బాధ్యత మరిచిన బల్దియా !

by Shyam |
బాధ్యత మరిచిన బల్దియా !
X

– పారిశుధ్య కార్మికుల రక్షణ పట్టని వైనం

దిశ, కరీంనగర్: ఓ వైపున ప్రపంచమంతా కరోనాతో భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తుంటే.. పారిశుధ్య సిబ్బంది మాత్రం నిత్యం బ్యాక్టీరియాతో సహవాసం చేస్తున్నారు. వీరు ఒక్క రోజు డ్యూటీకి రాకుంటే ప్రజలంతా అపరిశుభ్రమైన వాతావరణంలో గడపాల్సిన పరిస్థితి ఉంటుంది. అయినా వారి ఆరోగ్య రక్షణను మాత్రం పట్టించుకునే వారు లేరు.

స్మార్ట్ సిటీ అని గొప్పలు పోతున్నపాలకులు సైతం ఆ కార్మికుల జీవితాలను పట్టించుకోవడం లేదు.

బల్దియాలో దాదాపు 800 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. వీరంతా నిత్యం చెత్త సేకరణ, మురికి కాలువలు శుభ్రం చేయడం, రోడ్లు ఊడ్చడం వంటి పనుల్లో నిమగ్నమై ఉంటారు. అయితే, గతంలో కాంట్రాక్టు విధానంలో చెత్త సేకరణ చేపట్టిన కరీంనగర్ కార్పొరేషన్ అధికారులు.. ఆ తర్వాత కాంట్రాక్టు పద్ధతికి స్వస్తి పలికి కార్మికులందరినీ ‘వారధి సొసైటీ’ పరిధిలోకి చేర్చారు. కాగా, వేతనాలు అందించేందుకు మాత్రమే ఈ సొసైటీ కార్మికులకు బాసటగా నిలుస్తుండగా.. వారి రక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాత్రం బల్దియాకే ఉంటుంది. అయితే మునిసిపల్ వర్కర్స్ విషయంలో నిండుగా నిర్లక్ష్యం ఆవహించిందనే చెప్పాలి. వీరికి గ్లౌజులు, మాస్కులు, షూస్ అందించాల్సిన బాధ్యత నగరపాలక సంస్థదే. అయితే వీరికి కేవలం ఆర్పన్స్ మాత్రమే సరఫరా చేసి చేతులు దులుపుకుంటుండటం గమనార్హం. నగర పాలక సంస్థకు చెందిన వర్కర్స్ కొంతమంది తమకు ప్రాణాపాయమని భావించి స్వంత డబ్బులు పెట్టుకుని గ్లౌజులు కొనుగోలు చేసి వాడుకుంటున్నారు. ఆర్థిక భారంతో చాలా మంది కార్మికులు కొనుగోలు చేసేందుకు వెనుకంజ వేస్తున్నారు. దీంతో వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.

నగర వాసులు పొడి, తడి చెత్తను వేరు చేసి మునిసిపల్ వర్కర్స్‌కు అప్పగించాల్సి ఉన్నప్పటికీ, అవగాహన లేక చాలా మంది రెండింటినీ కలిపే ఇంటింటికి వెళ్లే రిక్షాల్లో వేస్తున్నారు. దీంతో కార్మికులు కలెక్షన్ పాయింట్ల వద్ద చెత్తను గ్రేడింగ్ చేయాల్సి వస్తోంది. చెత్తలో తడి ఉండటంతో క్రిమి కీటకాలు ఫాం అయ్యే అవకాశాలు లేకపోలేదు. తాజాగా ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా వ్యాధి ప్రభావం కూడా ఈ కార్మికులపై పడే అవకాశం లేకపోలేదు. వ్యాధి సోకిన వారి నుంచి వెలువడిన తుంపర్లు చెత్తలోని ప్లాస్టిక్ కవర్లపై పడితే వ్యాధి సోకే అవకాశాలునాయన్న భయం కార్మికులను వెంటాడుతోంది. అంతేకాకుండా కరీంనగర్‌లో రెడ్ జోన్ ప్రకటించిన ప్రాంతాల్లోనూ వీరు సేవలందించాల్సి ఉంటుంది. ఈ ప్రాంతానికి వెళ్లే కార్మికులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందన్నది వాస్తవం. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నపారిశుధ్య కార్మికుల రక్షణకు అవసరమైన గ్లౌజ్‌లు, మాస్కులు, షూస్ సరఫరా చేసి వారి ఆరోగ్యాలకు భరోసా ఇవ్వాల్సిన బాధ్యత బల్దియాపైనే ఉంది.

Tags : Karimnagar, Municipal workers, Baldia, Masks, Gloves, Corona

Advertisement

Next Story