- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రభుత్వానికి ఎన్ హెచ్ఆర్సీ ఝలక్.. మేడిగడ్డ పై నివేదిక ఇవ్వాలని ఆదేశం..
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: తెలంగాణ వరప్రదాయినిగా పేర్కొంటున్న కాళేశ్వరం(మేడిగడ్డ) ప్రాజెక్టు మంచిర్యాల, కుమ్రంభీం ఆసీఫాబాద్ జిల్లాల రైతాంగాన్ని ముంచేస్తోంది. రెండేళ్లలో మూడుసార్లు పంటలు నీటమునగగా రైతులు తీవ్రంగా నష్టపోయారు. కానీ ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రతీయేటా ప్రాణహిత నది పొంగుతుండగా గోదావరి వరదతో ఉగ్రరూపం దాలుస్తోంది. మేడిగడ్డ గేట్లు సకాలంలో ఎత్తకపోవడంతో వరద ప్రవాహం, బ్యాక్ వాటరుతో మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి మండలాల్లో పంటలు నీట మునుగుతున్నాయి. గత రెండేళ్లలో మూడు సార్లు పంటలు మునిగిపోగా సర్కారు నుంచి ఎలాంటి పరిహారం అందలేదు.
ఏడాదిలో రెండుసార్లు మునక
గతేడాది సెప్టెంబరు మొదటి వారంలో మేడిగడ్డ ప్రాజెక్టులోకి వరద పోటెత్తటంతో బ్యాక్ వాటర్ పూర్తిగా ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని పొలాల్లోకి చేరింది. మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లోని సుమారు 20వేల ఎకరాల పంట నీటమునిగింది. ఈ ఏడాది జులైలో కురిసిన భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చగా పంటలు మునిగిపోయాయి. సెప్టెంబరులో కురిసిన భారీ వర్షాలకు కోటపల్లి, వేమనపల్లి మండలాల్లోని ప్రాణహిత, గోదావరి పరివాహక ప్రాంత భూములు మునకకు గురయ్యాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కోటపల్లి మండలం అర్జునగుట్ట, రాపంపల్లి, దేవులవాడ, రాంపూర్, కొల్లూరు, పారుపల్లితో పాటు సుమారు 8 గ్రామాల్లో పంటలు నీట మునిగాయి.
ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశాలతో ఆశలు
గతేడాది సెప్టెంబరులో ప్రాణహిత వల్ల మంచిర్యాల జిల్లా కోటపల్లి, వేమనపల్లి మండలాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని దహేగాం, బెజ్జూర్ మండలాల్లో 15వేల ఎకరాల్లో పంటలు మునగగా చాలా వరకు ఇసుక మేటలు, బురదతో నిండిపోయాయి. రూ.లక్షలు పెట్టుబడి పెట్టిన రైతులకు ఏడాది గడిచినా పరిహారం జాడ లేదు. కోటపల్లి మండలం పుల్లగామలో కామ లింగయ్య అనే కౌలు రైతు, చెన్నూరు మండల కేంద్రానికి చెందిన కమ్మల రాజేశ్ ఆత్మహత్య చేసుకున్నారు. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ రైతులకు పరిహారం విషయంలో అసెంబ్లీలో ప్రస్తావించినా ఫలితం లేకపోయింది.
అవతలి వైపున ఉన్న మహారాష్ట్ర మాత్రం పంటలు నీట మునిగిన రైతులకు ఎకరాకు రూ.8వేల చొప్పున నష్ట పరిహారం అందించింది. తెలంగాణ రైతాంగం మాత్రం ఏడాది కాలంగా అధికారులు, ప్రజాప్రతినిధుల చుట్టు తిరుగుతున్నారు. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సమస్య కారణంగా రైతులకు జరుగుతున్న నష్టంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ఎనిమిది వారాల్లోగా నివేదిక సమర్పించాల్సిందిగా తెలంగాణ సీఎస్‌ను ఎన్‌హెచ్ఆర్సీ ఆదేశించటంతో రైతుల్లో ఆశలు చిగురించాయి.