టీచర్ ఆలోచన.. విద్యార్థుల కడుపు నింపుతోంది

by Sridhar Babu |   ( Updated:2020-07-18 23:13:17.0  )
టీచర్ ఆలోచన.. విద్యార్థుల కడుపు నింపుతోంది
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు టీచర్లు పాఠాలు చెప్పి వెళ్లిపోతారు. కానీ ఆ టీచర్ స్కూల్ పరిసరాలనే మార్చారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పత్తిపాక హైస్కూల్ ఆవరణకు వెళ్తే ఆహ్లాదకరమైన వాతావరణం సాక్షత్కారిస్తుంది. ఏ స్కూల్ లోనైనా వంద శాతం రిజల్ట్ వచ్చిందని సంబుర పడిపోవడం సర్కారు విద్యా వ్యవస్థలో కనిపించే సాధారణ విషయాలు. విద్యార్థులు తరుచూ అనారోగ్యానికి గురవుతున్న విషయాన్ని గమనించి విరుగుడు కనిపెట్టారు. రక్త హీనతతో తరుచూ ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్న వారికి శాశ్వత పరిష్కారం చూపాలని భావించారు. ప్రకృతి మధ్య లభించే కూరగాయలను, ఆకు కూరలను వారికి అందించే ప్రయత్నం చేస్తున్నారా హెడ్ మాస్టర్.

అనారోగ్య బారిన స్టూడెంట్లు

ఈ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు తరుచూ అనారోగ్యంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఇది గమనించిన పత్తిపాక హైస్కూల్ హెడ్ మాస్టర్ పీర్ ఆహ్మద్ షేక్ దాదాపు మూడేళ్ల క్రితం మూలాలు వెదికే ప్రయత్నం చేశారు. ఆరా తీస్తే అందరూ రక్త సంబంధిత సమస్యతో బాధపడుతున్నారని గమనించారు. ఇందుకు పరిష్కారం కోసం గ్రామంలో ఓ పెద్దావిడ వద్దకు వెళ్లారు. ఆమె తీసుకుంటున్న ఆహారం గురించి తెలుసుకున్నారు. అనారోగ్యమంటేనే తెలియని ఆమె ఆహార అలవాట్లు తెలుసుకున్నారు. స్కూళ్లో విద్యార్థులకు ముందుగా ఐరన్ ఉండే కరివేపాకు తినిపించాలని ప్రయత్నించారు. మధ్యాహ్న భోజనంలో కరివేపాకు వేయడం ఆరంభించారు. కరివేపాకు పక్కన పడేస్తుండడం గమనించి ఆకును పొడిలా తయారు చేయించి సాంబారులో వేయించే వారు. దీంతో విద్యార్థినుల్లో ఆరోగ్య సమస్యలు తక్కవయ్యాయని ఆయన గుర్తించారు. అప్పటి నుంచి కరివేపాకు పొడిని భోజనంలో కలుపుకుని తినే విధానాన్ని స్టార్ట్ చేశారు. దీంతో ఈ పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో ముందుగా స్పూన్ కరివేపాకు పొడి వేయడం ఆరంభించారు.

స్కూల్‌లో సేంద్రియ సాగు..

స్కూల్ ఆవరణలో స్వచ్ఛమైన కూరగాయలు, పండ్లు సేంద్రియ సాగు విధానంతో సాగు చేశారు. వీటినే మధ్యాహ్న భోజనంలో వినియోగిస్తున్నారు. కంపోస్టు ఎరువు తయారు చేసే విధానాన్ని కూడా ఇక్కడే ఆరంభించారు. 20 మంది ఒక టీంగా ఏర్పాటు చేసి ఒక్కో గార్డెన్‌కు ఐదు బృందాల చొప్పున ఏర్పాటు చేశారు. రొటేషన్ పద్దతిలో ఈ టీంలు గార్డెన్లను పర్యవేక్షించే బాధ్యత కూడా అప్పగించారు. సహజ సిద్ధంగా పండిస్తున్న ఆకు కూరలను వారానికోసారి వండే విధానం స్టార్ట్ చేశారు. ఈ స్ఫూర్తితో స్టూడెంట్లు కూడా తమ ఇండ్లల్లో సేంద్రియ కూరగాయలు పండించే పద్ధతికి శ్రీకారం చుట్టడం విశేషం. పాఠ్యాంశాల బోధనతో పాటు గార్డెనింగ్ పీరియడ్ కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడంతోనే సరిపెట్టకుండా బర్త్ డే గార్డెన్ కూడా ఏర్పాటు చేశారు. ఈ గార్డెన్ లో పుట్టినరోజు జరుపుకునే స్టూడెంట్ ఆరోజున మొక్క తీసుకుని స్కూలుకు రావాల్సి ఉంటుంది. లేనట్లయితే టీచర్లే మొక్కను అందించి నాటిస్తారు. పదో తరగతి వరకు మొక్క నాటిన విద్యార్థికి కాపాడే బాధ్యతను అప్పగించారు.

ఇంటికో వేప, వంటికి రక్ష

పత్తిపాక హైస్కూల్ హెడ్ మాస్టార్ పీర్ ఆహ్మద్ షేక్ పనిచేసిన చోట విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించేవారు. చొప్పదండిలో పని చేస్తున్నప్పుడు ఒక విద్యార్థి స్కూలుకు గైర్హాజరు కాకుండా హాజరయ్యేది. ఏంటా విషయం అని ఆరా తీస్తే వారి ఇంట్లోని బావి చుట్టూ వేప చెట్లు ఉండడంతో నీరు, గాలి స్వచ్ఛంగా అందుకుంటుందని గమనించారు. ఆ తరువాత స్కూల్ ఆవరణలో విద్యార్థులను వేప చెట్ల కింద కొంతమందిని, వేరే రకాల చెట్ల కింద మరికొంత మందిని ఆడుకోవాలని సూచించారు. కొంతకాలం తరువాత వేప చెట్ల కింద ఆడుకున్న విద్యార్థులు ఆరోగ్యంగా ఉండడాన్ని గమనించి ఇంటికో వేప, వంటికి రక్ష అన్న ప్రాజెక్టును స్టార్ట్ చేశారు. వేప చెట్ల ద్వారా వచ్చే గాలి స్వచ్ఛంగా ఉన్నదన్న విషయాన్ని గమనించే ఈ కార్యక్రామానికి శ్రీకారం చుట్టారు. ఈ తరువాత సారంగాపూర్ మండలం తుంగూరులో పని చేస్తున్నప్పుడు అజోలా అనే నాచు మొక్కను ఉపయోగించి జీవా ఎరువుగా వరిపంటను పండించారు. ప్రస్తుతం పత్తిపాకలో కరివేపాకు ప్రాజెక్టుతో విద్యార్థులకు ఆరోగ్యాన్ని అందించారు.

విద్యార్థుల ఆరోగ్యం కోసమే: పీర్ ఆహ్మద్ షేక్, హెడ్ మాస్టర్, పత్తిపాక హైస్కూల్

విధులు నిర్వర్తించే పాఠశాలలో విద్యార్థులను స్టడీ చేయడం వల్లే మూలాలను గ్రహించాను. వారిని ఆరోగ్యవ వంతులను చేయడమే అయినా, విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్న పూర్తి వివరాలు కనుగొన్న తరువాత లాభాలను గుర్తించి మిగతా వారిని ఆ దిశగా నడిపించే ప్రయత్నం చేస్తాను. విద్యతో పాటు ఆరోగ్యకరమైన జీవనం ఉన్నప్పుడే సార్థకత ఉంటుందన్నదే నా అభిప్రాయం. పత్తిపాక పాఠశాలలో నా సహచర అధ్యపక బృందమే కాదు, నాన్ టీచింగ్ స్టాఫ్, విద్యార్థులు, మధ్యాహ్న భోజనం పథకం వర్కర్లు, గ్రామ అభివృద్ధి కమిటీ ఇలా ప్రతి ఒక్కరూ నాకు చేదోడుగా నిలవడం వల్లే ఆరోగ్యకరమైన పాఠశాలగా తీర్చిదిద్దగలిగాను.

Advertisement

Next Story