స్వీట్ హౌస్‌లో ఇద్దరు యువకులతో కలిసి రెచ్చిపోయిన యువతి.. సీసీ కెమెరాలో అంతా రికార్డ్!

by Bhoopathi Nagaiah |
స్వీట్ హౌస్‌లో ఇద్దరు యువకులతో కలిసి రెచ్చిపోయిన యువతి.. సీసీ కెమెరాలో అంతా రికార్డ్!
X

దిశ, వెబ్‌డెస్క్: యువత జల్సాలకు అలవాటుపడి పక్కదారి పడుతుందనడానికి ఇదే చక్కటి ఉదాహారణ. స్వీట్ హౌస్‌కు వచ్చి ఫుల్‌గా తిని ఆపై డబ్బులు అడిగిన యజమానిపైనే దాడికి పాల్పడ్డారు. ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. యువతితో కలిసి ఇద్దరు యువకులు స్వీట్ షాప్ యజమానిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరిచారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ఆదివారం సాయంత్రం జగిత్యాల సెంటర్లో ఉన్న ఓ స్వీట్ హౌస్‌కు ఇద్దరు యువకులతో కలిసి ఓ యువతి వచ్చింది. ఆ సమయంలో వాళ్లు మద్యం సేవించి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే స్వీట్ హౌస్‌కు వచ్చిన ఆ ముగ్గురు స్వీట్స్ ఆర్డర్ చేసి కావాల్సినన్ని తిన్నారు. ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా వెళ్తుండటంతో షాపు యజమాని వారిని బిల్లు చెల్లించాలని అడిగాడు. దీంతో ఆగ్రహించిన యువతి స్వీట్ హౌస్‌ ఓనర్‌తో వాగ్వాదానికి దిగింది. ఇదే సమయంలో ఆమెతో వచ్చిన యువకుడు షాప్ యజమాని కాలర్ పట్టుకుని కడుపులో పిడుగుద్దులు గుద్దాడు. మరో యువకుడు వచ్చి తలపై దాడి చేశాడు. ఇలా ఇద్దరు కలిసి ఇష్టానుసారంగా కొట్టారు.

ఈ దృశ్యాలను చూసిన మిగతా కస్టమర్లు వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినా మద్యం మత్తులో ఉన్న వాళ్లు దాడిని కొనసాగించారు. దెబ్బలు తట్టుకోలేని స్వీట్ హౌస్‌ ఓనర్‌ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ముగ్గురు అక్కడి నుంచి పరారీ అయ్యారు. సంఘటన స్థలానికి వచ్చిన పట్టణ పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి వివరాలు సేకరించారు. ఆ వీడియోల ఆధారంగా యువతీ, యువకుల ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story

Most Viewed