అవసరమైతే సాగర్ ఎత్తు పెంచి..పాలమూరు-రంగారెడ్డికి నీరిస్తాం

by Shyam |
అవసరమైతే సాగర్ ఎత్తు పెంచి..పాలమూరు-రంగారెడ్డికి నీరిస్తాం
X

దిశ, మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ జిల్లాకు నీరందించడానికి అవసరమైతే సాగర్ ఎత్తు పెంచి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా 365రోజులు నీటితో నింపేందుకు చర్యలు చేపడుతామని ఎక్సైజ్ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం జిల్లాలోని దేవరకద్రలో వానాకాలం 2020, నియంత్రిత వ్యవసాయ విధానంపై జరిగిన నియోజకవర్గ స్థాయి రైతు అవగాహనా సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మంత్రి మాట్లాడుతూ..జిల్లాలో రైతుబంధు, రుణమాఫీ డబ్బులు జమ కానీ రైతుల కోసం వారం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి, వంద శాతం రైతులకు రైతుబంధు, రుణమాఫీ నిధులు జమ అయ్యేలా చూడాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకట రావును ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ విధానం దేశంలోనే నెంబర్ వన్ కానుందని వివరించారు. వానాకాలంలో నూతన వ్యవసాయ విధానంలో భాగంగా నూతన వ్యవసాయ సాగుకు సంబంధించి రైతులు ఏ పంటలు వేయాలో ప్రభుత్వం తరఫున అవగాహన కల్పిస్తున్నామని, ఇందుకు సంబంధించి విత్తనాలను కూడా సిద్ధం చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. వరిలో సన్న రకం బియ్యాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని విత్తనాలు, ఎరువులు అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి రైతు కార్డును మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. అంతేకాక నూతనంగా ఎంపికైన నలుగురు వ్యవసాయ విస్తరణ అధికారులకు నియామక ఉత్తర్వులను అందజేశారు.

Advertisement

Next Story