ఆ రెండు జట్లకు కొత్త కెప్టెన్లు రానున్నారా?

by Shiva |
ఆ రెండు జట్లకు కొత్త కెప్టెన్లు రానున్నారా?
X

దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 2021 సెకెండ్ ఫేజ్ వేదిక ఖరారైన నేపథ్యంలో ఇప్పుడు అన్ని ఫ్రాంచైజీలు తమ జట్ల బలాబలాలను బేరీజు వేసుకునే పనిలో పడ్డాయి. విదేశీ ఆటగాళ్ల గైర్హాజరి నేపథ్యంలో ఎవరెవరు తుది జట్టులో ఉంటారు.. బెంచ్‌పై ఉండే ఆటగాళ్లు సరిపోతారా లేదా అనే యాజమాన్యం లెక్కలు వేసుకుంటున్నది. అయితే రెండు ఫ్రాంచైజీలు మాత్రం తమ జట్టుకు కెప్టెన్‌గా ఎవరుంటారని ఆందోళన చెందుతున్నది. సెప్టెంబర్ 18న కనుక ఐపీఎల్ ప్రారంభమైతే పలుజట్ల ఆటగాళ్లు దూరమయ్యే అవకాశం ఉన్నది. ఇంగ్లాండ్ క్రికెటర్లు అందుబాటులో ఉండరని ఇప్పటికే ఈసీబీ ప్రకటించింది.. ఇక న్యూజీలాండ్ క్రికెటర్లు బంగ్లాదేశ్ పర్యటనలో బిజీగా ఉండే అవకాశం ఉండటంతో వాళ్లు కూడా ఐపీఎల్‌కు డౌటే.

కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఈ ఏడాదే ఇయాన్ మోర్గాన్ రెగ్యులర్ కెప్టెన్‌గా నియమించబడ్డాడు. ఇంగ్లాండ్ జట్టు పరిమిత ఓవర్ల కెప్టెన్ అయిన మోర్గాన్.. జాతీయ జట్టును విడిచి వచ్చే అవకాశం లేదు. దీంతో కేకేఆర్ జట్టు కొత్త కెప్టెన్‌తో బరిలోకి దిగాలి. గతంలో కెప్టెన్సీ చేపట్టిన దినేశ్ కార్తీక్ లేదా సునిల్ నరైన్‌లలో ఎవరికైనా కెప్టెన్సీ ఇస్తారా? లేదా సీనియర్ క్రికెటర్ ఆండ్రీ రస్సెల్‌కు బాధ్యతలు అప్పగిస్తారా అనేది సందిగ్దంగా మారింది. సీపీఎల్ షెడ్యూల్ కనుక మార్చకపోతే విండీస్ క్రికెటర్లు ఆలస్యంగా యూఏఈకి చేరుకునే అవకాశం ఉన్నది. అందుకే దినేశ్ కార్తీక్ వైపే యాజమాన్యం మొగ్గు చూపే అవకాశం ఉన్నది. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు కూడా కెప్టెన్సీ సమస్యతో ఆందోళన చెందుతున్నది. డేవిడ్ వార్నర్‌ను తప్పించి కేన్ విలియమ్‌సన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. ఇప్పుడు అతడు అందుబాటులో లేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. దీంతో జట్టులో ఎవరిని కెప్టెన్‌గా చేస్తారనే అనుమానం నెలకొన్నది. మనీష్ పాండే లేదా భువనేశ్వర్ కుమార్‌లో ఒకరికి కెప్టెన్సీ ఛాన్స్ వచ్చే అవకాశం ఉన్నది.

Advertisement

Next Story