ఓటీటీ రెగ్యులేషన్ ప్లాన్ ఏంటో చెప్పాలి: సుప్రీం

by Shamantha N |
supreme court
X

న్యూఢిల్లీ: ఓవర్ ద టాప్(ఓటీటీ) వేదికలు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ ప్లస్, హాట్‌స్టార్‌లాంటి వాటిని నియంత్రించడానికి రూపొందించిన ప్రణాళిక ఏమిటని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ఎలాంటి ప్రతిపాదనలు చేశారని అడిగింది. ఓటీటీ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నదని, ఇంకా ప్రణాళిక తుది రూపు తీసుకోలేదని అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్ సమాధానమిచ్చారు. ‘ఇంకా ఆలోచనల్లోనే ఉన్నదంటే ఒప్పుకోం. అందరూ అదే విధంగా మాట్లాడుతున్నారు’ అంటూ సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే అన్నారు. గతేడాది అక్టోబర్‌లోనే ఓటీటీ నియంత్రణపై కేంద్ర ప్రభుత్వం, సమాచారం, ప్రసారం మంత్రిత్వ శాఖ, ఇంటర్నెట్, మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాలకు సుప్రీంకోర్టు నోటీసులూ జారీ చేసింది.

ఓటీటీలను నియంత్రించడానికి ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన ఒక సంస్థను ఏర్పాటు చేయాలని అడ్వకేట్ శశాంక్ శేఖర్ ఝా, అపూర్వ అరతియాలు వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే సీజేఐ జస్టిస్ ఎస్ఏ బాబ్డే సారథ్యంలో జస్టిస్ ఏఎస్ బోపన్నా, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌లకు సూచనలు చేసింది. ఓటీటీ నియంత్రణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక ప్రణాళికను తయారుచేసిందని, వారు నేరుగా కేంద్ర ప్రభుత్వానికే గుర్తుచేస్తే సరిపోతుందని సూచించింది. అలాగే, ఓటీటీ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ప్రతిపాదనలు ఏమిటని అదనపు సొలిసిటర్ జనరల్ సంజయ్ జైన్‌ను అడిగింది. ఆ ప్రణాళిక ఇంకా పూర్తి కాలేదని జైన్ వివరించారు. దీంతో ఆరు వారాల్లో పూర్తి వివరణ సమర్పించాల్సిందిగా ఆదేశించింది. ఇటీవలే కేంద్ర సమాచారం, ప్రసారాల మంత్రి ప్రకాశ్ జవడేకర్ రాజ్యసభలో ఓటీటీ రెగ్యులేషన్ గైడ్‌లైన్స్ రూపకల్పన దాదాపు పూర్తయిందని, త్వరలోనే నోటిఫై చేస్తామని తెలపడం గమనార్హం.

డిజిటల్ కంటెంట్‌ను నియంత్రించే సంస్థ లేదు

కరోనా కారణంగా సినిమా థియేటర్లు పూర్తిస్థాయిలో ఇంకా తెరుచుకోలేదు. ఫిలిం మేకర్లు, ఆర్టిస్టులు ఓటీటీల్లో తమ సినిమాలు, సిరీస్‌లను విడుదల చేస్తున్నారు. ప్రేక్షకుల్లోనూ ఆదరణ లభిస్తున్నది. కుప్పలు తెప్పలుగా వచ్చిపడుతున్న ఈ చిత్రాలను పర్యవేక్షించే, నియంత్రించే సంస్థ లేదు. ఈ నేపథ్యంలోనే పలు చిత్రాలు, సిరీస్‌లపై వివాదాలు ముందుకు వచ్చాయి. న్యాయస్థానాల ముంగిటకూ వచ్చాయి. లీలా, పాతాల్ లోక్, ది సూటబుల్ బాయ్, మిర్జాపూర్ 2, తాండవ్ సహా పలు చిత్రాలు, సిరీస్‌లపై అభ్యంతరాలు, నిరసనలు పెల్లుబికాయి. కేసులూ పెరుగుతున్నాయి. సినీ పరిశ్రమ సెన్సార్ బోర్డు ఏర్పాటు చేసుకున్నట్టే ఓటీటీలూ రెగ్యులేషన్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని కేంద్రం సూచించింది. కానీ, కేంద్రం సూచించిన సెల్ఫ్ రెగ్యులేషన్ కాండక్ట్‌పైనా ప్రధాన ఓటీటీ సంస్థలు సంతకాలు చేయకపోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed