బ్లాక్ ఫంగస్ మందులకు ‘ఆన్‌లైన్‘ రిక్వెస్ట్..

by Shyam |   ( Updated:2021-05-19 11:06:21.0  )
బ్లాక్ ఫంగస్ మందులకు ‘ఆన్‌లైన్‘ రిక్వెస్ట్..
X

దిశ, తెలంగాణ బ్యూరో : బ్లాక్ ఫంగస్ కేసులు పెరుగుతుండడంతో ఆ చికిత్సకు వాడే మందులను ఇకపైన ఆన్‌లైన్ ద్వారా ప్రభుత్వ అనుమతితో పొందాల్సిందే. రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ తాజాగా విడుదల చేసిన సర్క్యులర్‌తో ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టింది. ఆస్పత్రిలో బెడ్‌మీద ఉన్న పేషెంట్ కోసం బ్లాక్ ఫంగస్ చికిత్సకు అవసరమయ్యే మందులు కావాలంటే ఆ పేషెంట్ సహాయకులు ఆస్పత్రి ద్వారా డీఎంఈ (వైద్య విద్య డైరెక్టర్) నేతృత్వంలోని కమిటీకి దరఖాస్తు చేసుకోవాల్సిందే. అనంతరం ముగ్గురి సభ్యులతో కూడిన ఆ కమిటీ అనుమతి ఇచ్చిన తర్వాతనే పేషెంట్‌కు మందు అందుబాటులోకి వస్తుంది. ఇందుకోసం దరఖాస్తు ఎలా చేసుకోవాలో నమూనా ప్రతిని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ప్రస్తుతం లైపొసొమాల్ ఆంఫొటోరెసిన్-బి, పొసాకొనజాల్, ఐసావుకొనజాల్ ఇంజెక్షన్ల వాడకం విపరీతంగా పెరిగింది. రాష్ట్రంలో వందల సంఖ్యలో ఈ వ్యాధితో బాధపడుతున్న పేషెంట్లు ఉండడంతో మందుల దుకాణాల్లో దొరకడం కష్టమైపోయింది. బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు అమ్ముతున్నట్లు గ్రహించిన రాష్ట్ర డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఆంక్షలు విధించారు. తయారీ కంపెనీలు నేరుగా స్టాకిస్టుల ద్వారా ఆస్పత్రులకే సరఫరా చేయాలని షరతు పెట్టారు. దీంతో పేషెంట్లు ఆస్పత్రి ద్వారా దరఖాస్తు చేసుకోవడం తప్పనిసరి అయింది.

ప్రభుత్వం విడుదల చేసిన నమూనా దరఖాస్తు ప్రకారం పేషెంట్ పేరు, వయసు, కోవిడ్ బారిన పడిన తేదీ, చికిత్స ప్రారంభించిన తేదీ, ఆస్పత్రి పేరు, ఎన్ని రోజులుగా ఆస్పత్రిలో ఉన్నారు, పేషెంట్ ఐపీ నెంబరు, సహాయకుల మొబైల్ నెంబరు, పేరు, మెయిల్ ఐడీ తదితరాలను సమర్పించాల్సి ఉంటుంది. ఆస్పత్రి పేరు, చికిత్స అందిస్తున్న డాక్టర్ పేరు, అడ్రస్, సూపరింటెండెంట్ పేరు, మొబైల్ నెంబరు, మెయిల్ ఐడీ తదితరాలను కూడా డీఎంఈకి మెయిల్ ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. ఇలా వచ్చిన రిక్వెస్టులను ముగ్గురి సభ్యుల కమిటీ పరిశీలించి ఆ మందులను సమకూర్చుకోడానికి అనుమతి జారీ చేస్తుంది.

అయితే దరఖాస్తు చేసుకున్న తర్వాత కమిటీ దృష్టికి వెళ్లి పరిశీలించి అనుమతి జారీ చేయడానికి సమయం పడుతుంది. కాబట్టి అత్యవసర సమయంలో ఆ మేరకు పేషెంట్‌కు ఇంజెక్షన్లు అందుబాటులోకి రాకుండా టైమ్ వేస్ట్ అయినట్లేనన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే టోసిలిజుమాబ్ లాంటి మందుల విషయంలో ఈ కమిటీ దృష్టికి వెళ్ళి అనుమతి తెచ్చుకోవడం ప్రహసనంగా మారిందని కార్పొరేటు, ప్రైవేటు ఆస్పత్రుల డాక్టర్లు మొత్తుకుంటున్నారు.

Advertisement

Next Story