- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెట్రో సేవలపై తొలగని సందిగ్ధత..
దిశ, న్యూస్ బ్యూరో : కరోనా నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో రైలు సందిగ్ధంలో ఉన్నది. ఈ ఏడాది మార్చి 22వ తేదీ నుంచి మెట్రో రైలు సర్వీసులు పూర్తిగా నిలిచిపోయాయి. మెట్రో రైళ్ళన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. అన్ని స్థాయిల ఉద్యోగులు ఇండ్లలోనే ఉన్నారని అధికారులు స్పష్టం చేస్తున్నారు. మెట్రో రైలు సేవలు ఎప్పుడు ప్రారంభం కానున్నాయో ఇంకా స్పష్టత రాలేదు. కేంద్ర మార్గనిర్దేశకాలు వెలువరిస్తే గానీ సంస్థ యాజమాన్యం ఒక నిర్ధిష్టమైన నిర్ణయానికి వచ్చేట్టుగా లేదని తెలుస్తోంది. సేవలు ప్రారంభించడానికి ముందుగా ఎల్ అండ్ టీ, మెట్రోరైలు యజమాన్యాలు సమావేశం కావాల్సి ఉన్నది. ఇప్పటి వరకు సమావేశం విషయమై ఇరుపక్షాల నుంచి సంకేతాలు సూచనప్రాయంగా కూడా వెలువడలేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. మెట్రో నడపకపోవడం వల్ల ఎల్ అండ్ టీకి రోజూ కనీసంగా రూ.1.65 కోట్లు, నెలకు సుమారు రూ.50 కోట్లు ఆదాయం కోల్పోతుందని, గత మార్చి నుంచి ఆగష్టు వరకు రూ.260 కోట్ల మేర నష్టం వాటిల్లిందని యాజమాన్యం అంచనా వేస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడిస్తున్నారు.
ప్రయాణికుల టిక్కెట్ల ద్వారానే కాకుండా మాల్స్, ప్రకటనలు ద్వారా కూడా సంస్థకు ఆదాయం చేకూరేది. మొత్తం ఆదాయంలో టికెట్ల ద్వారా 50శాతం, మాల్స్ నుంచి 45శాతం, ప్రకటనల ద్వారా 5శాతం సంపాదించుకోవాలనేది ప్రభుత్వ నిబంధనగా ఉన్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో కరోనా విస్తరిస్తున్నందున మెట్రో నడపడం అంత తేలిక కాదని, కొన్ని ప్రత్యేక పద్ధతులను, చర్యలను అమలు చేయాల్సి ఉంటుందనేది అధికారుల అభిప్రాయం. ఈ పద్ధతులకు తోడు ఐటీ సెక్టార్‌లో బహుళ జాతి సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు ‘వర్క్ ఫ్రం హోమ్’ అంటూ వెసులుబాటు కల్పిస్తున్నవి. చాలా మంది వ్యక్తిగత వాహనాల్లోనే ప్రయాణించేందుకు ఆసక్తిని చూపుతారని, దీంతో ప్రయాణికులు ఏ మేరకు మెట్రోను ఆదరిస్తారోననే అనుమానాలు ఎల్ అండ్ టీకి, మెట్రో సంస్థకు లేకపోలేదని అధికారులు పేర్కొంటున్నారు. కానీ, ఇలా ఎంతకాలం కొనసాగాలనే ప్రశ్న ఆ సంస్థలను తొలుస్తున్నది.
మెట్రో నిర్వాహణ ఇలా…
ఎల్బీ నగర్ నుంచి మియాపూర్ వరకు 29 కిలో మీటర్ల దూరం ఉంటుంది. మొత్తం స్టేషన్లు 27 ఉన్నాయి. ప్రయాణ సమయం 45 నిముషాలు పడుతుంది. జేబీఎస్ నుంచి ఫలక్‌నుమా వరకు 15 కిలోమీటర్ల దూరం కాగా, మొత్తం స్టేషన్లు 16 ఉన్నాయి. ప్రయాణ సమయం 22 నిముషాలు పడుతుంది. ఇక నాగోలు నుంచి శిల్పారామం వరకు 28 కిలోమీటర్ల దూరం కాగా, మొత్తం స్టేషన్లు 23 ఉన్నాయి. ప్రయాణ సమయం 30 నిముషాలు పడుతుంది. మెట్రో రైలు వల్ల ఆయా పరిసర ప్రాంతాలలో వెలిసే అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు 50 వేల మందికి ఉద్యోగవకాశాలు కల్పించబడినట్టు అంచనా ఉన్నది.
ఈ పథకం ఒప్పంద సమయంలో ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.14,130 కోట్లు కాగా, పనుల జాప్యంతో ఇది కాస్త రూ.19,130 కోట్లకు పెరిగిన విషయం విదితమే. ఈ పథకం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే రోజూ 15 లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తారనేది అధికారుల నమ్మకంగా ఉంది. పథకం మొత్తం 72కిలో మీటర్లుగా ఉంటే, 69కిలొమీటర్లుగా మూడు మార్గాల్లో మెట్రో సేవలు గత మార్చి 22వ తేదీకి ముందుగా ఉండేవి. అయితే, వారాంతాల్లో 06:30 గంటల నుంచి రాత్రి 22:00 గంటల వరకు రైళ్ళు నడిచేవి. ఇవి తాత్కాలిక సమయాలు కాగా, కార్యాచరణ అవసరాలకు అనుగుణంగా రైళ్ళ సమయాలు మార్చబడతాయి. చివరి రైలుకు 5 నిమిషాల ముందు ఆ స్టేషన్‌లో టికెట్ కౌంటర్లు మూసివేస్తారనేది తెలిసిందే. ఒక గంటకు ఒక దిశలో సుమారు 50 వేల మంది ప్రయాణించే సౌలభ్యమున్నది. రైలు వేగం గంటకు సరాసరిన 34 కిలో మీటర్లు ఉంటుంది. రద్దీ సమయాలలో రెండు నుంచి ఐదు నిముషాలకు ఒక రైలు నడపే అవకాశాలున్నాయి. టికెట్ ధర రూ.10 నుంచి రూ. 60 వరకు నిర్ణయించబడింది.
మూడు మార్గాల్లో నిత్యం 3 లక్షలు రాకపోకలు సాగిస్తున్న ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరిగి గత మార్చి నాటికి 4.24 లక్షల మంది ప్రయాణికులకు చేరిందని అధికారులు వెల్లడిస్తున్నారు. హైటెక్ సిటీ నుంచి రోజుకు సుమారు 6,125 మంది రాకపోకలు సాగిస్తుండగా, అమీర్‌పేట్ నుంచి మరో 4,102 మంది మెట్రో సేవలను వినియోగించుకుంటున్నట్లు అంచనా ఉంది. అలాగనే ఎల్బీనగర్ నుంచి 3,950 మంది, మియాపూర్ నుంచి 5,150 మంది, బేగంపేట్ నుంచి 1500 మంది మెట్రో రైళ్లలో రాకపోకలు సాగిస్తున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో కూకట్‌పల్లి నుంచి 2,200, దిల్‌సుఖ్‌నగర్ నుంచి మరో 1,430 మంది ప్రయాణికులు పెరిగినట్లు అంచనా ఉంది. మొత్తంగా గతంలో 4 లక్షలు ఉన్న మెట్రో ప్రయాణికుల సంఖ్య 4.24 లక్షలలకు పెరిగినట్టు అధికారులు పేర్కొంటున్నారు.
భారమవుతున్న ఖర్చులు..
గత మార్చి 22 నుంచి మెట్రో సేవలు నిలిచిపోయినందున సంస్థకు ఉద్యోగుల జీతభత్యాలు కూడా తలకు మించిన భారంగా మారినట్టు తెలుస్తోంది. దీంతో పాటు మళ్ళీ మెట్రో ప్రారంభమవుతే ప్రయాణీకులకు ఆహ్లాదవాతావరణం అందించడానికి కంపార్ట్‌మెంట్లలో వెదజల్లే సుగంధ ద్రవ్యాల ఖర్చు, ప్రతి స్టేషన్‌లో రైలును ఆపితే విద్యుత్ అదనంగా ఖర్చవుతుందోననేది బేరీజు వేసుకోవాల్సి ఉంటుంది. ఫలితంగా స్టేషన్లను కొన్నింటిని కుదించే యోచనలో సంస్థలు ఉన్నట్టు సమాచారం. ఇవన్నీ కూడా ప్రభుత్వ సూచనలు, సలహాల మేరకు మార్పులు చేర్పులు చేయనున్నట్టు యజమాన్య వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రయాణికులు సోషల్ డిస్టెన్స్ పాటించేలా చూడటం, సగం మందినే కోచ్‌లోకి ప్రవేశించేలా చర్యలు తీసుకోవడం, ప్రతి చివరి స్టేషన్‌లో వాష్ చేయడం, శానిటైజర్ల ఏర్పాటు లాంటివి అదనపు విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. దీంతో సంస్థకు అదనపు ఖర్చు చేయాల్సి వస్తుంది. టిక్కెట్టు ద్వారా వచ్చే ఆదాయం ట్రిప్పు ట్రిప్పుకు తగ్గే అవకాశాలు లేకపోలేదని అధికారులు ఉదాహరిస్తున్నారు. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకుని మెట్రో సేవలపై సందిగ్ధం కొనసాగిస్తున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.