టరీగా మారిపోయింది. దీంతో కౌశిక్ రెడ్డి పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడేనా? అన్న చర్చ సాగుతోంది.

నామినేటెడ్ పోస్టుతో…?

కౌశిక్ రెడ్డి చేరికలో ఎలాంటి కండిషన్స్ లేవని తెలుస్తోంది. తన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తానని మాట ఇస్తానంటేనే పార్టీలో చేరుతానని కౌశిక్ నుండి ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని టీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. దీంతో కౌశిక్ పార్టీ మారినందున రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్టు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. క్రికెటర్ అయిన కౌశిక్ రెడ్డికి శాప్ ఛైర్మన్ పదవి కట్టబెడతారన్న ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

Advertisement

Next Story