వారి నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం.. ఆరేళ్లుగా ఆదిలోనే పాఠశాల భవన నిర్మాణం

by Aamani |   ( Updated:2021-11-17 02:45:27.0  )
వారి నిర్లక్ష్యం విద్యార్థులకు శాపం.. ఆరేళ్లుగా ఆదిలోనే పాఠశాల భవన నిర్మాణం
X

దిశ,బెజ్జుర్ : అధికారుల నిర్లక్ష్యం విద్యార్థులకు శాపంగా మారింది. దీనికి నిదర్శనం బెజ్జూర్ మండలం కుకూడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఈ పాఠశాలకు 2014 ,15 సంవత్సరంలో ప్రభుత్వం రాజీవ్ విద్యా మిషన్ కింద రూ 22 లక్షలతో నిధులు మంజూరు చేసింది. అట్టి పనులను సంబంధిత అధికారులు గుత్తేదారు ఆర్భాటంగా ప్రారంభించినప్పటికీ కనీసం ఆరు సంవత్సరాలు అయినా ఆ భవనం పూర్తి కాలేదు. సగం వరకు పనులు చేసి నిర్మాణ దశలోనే వదిలివేశారు. దీంతో విద్యార్థులకు తిప్పలు తప్పడం లేదు. నిధులు ఉన్నప్పటికీ పూర్తి చేయడంలో సంబంధిత అధికారులు, గుత్తేదారు అశ్రద్ధ వహిస్తున్నారని ఆ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలో విద్యార్థులకు గదులు లేకపోవడంతో అసౌకర్యాల మధ్య బోధన కొనసాగుతుంది. పాఠశాలకు కనీస వసతులు అయినా గదులు మరుగుదొడ్లు, బాత్రూం లేకపోవడంతో విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు.ప్రభుత్వం మంచి ఉద్దేశ్యంతో లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన పాఠశాల పూర్తికాకపోవడంతో నిర్మాణ దశలోనే పాఠశాల మగ్గుతుందని అక్కడి ప్రజలు అధికారులపై మండి పడుతున్నారు.

ఈ పాఠశాలలో 160 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. 1 నుంచి 8 వరకు తరగతులు కొనసాగుతున్నాయి. కానీ, ఇద్దరు ఉపాధ్యాయులు ఉండడంతో బోధన సక్రమంగా జరగడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతే కాకుడా ఒక ఉపాధ్యాయున్ని షిఫ్ట్ చేశారు. దీనిపై జిల్లా విద్యాధికారి ఇటీవల పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కైలాష్ ఫిర్యాదు చేశారు. ఈ మండల పరిషత్ పాఠశాలలో ఉర్దూ ఇంగ్లీష్ మీడియం సైతం కొనసాగుతున్నాయి. ఒకే గ్రామంలో తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ , మీడియం పాఠశాలలు ఉన్నప్పటికీ అసౌకర్యాల నిలయంగా మారింది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి కుకూడ గ్రామంలో అసంపూర్తిగా ఉన్న పాఠశాలను పూర్తిచేసే విధంగా చర్యలు చేపట్టి విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై బెజ్జూర్ మండల విద్యాధికారి రమేష్ బాబు వివరణ కోరగా కుకూడ ప్రాథమిక పాఠశాల అసంపూర్తిగా ఉన్న విషయం వాస్తవమేనని ఈ విషయమై జిల్లా విద్యాధికారి‌కి నివేదిక అందజేసినట్లు ఆయన తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed