వేతనాలు అందక.. ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపు!

by Anukaran |   ( Updated:2021-07-06 22:03:42.0  )
వేతనాలు అందక.. ప్రభుత్వ ఉద్యోగుల ఎదురుచూపు!
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర ఖజానా కాసుల్లేక కొట్టుమిట్టాడుతోంది. ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలు కూడా ఒకేసారి ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో ప్రభుత్వం విడతల వారీగా వేతనాలు ఇచ్చే ప్రక్రియను పాటిస్తోంది. జిల్లాల వారీగా జీతాలు పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలోని హైదరాబాద్​ పరిధిలో హెచ్ఓడీ విభాగాలు, జిల్లా కేంద్రాల్లోని హెచ్ఓడీ విభాగాలకు మాత్రమే ముందుగా జమ చేస్తున్నారు. ఆ తర్వాత విడతలు వారీగా జిల్లాలకు ఇస్తున్నారు. అంతేకాకుండా కొంతమంది ఉపాధ్యాయులకు కూడా అదే పద్దతిని పాటించనున్నారు. ఇక కాంట్రాక్ట్​, ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులకైతే మరీ అధ్వానంగా మారింది.

ఇప్పటికే వారికి ప్రతినెలా 10 తర్వాత వేతనాలు క్రెడిట్​ అవుతున్నాయి. ఇక నుంచి మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం బ్యాంకుల నుంచి రుణాలిప్పించేందుకు నిర్ణయం తీసుకుంటోంది. సర్కారు దగ్గర మెడికల్​ బిల్లులకు కూడా పైసలు లేకపోవడంతో.. ఇప్పుడు ప్రభుత్వం తరుపున కలెక్టర్లు ముందుండి బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు సిద్ధమవుతోంది.

పైసల్లేక..!

రాష్ట్ర ఆదాయం గణనీయంగా తగ్గిపోతోంది. అయితే పన్నులు, ఎక్సైజ్​ వసూళ్లు తగ్గకున్నా… ఆర్థిక కష్టాల్లో కూరుకుపోతోంది. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా బిల్లులు పెండింగ్​ పెట్టారు. రోడ్లు, వంతెనల పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం మానేశారు. వారికి టోకెన్లు ఇచ్చినా ఖజానాలో డబ్బుల్లేక పెండింగ్ పెట్టుతున్నారు.

తాజాగా ఈ ప్రభావం ఉద్యోగుల వేతనాలపై పడింది. ప్రస్తుతం ప్రతినెలా 5వ తేదీలోగా పూర్తిస్థాయిలో వేతనాలు ఇచ్చే పరిస్థితి లేదు. మరోవైపు ఆర్టీసీ వంటి సంస్థలకైతే ప్రతినెలా 15వ తేదీ వరకు జీతాలు చెల్లించడం లేదు. ఆ సంస్థలకు కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చే అప్పో, సాయమో దిక్కుగా ఉండటంతో వేతనాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు.

వేతన కష్టాలు

ప్రస్తుత జూలై నెలలో వేతనాలు విచిత్రంగా క్రెడిట్​చేస్తున్నారు. ఖజానాలో కాసుల్లేక ఆర్థిక శాఖ పలు సూచనలు చేయడంతో అదే తరహాలో వేతనాలిస్తున్నారు. ప్రస్తుతం కొన్ని విభాగాల్లో హెచ్ఓడీలకు జీతాలు చెల్లించారు. వారికి ఈ నెల 2 వరకు జమ చేశారు. ఆ తర్వాత హైదరాబాద్​సిటీ, చుట్టుపక్కల జిల్లాల పరిధిలో హెచ్ఓడీలు, ఉద్యోగులకు విడుదల చేశారు. ప్రస్తుతం కొన్ని జిల్లాలకు మంగళవారం రాత్రి నుంచి జమ అవుతున్నాయి. కొంతమంది ఉపాధ్యాయులకు కూడా ఇంకా జీతాలు పడలేదు.

కొన్ని నెలలు ఇదే తరహా

ప్రభుత్వ ఆదాయం మెరుగుపడే వరకు వేతనాలను విడతలు వారీగా వేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారవర్గాలు వెల్లడించాయి. నెల మొదటివారం మొత్తం ఒక్కో జిల్లా వారీగా చెల్లింపులు చేయనున్నారు. అంటే హైదరాబాద్​పరిధిలోని హెచ్ఓడీ, కొన్ని విభాగాలకు ముందుగా ఇవ్వనున్నారు. ఆ తర్వాత చుట్టుపక్కల జిల్లాలకు, అనంతరం ఇతర జిల్లాలకు వేతనాలను క్రెడిట్​చేసే విధంగా నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్పుతున్నారు. దీనిపై ఆర్థిక శాఖకు ప్రభుత్వం నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు చెప్పుతున్నారు. అంటే ప్రతినెలా మొదటి వారం వరకు ఉద్యోగులకు జీతాలు రానున్నాయి. గతంలో మాదిరిగా ఒకేసారి రాష్ట్రమంతా వేతనాలు ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాంట్రాక్ట్​ ఉద్యోగులకు మరీ ఘోరం

ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్, ఔట్​సోర్సింగ్​ఉద్యోగులకు మరీ ఘోరంగా తయారైంది. ఇప్పటికే కొన్ని విభాగాలు ప్రతినెలా10వ తేదీ వరకు వేతనాలిస్తున్నారు. వీరికి కాంట్రాక్ట్​ ఏజెన్సీలను ఎత్తివేస్తామని ప్రకటించిన ప్రభుత్వం… కేవలం విద్యుత్​శాఖకే పరిమితం చేసింది. దీంతో కాంట్రాక్ట్​, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకు ఏజెన్సీల ద్వారానే ఇస్తున్నారు. వారికి చెక్కులు తయారు చేయడమే ప్రతినెల 5 నుంచి 8 తేదీ వరకు ప్రారంభిస్తున్నారు. ఈ లెక్కన వారికి వేతనాలు జమ అయ్యేది 10 నుంచి 15వ తేదీ తర్వాతే.

బిల్లులేమీ లేవు

ఓ వైపు వేతనాలకే అష్టకష్టాలు పెడుతున్న ప్రభుత్వం… ఇతర బిల్లులను దాదాపుగా ఆపేస్తోంది. కొంతమంది ఉద్యోగుల రిటైర్మెంట్స్​బెనిఫిట్స్​కూడా ఇంకా పెండింగ్​ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇంకో మూడేండ్ల వరకు పదవీ విరమణ చెల్లింపులు లేకపోవడం కలిసి వస్తోంది. అంతేకాకుండా మెడికల్​బిల్లులు దాదాపుగా పెండింగ్​లోనే ఉన్నాయి. రూ. లక్షలోపు బిల్లులు కూడా రావడం లేదు. రూ. లక్ష దాటిన మెడికల్​బిల్లులైతే వేల సంఖ్యల్లో పేరుకుపోయాయి. ఎందుకంటే వాటికి స్టాండింగ్​కమిటీ అనుమతి తప్పనిసరి. ప్రస్తుతం స్టాండింగ్​కమిటీ ఉందో… లేదో అనేది జేఏడీ అధికారులకే తెలియడం లేదు. దీంతో ఈ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి.

ఇక బ్యాంకుల నుంచి రుణాలిప్పిస్తారట..!

రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రయోగం మొదలుపెట్టింది. ప్రభుత్వ ఉద్యోగులకు దగ్గరుండీ బ్యాంకుల నుంచి అప్పు ఇప్పించేందుకు సిద్ధమవుతోంది. అంటే ఉద్యోగులకు మెడికల్​బిల్లులు, ఆర్థిక ఇబ్బందుల నుంచి ప్రభుత్వం ఆదుకోదని ముందుగానే చెప్పినట్టుగా చేస్తోంది. ప్రభుత్వం నుంచి వచ్చే ఏమైనా బిల్లులపై ఆశలు పెట్టుకోవద్దంటూ చెప్పికనే చెప్పుతోంది. ఉద్యోగులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించే బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించేందుకు నిర్ణయం తీసుకుంటున్నారు.

Advertisement

Next Story