రెవెన్యూ శాఖలో ఆగని అవినీతి.. డీజిల్ ఘటన అందుకేనా..?

by Shyam |
Office
X

దిశ ప్రతినిధి, మెదక్ : రెవెన్యూ శాఖలో అవినీతి రాజ్యమేలుతోంది. ఏ చిన్న పని కోసం వెళ్లినా.. పైసా లేనిదే ఫైల్ ముట్టడం లేదు. లంచం ఇచ్చుకోని వారు వస్తే చెప్పులు అరిగే వరకు తిరిగినా పని అవుతుందన్న గ్యారెంటీ లేదు. ఏసీబీకి పట్టుబడుతున్నా అధికారుల్లో మార్పు రావడం లేదు. మరికొంత మంది అధికారులు ఏసీబీ నుంచి తప్పించుకునేందుకు ప్రైవేట్ వ్యక్తులను నియమించుకుని సామాన్యులను లంచాల కోసం పట్టి పీడిస్తున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఎన్నో అవినీతి సంఘటనలు వెలుగులోకి వచ్చినా ఉన్నతాధికారులు స్పందించకపోవడం గమనార్హం. తాజాగా మెదక్ జిల్లాలో తహసీల్దార్‌పై రైతులు డీజిల్ పోసిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కీలక మంత్రి ఉన్న జిల్లాలోనే..

అవినీతిని రూపుమాపేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చింది. ప్రభుత్వ అధికారులను ప్రోత్సహించేందుకు పీఆర్సీని వర్తింపజేసింది. ఇతర అలవెన్సెస్ అందించినా అధికారుల తీరు మారడం లేదు. ముఖ్యంగా సీఎం కేసీఆర్ సొంత జిల్లాలో అయితే అధికారుల అవినీతికి అంతే లేకుండా పోతోంది. ముఖ్యంగా జిల్లా మంత్రి తన్నీరు హరీశ్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిద్దిపేట నియోజకవర్గంలోని నంగునూరు, చిన్నకోడూరు, సిద్దిపేట అర్బన్, రూరల్ మండలాల్లో పరిస్థితి చేజారినట్టుగా కన్పిస్తోంది. తాజాగా నంగునూరు మండలం సిద్ధన్నపేట గ్రామంలో ఇదే జరిగింది.

సిద్ధన్నపేట గ్రామంలోని 1271/ఆ/2 , 1253/ఇ/2 భూమి కోర్టు కేసులో నడుస్తోంది. రెండు సర్వే నంబర్లలో ఉన్న భూమిని తమ పేరిట చేయాలని కోరితే నంగునూరు తహసీల్దార్ రూ.లక్ష డిమాండ్ చేశాడని బాధితుడు రాకూరి వెంకట్ రెడ్డి తెలిపారు. తాము డబ్బులు ఇవ్వకపోవడంతో డాకురి వసంతకు వారసత్వం ద్వారా రిజిస్టర్ చేశాడని బాధితుడు వెంకట్ రెడ్డి వాపోయాడు. దీనిపై మానవ హక్కుల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఇలాంటి సంఘటనలు సిద్దిపేట నియోజకవర్గంలో చాలానే జరిగాయి.

లంచాల కోసం ప్రత్యేక వ్యక్తులు నియామకం

Sridhar

మారుతున్న కాలానుగుణంగా అందరూ మారాలనే సామాతెను రెవెన్యూ అధికారులు వంట పట్టించుకున్నారు. ఏసీబీ అధికారులకు దొరక్కుండా ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. బాధితుల నుండి నేరుగా తీసుకుంటే ఏసీబీలకు పట్టుబడుతున్నామని ప్రైవేటు వ్యక్తిని నియమించుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదని పలువురు రెవెన్యూ అధికారులు ప్లాన్ వేశారు. లంచాల స్వీకరణకు ప్రైవేటు వ్యక్తులను అపాయింట్ చేసుకున్నారు. తాజాగా సిద్దిపేట అర్బన్ మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రైవేటు వ్యక్తుల నుంచి వచ్చే సమస్యలే వరిస్కారమవుతున్నాయి.

సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్‌వో ఎల్లారెడ్డి, తహసీల్దార్లు ఓ వ్యక్తి(శ్రీధర్)ని నియమించుకున్నారు. అతని రెఫరెన్స్ మీద వచ్చే సమస్యలు వెనువెంటనే పరిష్కరిస్తున్నారు. నేరుగా వెళ్లి తహసీల్దార్‌ను కలిస్తే పనిచేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గత కొంత కాలంగా శ్రీధర్ రెవెన్యూ కార్యాలయంలోనే ఉంటున్నాడు. ఇతనికి రోజుల తరబడి ఇక్కడేమి పని అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి సిద్దిపేట అర్బన్ మండలంలో ఏ పనైనా కావాలంటే తహసీల్దార్, వీఆర్వోల ప్రైవేటు వ్యకైనా శ్రీధర్ ని కలవాలనే అభిప్రాయానికి సామాన్య జనం వచ్చారు. ఇదంతా ఉన్నతాధికారులకు తెలిసినా తెలియనట్టు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అవినీతి అంతం చేసేందుకు ఉన్నతాధికారులు నడుం బిగించాలని, సామాన్యులను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

తహసీల్దార్‌పై డీజిల్..

రైతులు ఆందోళన చేస్తున్న తహసీల్దార్ పట్టించుకోకపోవడం.. గత కొంత కాలంగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సమస్యను పరిష్కరించకపోవడంతో ఆగ్రహించిన రైతులు తహశీల్దార్‌పై డీజిల్ పోశారు. దీంతో ఆ కార్యాలయంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత ఏడు సంవత్సరాలుగా తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్న తనకు పట్టా పాసు పుస్తకం ఇవ్వకపోవడంతో మెదక్ జిల్లా శివ్వంపేట తహసీల్దార్ కార్యాలయ పరిధిలోని తాళ్లపల్లితండాకు చెందిన భానుప్రకాశ్ సోమవారం మృతి చెందాడు. తనకు పట్టా పాసుపుస్తకం లేకపోవడంతో రైతు బీమా రాదని గ్రహించిన తహసీల్దార్ కార్యాలయానికి మృతదేహాన్ని తీసుకెళ్లి నిరసన తెలియజేశారు. అయినా తహసీల్దార్ స్పందించకపోవడంతో తహసీల్దార్ పైన్నే డీజిల్ పోశారు.

డబ్బులిస్తేనే కదులుతున్న ఫైల్స్ ..

నూతన రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించడం.. సాగు నీటి కొరత తీర్చేందుకు ప్రాజెక్టులు నిర్మిచండంతో ఈ ప్రాంతంలో రెవెన్యూ పెరిగింది. ఒక్కసారిగా భూముల ధరలకు రెక్కలొచ్చాయి. దీంతో చాలా ప్రాంతాల్లో భూ వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటి పరిష్కారం కోసం రెవెన్యూ కార్యాలయాలకు వెళ్లాల్సిందే. రెవెన్యూ కార్యాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరికి దగ్గర ఏ చిన్న పనికైనా మొదట ఎంత డబ్బుఇస్తావని అడిగిన తర్వాతే నీ పనేందని అడుగుతున్నారని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

డబ్బులివ్వని వారి పరిస్థితి మరీ ఘోరంగా తయారైంది. డబ్బులివ్వని వారిని నేరుగా డబ్బులు అడగలేక ఇవాళ కాదు … సర్వర్ డౌన్ ఉంది. ఆ సారు లేడు .. ఈ సారు లేడు .. రేపు రాపో .. ఎల్లుండి రాపో .. అంటూ సాకులు చెబుతూ రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో రెవెన్యూ అధికారులపై ప్రత్యేక దృష్టి సారించి అవినీతిని అంతమొందించాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story