ఎన్‌పీఏలు భారీగా పెరిగే అవకాశం : ఫిక్కీ-ఐబీఏ

by Harish |
ఎన్‌పీఏలు భారీగా పెరిగే అవకాశం : ఫిక్కీ-ఐబీఏ
X

దిశ, వెబ్‌డెస్క్: 2020 ద్వితీయార్ధంలో బ్యాంకుల ఆస్తుల నాణ్యత మెరుగ్గా నమోదైన తర్వాత 2021 మొదటి ఆరు నెలల్లో దిగజారే అవకాశాలున్నాయని ఓ సర్వే తెలిపింది. గతేడాది జులై-డిసెంబర్ మధ్య ఫిక్కీ-ఐబీఏ నిర్వహించిన బ్యాంకర్ల సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. ప్రభుత్వ, ప్రైవేట్ రంగం, విదేశీ బ్యాంకులతో సహా 20 బ్యాంకుల నుంచి ఈ వివరాలను సర్వే సేకరించింది. ఇవి మొత్తం బ్యాంకింగ్ పరిశ్రమలో 59 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. సర్వే ప్రకారం..దాదాపు 68 శాతం బ్యాంకులు 2021 మొదటి అర్ధ భాగంలో ఎన్‌పీఏల స్థాయి 10 శాతానికి మించి ఉంటాయని భావిస్తున్నాయి.

37 శాతం బ్యాంకులు ఎన్‌పీఏ స్థాయిలు 12 శాతానికిపైగా ఉంటాయని అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో ఆర్‌బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదికలో 2021 సెప్టెంబర్ నాటికి బ్యాంకుల స్థూల నిరర్ధక ఆస్తులు(ఎన్‌పీఏ) 13.5 శాతానికి పెరగవచ్చని తేలింది. తాజా సర్వేలో ఎక్కువ శాతం బ్యాంకులు అధిక ఎన్‌పీఏల రిస్క్ ఉన్న రంగాల్లో పర్యాటక, ఆతిథ్యం, ఎంఎస్ఎంఈ, విమానయాన, రెస్టారెంట్ రంగాల్లో ఉండొచ్చని తెలిపాయి. పర్యాటకం, ఆతిథ్య రంగంలో ఎన్‌పీఏలు అత్యధికంగా ఉంటాయని 55 శాతం బ్యాంకులు చెప్పగా, మిగిలిన వారు ఎన్‌పీఏలు మోస్తరుగా పెరిగే అవకాశం ఉందని స్పష్టం చేశారు. మౌలిక సదుపాయాలు, ఔషధాలు, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల్లో దీర్ఘ కాలిక రుణ డిమాండ్ పెరుగుతోందని బ్యాంకులు అభిప్రాయపడ్డాయి.

Advertisement

Next Story

Most Viewed