ఐదు రోజుల తర్వాత గరిష్ఠంగా పెరిగిన కొత్త కేసులు

by vinod kumar |
ఐదు రోజుల తర్వాత గరిష్ఠంగా పెరిగిన కొత్త కేసులు
X

-16 వేల మార్కు దాటిన మొత్తం కేసులు
– లక్షణాలు లేకుండానే పాజిటివ్ అవుతున్నాయన్న కేజ్రీవాల్

దిశ, న్యూస్‌బ్యూరో: కొత్తగా నమోదయ్యే కేసులు తగ్గుతున్నాయనుకుంటుండగానే పెరిగిపోతూ ఉన్నాయి. ఈ నెల 14వ తేదీన అత్యధికంగా 1463 కొత్త కేసులు ఒకే రోజు వ్యవధిలో నమోదుకాగా మళ్ళీ ఆదివారం 1334 కొత్త కేసులు వచ్చాయి. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 16,116కు పెరిగింది. గడచిన 24గంటల వ్యవధిలో 31 మంది చనిపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 519కు చేరుకుంది. చికిత్స అనంతరం కోలుకుని ఇళ్ళకు వెళ్ళినవారి సంఖ్య 2302గా ఉంది. వారం రోజుల క్రితం నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే మొత్తంపాజిటివ్ కేసుల సంఖ్య వెయ్యి మార్కు దాటగా ఇప్పుడు ఏడు రాష్ట్రాలకు పాకింది. కొత్తగా ఉత్తరప్రదేశ్‌లో వెయ్యి కేసులు దాటాయి. గుజరాత్‌లో అనూహ్యంగా గడచిన 24 గంటల్లో భారీ స్థాయిలో 228 కొత్త కేసులు నమోదు కావడంతో మొత్తం సంఖ్య 1604కు చేరుకుంది. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే (58) ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో సైతం కొత్తగా 44 కేసులు నమోదయ్యాయి. రికార్డు స్థాయిలో ఒకే రోజు ఐదు వేలకు పైగా టెస్టులు చేసింది. ప్రతీ పది లక్షల మందిలో ఎక్కువ టెస్టులు చేసిన రాష్ట్రంగా దేశంలోనే రెండవ స్థానంలోకి చేరుకుంది.

దేశవ్యాప్తంగా కొత్త పాజిటివ్ కేసులు పెరుగుతున్నా కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ మాత్రం పరిస్థితి అదుపులోకి వస్తోందని, రికవరీ రేటు 14% కంటే ఎక్కువే ఉందని సంతృప్తి వ్యక్తం చేసింది. మరోవైపు ఐసీఎంఆర్ విడుదల చేస్తున్న లెక్కలకు, కేంద్ర వైద్యారోగ్య మంత్రిత్వశాఖ విడుదల చేస్తున్న లెక్కలకు తేడా ఉండడంతో ఇకపైన ఐసీఎంఆర్ లెక్కలకు అనుగుణంగానే ఇస్తామని పేర్కొంది. కరోనా లక్షణాలేవీ లేకుండానే పరీక్షల్లో మాత్రం పాజిటివ్ నిర్ధారణ అవుతోందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ఇలాంటి కేసులు బైటపడిన చోట కాలనీల్లో రాండమ్ పరీక్షలు నిర్వహించి హాట్‌స్పాట్ తరహాలో మొత్తం కాలనీని దిగ్బంధనం చేయాలన్న ఆలోచనను వెలిబుచ్చారు. కరోనా బారిన పడి రికవరీ అవుతున్నవారిలో ఎక్కువ మంది కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోనే ఉన్నట్లు గణాంకాలు తెలియజేస్తున్నాయి. మృతుల్లో మాత్రం 211 మంది ఒక్క మహారాష్ట్రలోనే ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో మధ్యప్రదేశ్, గుజరాత్, ఢిల్లీ ఉన్నాయి.

భారత్ :
మొత్తం కేసులు : 16116
మృతులు : 519
రికవరీ : 2302

తెలంగాణ :
మొత్తం కేసులు : 826
మృతులు : 18
రికవరీ : 186

ఆంధ్రప్రదేశ్ :
మొత్తం కేసులు : 647
మృతులు : 17
రికవరీ : 65

tags: corona virus, new cases, Delhi CM Kejriwal, Uttar Pradesh, Telangana, Andhra Pradesh, India
slug:

Advertisement

Next Story

Most Viewed