కరోనా బాధితుల్లో 50 శాతం మందికి రుచి తెలియడం లేదు

by vinod kumar |
కరోనా బాధితుల్లో 50 శాతం మందికి రుచి తెలియడం లేదు
X

దిశ, వెబ్ డెస్క్ :
కరోనావైరస్ సోకినవాళ్లలో జ్వరం, దగ్గు, జలుబులు ప్రధానంగా కనిపించే లక్షణాలని నిపుణులు మొదటి నుంచి చెబుతూనే ఉన్నారు. జలుబు లాంటి సాధారణమైన శ్వాసకోశ సమస్యలు వచ్చినప్పుడు కూడా రుచి, వాసన సామర్థ్యాలు తగ్గిపోతుంటాయి. అయితే కరోనా వచ్చిన వారిలో కూడా అవే లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా వచ్చిన యాభై శాతం మంది బాధితుల్లో రుచిలో తేడా వస్తుందని యూనివర్సిటీ ఆఫ్ టొలెడొ పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

గతంలోనే కోవిడ్ బాధితుల లక్షణాలపై పలు అధ్యయనాలు జరిగాయి. లండన్‌లోని కింగ్స్ కాలేజీకి చెందిన బృందం కూడా నాలుగు లక్షల మందిపై అధ్యయనం చేశారు. ఆ అధ్యయనంలో తమకు కరోనావైరస్ ఉన్నట్లు తేలిందని చెప్పినవారిలో రుచి, వాసన సామర్థ్యం తగ్గిందని తెలిపినవారు 59 శాతం మంది ఉన్నారని తేలింది. జనవరి నుంచి మార్చి వరకు వెలువడిన అధ్యయనాలను పరిశీలించిన కింగ్స్ కాలేజీ పరిశోధకులు చాలామంది బాధితుల్లో రుచి కోల్పోతున్న లక్షణం కనిపిస్తుందన్నారు. 817 మంది రోగులను పరిశీలించగా, వారిలో 49.8 శాతం మందిలో ఈ లక్షణం కనిపించిందని పరిశోధకుడు అజీజ్ అన్నారు. కరోనా సోకిన వ్యక్తికి ఉండే లక్షణాల్లో దీన్ని కూడా చేర్చాలని తాము ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. కరోనావైరస్ సోకినవారికి రుచి, వాసన సామర్థ్యాలు తగ్గడంలో ఆశ్చర్యమేమీ లేదని బ్రిటన్‌లోని గొంతు, ముక్కు, చెవి వైద్యుల సంఘం ఈఎన్‌టీ యూకే ఇప్పటికే వ్యాఖ్యానించింది. అయితే, ఇవి వారిలో మాత్రమే ప్రత్యేకంగా కనిపించే లక్షణాలు కావని పేర్కొంది. జ్వరం, దగ్గు లాంటి ప్రధాన లక్షణాలు ఉన్నవారు అదనంగా రుచి, వాసన సామర్థ్యాలు తగ్గితే మరింత జాగ్రత్తపడాలని కింగ్స్ పరిశోధకులు చెబుతున్నారు.
ఇలా పలు అధ్యయనాల్లో వెలువడినప్పటికీ దీనిపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందని అజీజ్ వెల్లడించారు. ఈ కొత్త లక్షణం కరోనా అనుమానితుల గురించి వైద్యులకు ముందస్తు సూచనగా ఉంటుందని వెల్లడించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా కోవిడ్-19 లక్షణాల్లో వీటిని చేర్చలేదు. దీనికి ఇంకా తగినన్ని ఆధారాలు లేవని నిపుణులు అంటున్నారు.

Advertisement

Next Story