నిజామాబాద్‌ను వణికిస్తున్న @132

by Anukaran |   ( Updated:2020-11-22 04:24:11.0  )
నిజామాబాద్‌ను వణికిస్తున్న @132
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: పాత నిజామాబాద్ జిల్లాలో 132 అంటే వణికిపోతున్నారు. మరీ ముఖ్యంగా 2007 ఎస్ఐ బ్యాచ్‌కు కంటిమీదా కునుకులేకుండా పోయింది. 132 అంటే ఏమిటి.. 2007 బ్యాచ్‌కు సంబంధం ఏంటి? అనే వివరాలు తెలుసుకోవాలంటే దిశ అందిస్తున్న ఈ ప్రత్యేక కథనం చదవాల్సిందే..

ప్రభుత్వ శాఖల్లో అటెండర్ నుంచి జిల్లా అధికారుల వరకు, పోలీస్ శాఖలో హోంగార్డు నుంచి ఐపీఎస్ వరకు మింగుడు పడని పేరు. కలలో కుడా దాని గురించి ఊహించని నామం. వారు దేనికైతే భయపడుతారో దానిని మాట్లాడుకునే కోడ్ అంకెల్లో 132. అదే ఏసీబీ(అవినీతి నిరోధక శాఖ). రెవెన్యూ, పోలీస్, రిజిస్ట్రేషన్, రవాణా శాఖ, వైద్య ఆరోగ్య శాఖలో వాటి పేరు చెబితేనే ప్రస్తుతం హడల్. అందుకు దాని పూర్తి నామం పలుకకుండా, వారి సంభాషణ సారం ఎవరికీ తెలియకుండా 132 అని, పొడి పొడి అక్షరాలతో మాట్లాడుకోవడం విశేషం. ఏదైనా ఏసీబీకి సంబంధించిన దాడి గురించి వాట్సాప్‌లలో మెసేజ్‌లు ఇస్తుంటారు. వాట్సాప్‌లో 132 అని మెసేజ్ వచ్చిందంటే డేంజర్ జోన్‌లో ఉన్నామని, వెంటనే అప్రమత్తం అవుతుంటారు. అలాంటి 132 వలలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2007 బ్యాచ్‌కు చెందిన పోలీస్ అధికారులు(ఇన్ స్పెక్టర్) ముగ్గురు చిక్కారు.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అక్టోబర్ 12న ప్రారంభమైన అవినీతి నిరోధక శాఖ దాడులు నవంబర్ 21 వరకు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకూ ముగ్గురు సీఐలు, ఒక ఎస్‌ఐ, ఒక గన్ మెన్, ఒక ప్రైవేట్ వ్యక్తిని లంచం కేసులో ఏపీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏకంగా డీఎస్పీ స్థాయి అధికారికి కూడా అవినీతి కార్యాకలపాలలో సంబంధాలు ఉన్నాయనే అనుమానాలతో ఆయన్ను కూడా విచారించడం ఇందూర్ జిల్లాలో కలకలం రేపుతోంది. ఉమ్మడి జిల్లాలో ఇల్లీగల్ దందాలు, అవినీతి, అక్రమాలు, సివిల్ పంచాయతీలు అడ్డూ అదుపులేకుండా జరుగుతాయి. దీంతో ఇలాంటి ఫిర్యాదులపై పోలీస్ శాఖ కన్నేసింది. తమ అధికారాన్ని, పరపతిని వాడుకొని దానిని సొమ్ము చేసుకొనే క్రమంలో ఈ ఏడాది అక్టోబర్ 12న బాన్సువాడ రూరల్ సీఐ టాటా బాబు రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. అక్టోబర్ 31న బోధన్ పట్టణ సీఐ పల్లె రాకేష్ రూ.50 వేల నగదు, రూ.1.3 లక్షల విలువైన ఫోన్‌ను లంచంగా తీసుకుంటూ అడ్డంగా దొరికాడు. తాజాగా కామారెడ్డి పట్టణ సీఐ ఇందూరి జగదీశ్ రూ.5 లక్షల లంచం కోసం వేధించి కటకటాల పాలయ్యాడు.

అయితే పైన దొరికిన ముగ్గురు సీఐల్లో, 2007 బ్యాచ్‌కు సంబంధించిన ఎస్‌ఐలు కావడం గమనార్హం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీరు సుదీర్ఘంగా ఎస్‌ఐలుగా పనిచేసి, సీఐలుగా పదోన్నతులు పొందారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కు బాధితులను ఆసరాగా చేసుకొని, స్టేషన్ బెయిల్ అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ.. బాధితులను బెదిరింపులకు గురిచేసి, లంచాలు దండుకున్నారు. చివరకు కటకటాల పాలయ్యారు. దీంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏసీబీ అధికారులు వరుస దాడులు చేస్తుండటంతో 132 పేరు వింటే అధికారుల గుండెళ్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed