దుకాణం చిన్నగా ఉందని చీప్ అనుకుంటున్నారేమో.. టర్నోవర్ ఎంతో తెలిస్తే గుండె ఆగినంత పనైతది!

by Gantepaka Srikanth |
దుకాణం చిన్నగా ఉందని చీప్ అనుకుంటున్నారేమో.. టర్నోవర్ ఎంతో తెలిస్తే గుండె ఆగినంత పనైతది!
X

ఖర్జూరం చూడ్డానికి నల్లగా, ముడతలు పడి అంద విహీనంగా ఉంటుంది. కానీ.. తింటే మాత్రం దాని రుచే వేరు. మర్రి గింజ చూడ్డానికి ఆవ గింజకంటే చిన్నదే. కానీ.. అది మొలకెత్తి, వృక్షంగా మారితే ఎందరికో నీడనిస్తుంది. ‘హే.. ఏముంది లే బతుకు దెరువుకోసం టీ కొట్టు నడుపుకుంటున్నా’డని కొందరు చాయ్ వాలాను చీప్‌గా చూస్తుంటారు. ఉద్యోగం లేనప్పుడో, ఉపాధి దొరకనప్పుడో.. ‘జర చాయ్ బండి పెట్టుకో బిడ్డ పొట్టకూటికన్నా ఎల్తది కదా’ అని పెద్దలు సలహా ఇస్తే.. ఛీ ఛీ.. నేనా.. ఇంత చదువు చదివి చీప్‌గా చాయ్ అమ్మితే ఏమైనా ఉంటదా! ఇజ్జత్ సర్రున జారిపోదూ! అని తెగ ఫీలైపోతుంటరు కొందరు. కానీ కొందరు అలా కాదు.. శ్రమను గౌరవిస్తారు. పనిచేసుకోవడానికి నామోషీ ఫీలింగ్ దేనికీ పనికిరాదని నమ్ముతారు. అలాంటి వారిలో ‘చాయ్ వాలా’లు కూడా ఉన్నారు. కొందరి సక్సెస్ స్టోరీస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎండీ జావిద్ పాషా

కేవలం టీ కొట్టు నడుపుతూనే లైఫ్‌లో సంతోషంగా బతుకున్నవారు చాలా మంది ఉన్నారు. కొందరు కోటీశ్వరులై ఉపాధిమార్గం కల్పిస్తున్నారు. ఇంకొందరి జీవితంలో ‘చాయ్ బండి’నే ప్రధాన జీవనాధారం. ఇలా చాయ్ అమ్ముతూ.. హ్యాపీగా బతుకుతూ.. ఎందరికో ప్రేరణగా నిలుస్తున్నారు టీ కొట్టు నడుపుతున్న పలువురు. అంతెందుకు స్వయానా మన దేశ ప్రధాని కూడా ఒకప్పుడు ట్రైన్‌లో ‘చాయ్ వాలా’నే కదా! అంతటి గొప్ప నేపథ్యముంది కాబట్టే.. చాయ్ పే చర్చ దేశప్రజలను ఆకట్టుకుంది. మరి మనకెందుకు బ్రో నామోషి.. ఏ దిక్కూ లేనప్పుడు చాయ్ డబ్బే పెద్ద దిక్కని ఎందుకు అనుకోవద్దు! అలా అనుకోవడంవల్ల ‘కొందరు చాయ్ వాలా’ల జీవితాలు అద్భుతంగా మారాయి.

లగ్జరీ కారునే టీ కొట్టుగా మార్చి..

గ్రీన్ టీ, లెమన్ టీ, మసాలా టీ.. పుదీనా టీ.. ఇలా రకరకాల పేర్లున్నట్లు వాటిని అమ్మే వారు కూడా రకరకాల పద్ధతుల్లో ఫేమస్ అయ్యారు. అలాంటి ఓ వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి ఈ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. వైరల్ సమాచారం ప్రకారం.. ముంబైకి చెందిన మన్ను శర్మ ఉన్నత కుటుంబంలో పుట్టి పెరిగాడు, ఉన్నత చదువులు చదివాడు. లగ్జరీ కార్లలో తిరిగాడు.. కానీ చివరికి ఏ ఉద్యోగం చేయలేక ఇబ్బంది పడి చివరికి తన ఆడి కారునే టీ కొట్టుగా మార్చేసి వ్యాపారం ప్రారంభించాడు. తన కారు బ్యాక్ సైడ్‌లో టీ చేసేందుకు అవసరమైన వస్తువులు, ఇతర సామ్రగి పెట్టుకొని పలు ప్రాంతాల్లో తిరుగుతూ జనాలు ఎక్కువగా ఉండే చోట ఆగి టీ అమ్ముతాడు. ‘‘ప్రస్తుతం ఆన్ డ్రైవ్ టీ’ పేరుతో ముంబైలోని లోఖండ్ వాలాలో అతని టీ కొట్టుకు జనాలు ఎగబడుతుంటారు. ‘థింక్ లగ్జరీ.. డ్రింక్ లగ్జరీ’ ట్యాగ్ లైన్ పేరుతో ఉన్న ఇతని వాహనం వద్ద టీ తాగేందుకు చాలామంది ఆసక్తి చూపుతారు. అయితే ఒక టీ ధర రూ. వంద చెల్లించుకోవాల్సిందే ఇప్పుడు.

కోటీశ్వరుడైన చాయ్ వాలా

కృషి ఉంటే మనుషులు రుషులవుతారు అంటారు. పట్టుదల, కష్టపడే తత్వం మనలో ఉన్నప్పుడు టీ కొట్టు పెట్టుకున్నా సంతోషంగా బతకొచ్చు. కొన్నిసార్లు కలిసొస్తే కోటీశ్వరులైపోవచ్చునని కూడా నిరూపించిన ఓ వ్యక్తి వీడియో నెట్టింట ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే. అతని పేరు డాలీ. దేశ రాజధాని ఢిల్లీకి చెందిన ఇతను ఒకప్పుడు కడు పేదరికంలో గడిపాడు. టీ కొట్టు నడుపుతూ తాను కోట్లు సంపాదించానని, ఒక్కో మెట్టు ఎదుగుతూ.. వచ్చానని, ఇప్పుడు దేశ, విదేశాల్లో తిరుగుతున్నానని చెప్పుకొచ్చాడు. అతనెవరో కాదు.. ఢిల్లీకి చెందిన మిలియనీర్ అయిన సుధామా టీ విక్రేత.. ఇటీవల ఈ వీడియో వైరల్ కాగా.. అది చూసినవారు ‘చాయ్ వాలా’ను తక్కువ అంచనా వేయకండి బ్రో అంటున్నారు. మరికొందరు టీ అమ్మ కోటీశ్వరుడయ్యాడంటే నమ్మలేకపోతున్నామనే అభిప్రాయాలు సైతం వెల్లడిస్తున్నారు.

నాడు టీ కొట్టు.. నేడు కోటి రూపాయల వ్యాపారం

గల్లీలో చాయ్ అమ్మే ఓ నీలికళ్ల వ్యక్తి ఆ మధ్య ప్రపంచాన్నే ఆకర్షించాడు. కారణం అతని టీ మేకింగ్ స్టైల్. టీ కొట్టు పెట్టిన కొద్ది రోజుల్లోనే అతనివద్ద చాయ్ తాగేందుకు జనం బారులు తీరడం మొదలు పెట్టడంతో వార్తల్లో నిలిచాడు. ఆ మధ్య అతనికి సంబంధించిన వీడియో ఫుల్ వైరల్ అయింది. కానీ ఇప్పుడు ఆ చాయ్ వాలాకు కోటి రూపాయల ఆఫర్ వచ్చింది. మన దేశం లెక్కనే పాకిస్తాన్‌లో రియాలిటీ షోలు, బిజినెస్ ఎక్స్ పోలు జరుగుతాయి. పెద్ద పెద్ద వ్యాపార వేత్తలు కొత్త స్టార్టప్‌లకు సహాయం చేస్తుంటారు. తమ డబ్బులను వారి వ్యాపారాల్లో పెట్టుబడి పెడుతుంటారు. 2016లో చాయ్ వాలా అర్షద్ ఖాన్ విషయంలోనూ అదే జరిగింది. అతని టీ కొట్టుకు ఎందుకంత ఆదరణ వస్తుందో, తన బ్రాండ్ ఏంటో, స్టైల్ ఏంటో ఓ ప్రదర్శనలో వెల్లడించగా.. అక్కడున్న పారిశ్రామిక వేత్తలు ముగ్దులై కోటి రూపాయల ఆఫర్ ఇచ్చారు. ఈ విషయాన్ని అతను తన సోషల్ మీడియా వేదికలో పోస్ట్ చేయగా తెగ వైరల్ అయింది. ఆ తర్వాత అతనికి మోడలింగ్ ఆఫర్లు వచ్చాయి. సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు.

ఎంబీఏ చాయ్ వాలా మరో లెవెల్!

ఆ మధ్య సోషల్ మీడియా ట్రెండింగ్‌లో నిలిచిన మరో వ్యక్తి ‘ఎంబీఏ చాయ్ వాలా’ ఈ పేరుతోనే అతను ఫుల్ పాపులర్ అయ్యాడు. అసలు పేరు ప్రఫుల్ బిల్లోర్ (Praful Billor). పేదరికంవల్ల అవస్థలు పడ్డాడు. ఓ వికలాంగ వ్యక్తి చేసిన ఆర్థిక సహాయంతో ఎలాగోలా ఎంబీ వరకు చదివాడు. కానీ 2017లో పరిస్థితి అనుకూలించక ఎంబీఏ మధ్యలోనే డ్రాపవుట్ అయిన బిల్లోర్ ఐఐఎం అహ్మదాబాద్ (IIM Ahmedabad) ప్రాంగణంలో ఓ టీ స్టాల్ పెట్టాడు. ఎంబీఏ చదివి కూడా టీ స్టాల్ పెట్టినందుకు అందరూ అతన్ని ‘ఎంబీఏ చాయ్ వాలా(MBA Chai Wala)’ అని పిలవడం మొదలు పెట్టారు. కాగా ఆ టీ స్టాల్‌, ఆ పేరు తనకెంతో కలిసొచ్చాయంటున్నాడు ప్రఫుల్ బిల్లోర్. ఆపదల నుంచి గట్టెక్కించి ఆర్థికంగా ఎదగిన తను ‘ఎంబీఏ చాయ్ వాలా’ పేరుతో పలుచోట్ల ఫుడ్ బిజినెస్ ప్రారంభించానని చెప్పుకొచ్చిన వీడియో నెట్టింట హల్ చల్ చేసింది. దీని ప్రకారం అతను దేశ వ్యాప్తంగా ఎంబీఏ చాయ్ వాలా పేరుతో 16 చోట్ల వ్యాపారాలను విస్తరించాడు. ఇప్పుడతను రూ. 90 లక్షల లగ్జరీ మెర్సిడెస్ - బెంజ్ ఎస్‌యు‌వి (Mercedes-Benz SUV)లో తిరుగుతున్నాడు. ఏ లోటూ లేకుండా సంతోషంగా ఉండటంతోపాటు ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. టీ షాప్ ఎందుకు పెట్టుకోవడం? అని సిగ్గు పడితేనో, నామోషిగా ఫీలైతేనే ఇట్లుండేవాడా?

మోడీ మెచ్చిన వరంగల్ చాయ్ వాలా..

టీ కొట్టు నడుపుతూ.. చూడ్డానికి సాదా సీదాగా ఉండే ఓ వ్యక్తి దేశ ప్రధాని చేతులు మీదుగా జాతీయ అవార్డు అందుకోవడం గతంలో ప్రజలను ఆలోచింపజేసింది. ఒక్కసారిగా ‘వరంగల్ చాయ్ వాలా’ పేరుతో సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయాడు. అసలు పేరు మెహబూబ్ పాషా.. వరంగల్ పట్టణంలోని ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో చాయ్ కొట్టు నడిపేవాడు. కాగా కరోనా సమయంలో వ్యాపారం నడవక చాలా ఆర్థిక ఇబ్బందులు పడ్డాడు. అయినా ఆ సమయంలో ఎంతోమందికి ఉచితంగానే టీ అందజేశాడు. ఆ తర్వాత ఆర్థిక ఇబ్బందులు మరింత అధికం అవడంతో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి స్వానిధి పథకం కింద విడతల వారీగా లోన్ తీసుకున్నాడు. మొదటి విడతలో రూ. 10 వేలు, రెండవ విడతలో రూ. 20 వేలు, మూడవ విడతలో రూ. 50 వేలు తీసుకొని నష్టపోయిన తన టీ బిజినెస్‌ను లాభసాటిగా మార్చుకున్నాడు. స్వానిధి పథకం కింద లోన్ పొందిన వీధి వ్యాపారుల్లో నంబర్ వన్‌గా నిలిచాడు. ఇది గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీలో 2023, జూన్ ఫస్టు నుంచి 3వ తేదీ వరకు జరిగిన పీఎం స్వనిధి ఉత్సవాల్లో మెహబూబ్ పాషాకు అవార్డును అందజేయగా.. మోడీ కూడా అతన్ని తన మన్ కీ బాత్‌లో ప్రశంసించారు.

మోడల్ చాయ్ వాలీ..

టీ స్టాల్‌లో తన అందమైన జుట్టుతో రకరకాలుగా ఫోజులిస్తున్న ఓ యువతి వీడియో ఆ మధ్య ఫుల్ వైరల్ అయింది. దాదాపు 11 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. కాగా ది హంగ్రీ పంజాబీ అనే ఫుడ్ బ్లాగింగ్ చానల్ మోడల్ చాయ్ వాలీ అంటూ ఈ టీషాప్ వీడియోను పోస్టు చేసింది. ఇందులో ఓ యువతి హెయిర్ స్టైల్ అండ్ స్టిల్స్ చూసి నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేశారు. అయితే ఆమె ఎంబీఏ చాయ్ వాలాను ఆదర్శంగా తీసుకుని తాను టీ షాప్ పెట్టానని సదరు యువతి చెప్పుకొచ్చింది. వైరల్ సమాచారం ప్రకారం.. ఈ యువతి పేరు సిమ్రాన్ గుప్త. 2018లో మిస్ గోరఖ్ పూర్ టైటిల్ విన్నర్. ఆమె పెట్టిన టీ రుచి టు పర్సెంట్ అయితే ఓవరాక్టింగ్ 98 పర్సంట్ ఉందంటూ పలువురు కామెంట్లు పెడితే.. ముందు జుట్టు సవరించుకోండి.. అలా వదిలేస్తే టీలో పడతాయని పలువురు స్పందించారు.

డాలీ మాస్టర్ గరం చాయ్‌కి షోయబ్ అక్తర్, బిల్ గేట్స్ ఫిదా

డిఫరెంట్ స్టైల్లో క్రాఫ్.. కలర్ ఫుల్ కళ్లజోడు.. బ్లాక్ కలర్ సూట్‌.. లెదర్ షూ ధరించిన ఓ వ్యక్తి వస్తూనే స్టౌ పై పాలను మరిగించాడు. టీ పౌడర్ వేసి, కాస్త అల్లం దంచి వేసి బాగా మరిగిన తర్వాత షుగర్ వేసి ఓ కేటిల్‌లో పోసి, రెండు గాజుసుల్లో ఆ చాయ్‌ను పట్టుకొచ్చాడు. అక్కడున్న ఇద్దరు వ్యక్తులకు ఇచ్చాడు. దానిని తాగిన వారు తర్వాత అతన్ని గట్టిగా హగ్ చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. కాగా ఆ టీ ఇచ్చిన వ్యక్తి పేరు డాలి మాస్టర్, కాగా చాయ్ తాగి హగ్ చేసుకున్న వారిలో ఒకరు షోయబ్ అక్తర్. ఈ ఏడాది జరిగిన ఒక క్రికెట్ టోర్నీలో వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి షోయబ్ అక్తర్ అక్కడికి రాగా, అతనికి తన చేతులు మీదుగా చాయ్ అందివ్వడానికి డాలి మాస్టర్ స్పెషల్‌గా వచ్చాడు. అతడు చేసిన టీ తాగి షోయబ్ మెచ్చుకుంటూ హగ్ చేసుకున్నాడు. ‘నాగ్ పూర్ ఏరియాకు చెందిన డాలి తన చాయ్‌తో నన్ను మైమరిపించాడంటూ’ షోయబ్ పేర్కొన్నాడు. అనంత్ అంబానీ పెళ్లిలో కూడా డాలీమాస్టర్ చాయ్ ని తాగి బిల్ గేట్స్ సైతం మెచ్చుకున్నారు.

టీ కొట్టు చిన్నదే.. టర్నోవర్ కోట్లలో

టీ కొట్టు పెడితే ఏంటి లాభం అనుకోవాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అదే జీవనాధారం అవుతుంది. కాలం కలిసొస్తే టర్నోవర్ కోట్లల్లో ఉండొచ్చు. ఇందుకు అభినవ్ టండన్, ప్రమిత్ శర్మ అనే ఇద్దరు ఇంజినీరింగ్ కుర్రాళ్లే నిదర్శనం. బరేలీకి చెందిన ఈ యువకులు లక్నోలో ఇంజినీరింగ్ చేశారు. తర్వాత పలు ప్రైవేట్ సంస్థల్లో జాబ్ చేశారు. అయితే అక్కడి రొటీన్ లైఫ్, ఒత్తిడి వంటి నచ్చక కొత్తగా ఏదైనా చేయాలనుకున్నారట. అప్పుడు వీరికి తట్టిన ఆలోచనే ఫుడ్ డెలివరీ తరహాలోనే చాయ్ అమ్మాలని భావించారు. 2014లో ‘చాయ్ కాలింగ్’ పేరుతో ఢిల్లీ శాటిలైట్ సిటీ నోయిడా సెక్టార్ - 16 మెట్రో స్టేషన్ వద్ద టీ స్టాల్ ప్రారంభించారు. ఇంటింటికీ టీ సప్లయ్ చేయడం మొదలు పెట్టారు. కొన్నేండ్ల తర్వాత పలు నగరాల్లో 15 టీ స్టాళ్లను విస్తరించారు. ఇప్పుడు వీరి ఏడాది టర్ననోవర్ అక్షరాలా రూ. 2 కోట్లు. అందుకే ఏ వ్యాపారన్నీ చులకనగా తీసుకోవద్దని, ఎవరి శ్రమనూ కించపరచవద్దని పెద్దలు చెబుతుంటారు.

నీలోఫర్.. అందరి ఫేవరెట్

చాయ్ బండ్లు పెట్టి ఫేమస్ అయ్యారని.. ఎక్కడెక్కవాళ్ల గురించో చెప్పుకున్నాం కదా ఇప్పుడు మన తెలంగాణవాసి.. హైదరాబాదీ గురించి చెప్పుకుందాం. ఆయన మరెవరో కాదు నీలోఫర్ కేఫ్ ఓనర్ అనుముల బాబురావ్. చాలా కిందిస్థాయినుంచి పనిచేసి స్వశక్తితో పైకి వచ్చిన వ్యక్తి. ఒకనాడు రూపాయి, రెండు రూపాయలకు చాయ్ అమ్మిన ఆయన ఇప్పుడు దాదాపు రూ.70 వసూలు చేస్తున్నారు. ఇక ప్రైమ్ లొకేషన్లలో ఉన్న బ్రాంచుల్లో అయితే కొన్ని వెరైటీలకు రూ.1000పైనే ధర ఉంటుంది. అయినా, కస్టమర్లకు ఎప్పటికప్పుడు కొత్త వెరైటీలు పరిచయం చేస్తుండటంతో ఎంత ధర అయినా డోన్ట్ కేర్ అంటున్నారు. 1970వ దశకంలో బాబురావు సాధారణ లేబర్ గా నీలోఫర్ కేఫ్ లో పని ప్రారంభించారు. యజమాని ఇరానీ వ్యక్తి కాగా, నిర్వహణ కష్టం కావడంతో కేఫ్ మూసివేతకు నిర్ణయం తీసుకోగా.. బాబురావు కొనుగోలు చేసి సమర్థవంతంగా నిర్వహించారు. ఆ కేఫ్ లో టీతోపాటు ఇరానీ చాయ్ ఉస్మానియా బిస్కెట్లు తాజాగా అందించడంతో అందరికీ కేఫ్ తో అనుబంధం పెరిగింది. లక్డీకపూల్ లో ప్రారంభించిన దుకాణం సక్సెస్ కావడంతో హిమాయత్ నగర్, బంజారాహిల్స్, రాయదుర్గంతోపాటు ఎయిర్ పోర్ట్ లోనూ శాఖలు ఏర్పాటుచేశారు. వినియోగదారుల సంతృప్తియే తమ లక్ష్యమని నేటికీ బాబురావు చెప్తుండటం ఆయన నిబద్ధతను చెప్తున్నది.

Advertisement
Next Story

Most Viewed