దేశంలో 39శాతం స్కూళ్లలోనే కంప్యూటర్ సౌకర్యం

by Shyam |
digital-cls
X

దిశ, ఫీచర్స్: కరోనా కాలం నుంచి విద్యాసంస్థలన్నీ కూడా మూతపడిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతమంతా ‘ఆన్‌లైన్’ విద్యే నడుస్తోంది. విద్యార్థులు ఆన్‌లైన్ విద్యకు అలవాటు పడటం మాట అటుంచితే.. అసలు ల్యాప్‌టాప్స్, స్మార్ట్‌ ఫోన్స్, నెట్‌ కనెక్షన్‌ వంటి సదుపాయాలు లేని విద్యార్థులు ఇప్పటికీ తమ క్లాసులకు దూరమవుతున్నారన్నది నిర్వివాదాంశం. ఇదిలా ఉంటే కంప్యూటర్ విద్య నేర్పించాలని కేంద్రం ఎప్పటినుంచో చెబుతూనే ఉంది. కానీ విద్యావ్యవస్థ మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది. యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ నివేదిక ప్రకారం.. దేశంలో 39శాతం పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి.

2019-20లో దేశంలో 39 శాతం పాఠశాలల్లో మాత్రమే కంప్యూటర్లు ఉండగా 22శాతం మందికి మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ ఉందని యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యుడిఎస్ఇ +) నివేదిక తెలిపింది. యుడిఎస్ఇ 15లక్షలకు పైగా పాఠశాలలను అంచనా వేసిన తర్వాత ఈ నివేదికను రూపొందించింది. 84 శాతం పాఠశాలలు తమ ప్రాంగణంలో లైబ్రరీలను కలిగి ఉన్నప్పటికీ, ఆ గ్రంథాలయాలలో 69.4శాతం మాత్రమే పుస్తకాలు ఉన్నాయని డేటా చూపిస్తుంది.

వివిధ రాష్ట్రాల్లోని డిజిటల్ విభజనను ఈ నివేదిక హైలైట్ చేసింది. అనేక కేంద్రపాలిత ప్రాంతాలతో పాటు కేరళలో 90 శాతం పాఠశాలలకు ఇంటర్నెట్ సదుపాయం ఉంది. ఛత్తీస్‌గడ్, జార్ఖండ్ రాష్ట్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో కంప్యూటర్ సదుపాయాలను ఏర్పాటు చేయడం సత్ఫలితాలను అందించిందని నివేదిక పేర్కొంది. దీనికి విరుద్ధంగా, తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో, ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థులకు మెరుగైన డిజిటల్ అవకాశాలను కలిగి ఉండగా, దురదృష్టవశాత్తు, అస్సాం (13 శాతం), మధ్యప్రదేశ్ (13 శాతం), బీహార్ (14 శాతం), త్రిపుర (15 శాతం), ఉత్తర ప్రదేశ్ (18 శాతం) వంటి రాష్ట్రాల్లో విద్యార్థులకు కంప్యూటర్ సౌకర్యాలు లేవు.

83 శాతానికి పైగా పాఠశాలలు విద్యుత్తును కలిగి ఉన్నట్లు వెల్లడి కాగా, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది దాదాపు 7శాతం మెరుగుపడింది. భారతదేశంలో 84 కి పైగా పాఠశాలలకు 2019-20లో లైబ్రరీ / రీడింగ్ రూమ్ / రీడింగ్ కార్నర్ ఉండగా, అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే దాదాపు 4 శాతం వృద్ది చెందింది. ప్రీ-ప్రైమరీ విద్య కోసం ఎక్కువ మంది బాలికలు చేరగా 2018-19 విద్యా సంవత్సరంతో పోల్చితే 2019-20లో బాలికల నమోదు అన్ని స్థాయిలలో పెరిగిందని అంచనా.

Advertisement

Next Story

Most Viewed