- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కొత్త ఉద్యోగాలతో పాతవారికి సమస్య.. సర్దుబాటు ఎలా..?
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో నూతన జోనల్ విధానం కొత్త ఉద్యోగాలకు క్లియరెన్స్ వచ్చినట్టే అయినా పాత ఉద్యోగులకు మాత్రం చాలా సమస్యలను తెచ్చి పెడుతోంది. జోనల్ వ్యవస్థపై జీవోలు జారీ అయిన దరిమిలా పాత ఉద్యోగుల సర్దుబాటుపై కొంత సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వ ఉద్యోగాల నియామకం కోసం నూతన జోనల్ విధానాన్ని తీసుకువచ్చారు. అయితే ప్రస్తుతం పని చేస్తున్న ఉద్యోగులను కూడా జోన్ల వారీగా సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. పాత ఉద్యోగులకో రూల్, కొత్త ఉద్యోగులకో రూల్ ఉండదని, పాత ఉద్యోగుల సర్దుబాటు చేయాల్సి ఉంటుందంటున్నారు.
తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (ఆర్గనైజేషన్ ఆఫ్ లోకల్ కేడర్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్) ఆర్డర్-2018కి ఆమోదముద్ర వేయడంతో మళ్లీ ఈ చర్చ మొదలైంది. కొత్త జోన్లతో రాష్ట్ర స్థాయి కేడర్ మల్టీజోన్ కేడర్‌లోకి వెళ్లింది. దీంతో పాత తరహాలో రాష్ట్రస్థాయి కేడర్ అయినప్పటికీ… వారంతా మల్టీజోన్లలోనే పని చేయాల్సి ఉంటోంది. మల్టీజోన్ దాటి బయటకు వచ్చే అవకాశాలేమీ ఉండవు.
రాష్ట్రంలో ప్రస్తుతం రెండు జోన్లు ఉండగా.. వీటి స్థానంలో ఏడు కొత్త జోన్లు ఏర్పాటు చేశారు. కాళేశ్వరం, రాజన్న, బాసర, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగులాంబ జోన్లు ఏర్పాటు చేశారు. జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, ఆసిఫాబాద్, పెద్దపల్లి, ములుగు జిల్లాలు కాళేశ్వరం జోన్ పరిధిలోకి వస్తాయి. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల జిల్లాలు బాసర జోన్‌లో ఉండగా, రాజన్న జోన్‌లో కరీంనగర్, సిద్దిపేట, సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ జిల్లాలు ఉన్నాయి. వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు భద్రాద్రి జోన్‌లో, యాదాద్రి జోన్‌లో సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ జిల్లాలు ఉంటాయి. చార్మినార్ జోన్‌లో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలు ఉండగా, జోగుళాంబ జోన్‌లో మహబూబ్‌నగర్, వనపర్తి, గద్వాల, నాగర్ కర్నూల్, నారాయణపేట జిల్లాలు ఉంటాయి. ఇక కాళేశ్వరం, బాసర, రాజన్న, భద్రాద్రిని ఒక మల్టీ జోన్‌గా, యాద్రాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లను మరో మల్టీజోన్‌గా ఆమోదిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇప్పటి వరకూ నాలుగో తరగతి నుంచి పదో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే ఆ జిల్లానే స్థానికతగా పరిగణిస్తారు. ఇక నుంచి ఏడో తరగతి వరకు వరుసగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడే స్థానికులు అవుతారు.
అప్పటి నుంచి ఆలస్యం
మల్టీజోన్లు, జోన్లు, జిల్లాల వారీగా పోస్టుల విభజన, సర్వీసు నిబంధనలు రూపొందించడంలో కొంత మేరకు జాప్యమవుతుందనే ప్రచారం ఉద్యోగుల్లో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీనికి తోడుగా కొత్త ఉత్తర్వుల ప్రకారం పలు విభాగాల్లోని పోస్టుల కేటగిరీలు మారిపోయాయి. ఉదాహరణకు గతంలో ఉన్న జిల్లా పోస్టులు జోనల్ పోస్టులుగా మారగా, జోనల్ పోస్టులు మల్టీజోనల్ కిందకు వచ్చాయి. గతంలో ఒకే మల్టీజోన్ ఉండగా, ఇప్పుడవి రెండయ్యాయి. ఆయా పోస్టుల్ని రెండు జోన్లకు కేటాయించాల్సి ఉంది. ఇక జోన్‌ల విషయానికొస్తే రెండు జోన్‌లను ఏడు జోన్లుగా మార్చినందున ఆ మేరకు పోస్టుల్ని విభజించాల్సి ఉంది. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో పూర్వ జిల్లాల సిబ్బందిని ‘ఆర్డర్ టు సర్వ్’ కింద పనిచేయాలని ప్రభుత్వం సూచించింది. అయితే ఇప్పుడు వీరందర్నీ శాశ్వతంగా సర్దుబాటు చేసి, వారికి అప్షన్లు ఇచ్చిన తరువాతే ఏయే జిల్లాలు, జోన్లు, మల్టీజోన్లలో ఖాళీలు ఉన్నాయో గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేయాల్సి ఉంది.
పాత ఉద్యోగులను ఎలా..?
ప్రస్తుతం ముందున్న అసలు సమస్య పాత ఉద్యోగులను సర్దుబాటు చేయడంపైనే ఉంటోంది. వీరిని కొత్త జోనల్ ప్రకారం సర్దుబాటు చేసే అంశంపై జీవోలో పేర్కొన్నప్పటికీ… స్టేట్ కేడర్ పోస్టుల్లో మాత్రం ఉద్యోగుల్లో నిరాశ నెలకొంది. అంతకు ముందుగా జిల్లాలు, జోన్ల వారీగా సర్దుబాటు చేసి, ఆ తర్వాత ఉద్యోగులకు ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఈ ఆప్షన్‌లో కూడా ముందుగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాలున్నాయి. వికలాంగులైన ఉద్యోగులు, స్పౌస్ బదిలీలకు ప్రాధాన్యత ఇచ్చి, ఆ తర్వాత సీనియార్టీ ప్రకారం జోన్ల వారీగా సర్దుబాటు చేసే ఛాన్స్ ఉన్నట్లు ఉద్యోగ వర్గాలు చెప్పుతున్నాయి. స్థానికత, సీనియార్టీని పరిగణలోకి తీసుకుని ఆయా జోన్లలో ఖాళీలు ఉంటేనే వారికి అవకాశం కల్పించనున్నట్లు తెలుస్తోంది.
స్పష్టత రావాల్సిన ప్రధానాంశాలు
గతంలో ఒకే మల్టీజోన్ ఉండేది. ఇప్పుడు రెండుగా విభజించడంతో ఆయా పోస్టుల్ని రెండు జోన్లకు కేటాయించాల్సి ఉంటుంది. రాష్ట్రంలో ఏడు జోన్లు చేసినందున, ఆ మేరకు రెండుజోన్ల పోస్టులను సర్దుబాటు చేయాలి. రాష్ట్రపతి ఉత్తర్వులు మేరకు 33 జిల్లాలు పెరుగడంతో అవి ఏ జోన్ పరిధిలోకి వస్తాయో స్పష్టత రావాల్సిందే. కొత్త జిల్లాల ఏర్పాటు తరువాత.. పూర్వజిల్లాల సిబ్బందిని ఆర్డర్‌టు సర్వ్ కింద పనిచేయాలని ఆదేశాలిచ్చారు. వీరిని శాశ్వతంగా సర్దుబాటు చేయడంతో పాటుగా వారికి ఆప్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పదోన్నతులు, కారుణ్య నియామకాలు నోడల్ జిల్లాగా సాగుతున్నాయి. కొత్త జిల్లాల ప్రాతిపదికన ఇంకా చేయడం లేదు. ఇప్పుడు దీనిపై స్పష్టత ఇవ్వాల్సి ఉంటోంది.
స్టేట్ కేడర్ మల్టీజోన్కే
మరోవైపు స్టేట్ కేడర్ పోస్టులను మల్టీ జోనల్ కింద తీసుకువచ్చారు. 95 శాతం రిజర్వేషన్ కోసం మల్టీ జోన్ కింద తీసుకువచ్చారు. దీంతో స్టేట్ కేడర్ అధికారుల్లో కూడా ఇబ్బందులు రానున్నాయి. ఉదాహరణగా ఒక గ్రూప్–1 అధికారి స్టేట్ కేడర్ పోస్టులో ఉంటే ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఆదిలాబాద్ నుంచి నిజామాబాద్ వరకు ఎక్కడికైనా బదిలీ చేయవచ్చు. కానీ ఇక నుంచి మల్టీజోన్ కేడర్‌కే పరిమితం చేయనుండటంతో ఆ మల్టీజోన్ దాటి బయటకు వెళ్లలేరు. ఇది ఒక వేళ పాత ఉద్యోగులకు వర్తించదని, కొత్త ఉద్యోగులకు మాత్రమే ఉంటుందని గతంలో ఉద్యోగ సంఘాల నేతలకు సీఎం నుంచి హామీ కూడా వచ్చింది. కానీ అది సాంకేతికంగా చాలా ఇబ్బందులు తెచ్చిపెడుతుందని, అందుకే సాధ్యం కాదంటున్నారు.