పొద్దంతా పాఠశాలలో.. రాత్రిళ్లు పాకశాలలో!

by Shyam |
పొద్దంతా పాఠశాలలో.. రాత్రిళ్లు పాకశాలలో!
X

దిశ, నిజామాబాద్: తరగతి గదుల్లో ఉండాల్సిన పిల్లలు ఫంక్షన్‌హాళ్లలో దర్శన మిస్తున్నారు. స్టడీ అవర్స్‌లో పుస్తకాలు తిప్పేయాల్సినవాళ్లు ఫంక్షన్లలో గరిటెలు తిప్పుతున్నారు. పొద్దంత క్లాసుల్లో ఉంటూ రాత్రికి ఫంక్షన్లలో వాలిపోతున్నారు. హాస్టల్‌లో విద్యార్థులపై ప్రత్యేక నిఘా కొరవడటంతో బయటకు వచ్చి కూలీలుగా మారుతున్నారు. రాత్రంతా పని చేసి రూ.300 వరకు తీసుకొని తెల్లాసరికి హాస్ట్లల్లో దూరిపోతున్నారు. అయితే ఇదంతా ఎక్కడో మారుమూల ప్రాంతంలో జరుగుతుందనుకుంటే పొరపాటే. జిల్లా కేంద్రంలో అందునా అధికార యంత్రాంగం కొలువు ఉండే నిజామాబాద్ నగరంలో గురుకుల విద్యాసంస్థల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులే కావడం గమనార్హం. హాస్టల్ విద్యార్థులు క్యాటరింగ్ బాయ్స్‌గా పనిచేస్తున్న తతంగంపై ‘దిశ’ ప్రత్యేక కథనం.

తెలంగాణలోని గురుకులాల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం ఏడాదికి రూ.60 వేలకు పైగా ఖర్చుచేసి ఉచిత బోధనతోపాటు వసతి కల్పిస్తోంది. దీన్ని ఆదర్శంగా తీసుకుంటున్న పలు రాష్ర్టాలు సైతం అక్కడా గురుకులాలను ప్రారంభిస్తున్నాయి. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ గురుకులాల్లో చదువుకుంటున్న విద్యార్థులు నిజామాబాద్‌లో క్యాటరింగ్ బాయ్స్ అవతారమెత్తుతున్నారు. వింధులు, వినోద కార్యక్రమాల్లో కొందరు విద్యార్థులు క్యాటరింగ్ చేస్తుండగా, మరికొందరు ప్లేట్లు కడుగుతున్నారు. ఒక్కో విద్యార్థికి రూ.300 ఇచ్చి భోజనం పెడుతుండటంతో నిత్యం 10 నుంచి 20మంది విద్యార్థులు క్యాటరింగ్‌లో నిమగ్నం అవుతున్నారు. హాస్టళ్లలో వార్డెన్‌ల నిఘా కొరవడటంతోనే జిల్లా కేంద్రంలో ఈ వ్యవహారం కొద్దిరోజులుగా గుట్టుగా జరుగుతోంది. క్యాటరింగ్‌కు సంబంధించిన కాంట్రాక్టర్లతో విద్యార్థులు నిత్యం టచ్‌లో ఉంటూ పని ఉందని చెప్పగానే రాత్రికి ఫంక్షన్ హాళ్లకు వెళ్తున్నారు. అయితే ఇంటర్ విద్యార్థులు పరీక్షలు జరుగుతున్న సమయంలో కూడా క్యాటరింగ్‌కు వెళ్తున్న పరిస్థితులు కనపడుతున్నాయి.

గురుకులాల్లో కఠిన నిబంధనలు ఉండగా హస్టల్స్‌లో మాత్రం విద్యార్థులకు సడలింపు ఉంటుంది. స్కూళ్లు, కాలేజీల్లో హెడ్మాస్టర్లు, ప్రిన్సిపాళ్ల పర్యవేక్షణలో విద్యార్థులు ఉంటారు. హాస్టల్స్‌కు వచ్చేసరికి వార్డెన్‌లు, ఇన్సిట్యూషన్‌ల హెడ్‌ల పర్యవేక్షణలో ఉంటారు. ఓ విధంగా నిర్బంధ విద్యే విద్యార్థి భవిష్యత్‌కు మంచి పునాది అని చెప్పవచ్చు. కానీ నగరంలోని మైనార్టీ గురుకుల స్కూల్‌, వసతి గృహం, నాందేవ్‌వాడలోని సంక్షేమ వసతి గృహం విద్యార్థులు రాత్రయిందంటే కూలీలుగా మారుతున్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. రాత్రివేళల్లో బయట తిరిగే టైంలో అనుకొని ఘటనలు జరిగితే బాధ్యులెవరన్న ప్రశ్న సైతం ఉత్పన్నమవుతోంది.

Tags: Nizamabad, Gurukul students, Catering, other

Advertisement

Next Story