వేయి స్తంభాల కోసం వెయ్యి కండ్లతో..!

by Anukaran |   ( Updated:2021-01-07 23:49:00.0  )
వేయి స్తంభాల కోసం వెయ్యి కండ్లతో..!
X

దిశ ప్రతినిధి, వ‌రంగ‌ల్: కాక‌తీయ శిల్ప క‌ళా వైభవానికి అద్దంప‌ట్టే వేయి స్తంభాల గుడి కల్యాణ మంటపం పునరుద్ధరణ పనులు ప‌దిహేనేళ్లుగా కొన‌సాగుతూనే ఉన్నాయి. ప‌నుల పూర్తిలో పురావ‌స్తుశాఖ నిర్లక్ష్యం చేస్తుండ‌గా ప్రభుత్వం ఏమాత్రం ప‌ట్టించుకోవ‌డం లేదు. ఫ‌లితంగా వేయిస్తంభాల ఆల‌య క‌ల్యాణ‌ మంటపం ఎప్పుడెప్పుడా అని వెయ్యి క‌ళ్లతో ఎదురుచూస్తున్న ఓరుగ‌ల్లు వాసుల క‌ల ఇప్పట్లో నెర‌వేరెలా క‌న‌బ‌డ‌టం లేదు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అటు కేంద్ర పురావ‌స్తుశాఖ అధికారులు స‌మీక్షలు, నివేదిక‌ల‌తో, ప‌రిశీల‌నల పేరుతో కాస్త హ‌డావుడి చేయ‌డం త‌ప్ప.. ప‌నులు పూర్తి చేయాల‌నే సంక‌ల్పం వారిలో క‌నిపించ‌డం లేద‌న్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ప‌నులు ప్రారంభ‌మై ప‌దిహేనేళ్లు..

కల్యాణ మండపం పునఃనిర్మాణ పనులు 2005 జూలై 13న ప్రారంభమయ్యాయి. ప్రాచీన కల్యాణ మంటపాన్ని తొలగించి అదే స్థానంలో కొత్త నిర్మాణం మొదలుపెట్టారు. ఇందుకోసం కేంద్ర పురావ‌స్తుశాఖ‌ రూ. 7 కోట్లు కేటాయించింది. కాకతీయులు ఉపయోగించిన ‘శాండ్‌బాక్స్’ టెక్నాలజీ ఆధారంగానే పనులు ప్రారంభించారు. తమిళనాడుకు చెందిన స్తపతి శివకుమార్ ఆధ్వర్యంలో 50 మంది బృందం ఈ పనుల‌ను ప్రారంభించారు. అప్పటి నుంచి నిర్మాణ ప‌నుల‌కు సంబంధించి ఏళ్లు గడుస్తున్నాయి. 2010, ఫిబ్రవరిలో పునఃప్రారంభ‌మైన ప‌నులు 2015వ‌ర‌కు నిర్విరామంగా కొన‌సాగాయి. అంత‌కుముందున్న శిలలకు బదులుగా కొత్తగా 132 పిల్లర్లు, 160 బీమ్ శిలలు, శిల్పాలను పునర్నిర్మాణంలో వినియోగించారు. 2015 ఆగస్టు నాటికి పైకప్పు మినహా మంటపం పునురుద్ధరణ పనులన్నీ పూర్తయ్యే ద‌శ‌కు చేరుకున్నాయి.

శిల్పుల‌కు బిల్లుల చెల్లింపుల్లో జాప్యం..

స్తపతికి, వంద‌లాది మంది శిల్పుల‌కు బిల్లుల చెల్లింపుల విష‌యంలో కేంద్ర పురావస్తుశాఖ జాప్యం చేయ‌డంతో వారు పైక‌ప్పు ప‌నుల‌ను పూర్తి చేయ‌కుండానే మ‌ధ్యలోనే వ‌దిలేసి వెళ్లిపోయారు. ఐదేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ప‌ట్టించుకున్న పాప‌న‌పోలేదు. స్థానిక నేత‌లు ఒకరిద్దరు కేంద్ర పురావ‌స్తుశాఖ‌కు లేఖ‌లు రాసినా పెద్దగా పురోగ‌తి క‌నిపించ‌లేదు. అయితే కొద్దిరోజుల క్రితం ఢిల్లీలో ఎంపీ బండ ప్రకాష్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీ ఉష తో భేటీ అయ్యారు. గతంలో శిల్పికి చెల్లించాల్సిన బకాయిలతోపాటు శిల్పులకు రోజువారి రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుందని, ఇప్పటికే కేంద్ర పురావస్తు శాఖకు జిల్లా యంత్రాంగం నుంచి వెళ్లిన ప్రతిపాదనలు వెళ్లిన విష‌యాన్ని ఆయ‌న ప్రస్థావించారు. మొత్తంగా పురావ‌స్తుశాఖ నిధులు విడుద‌ల చేస్తే గాని పనులు మ‌ళ్లీ పునఃప్రారంభ‌మ‌య్యే అవ‌కాశం క‌నిపించ‌డం లేదు.

గ‌త‌మెంతో ఘ‌నం.. ఇప్పుడు దీనం..

క్రీస్తు శకం 1163లో వరంగల్‌లో కాకతీయ రాజు రుద్రదేవుడు వేయిస్తంభాల గుడిని నిర్మించాడు. రుద్రేశ్వరుడు, వాసుదేవుడు, సూర్యుడు కొలువుదీరటంతో ఇది త్రికూట ఆలయంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం రుద్రేశ్వరాలయం వేదికగా జరిగే సాంస్కృతిక, ధార్మిక కార్యక్రమాలకు ఈ మంటపం వేదికగా నిలిచేది. దాదాపు 1,400 చదరపు మీటర్ల వైశాల్యంలో ఈ నిర్మాణం జరిగింది. ఈ కల్యాణ మంటపం నిర్మాణంలో మొత్తం 250 శిలలు, శిల్పాలు ఉపయోగించారు. అయితే కాల క్రమంలో కల్యాణ మంటపం దక్షిణం వైపు ప్రవేశ ద్వారం కుంగిపోయింది. దాంతో పురావస్తుశాఖ ఈ కల్యాణ మంటపాన్ని పునర్నిర్మించేందుకు పూనుకుంది.

Advertisement

Next Story