ఇండియాలో ఒక్కరోజే 9,304 కేసులు

by vinod kumar |   ( Updated:2020-06-05 02:16:06.0  )
ఇండియాలో ఒక్కరోజే 9,304 కేసులు
X

దిశ, న్యూస్‌బ్యూరో: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతోంది. గురువారం కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్‌ ప్రకటించే సమయం వరకు గడిచిన24 గంటల్లో దేశవ్యాప్తంగా 9,304 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. భారత్‌లో కరోనా వైరస్ ప్రవేశించినప్పటి నుంచి ఒక్క రోజులో నమోదైన అత్యధిక పాజిటివ్ కేసుల సంఖ్య ఇదే కావడం గమనార్హం. కొత్త కేసులతో కలిపి దేశంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసులు 2,16,919కు చేరాయి. ఈ ఒక్కరోజే కరోనాతో 260 మంది చనిపోగా, దేశవ్యాప్తంగా నేటికి 6,075 మంది మరణించారు. ఇప్పటివరకు 1,04,107 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా 1,06,737 మంది ప్రస్తుతం వ్యాధితో పోరాడుతున్నారు. ప్రపంచ కరోనా మరణాల్లో దేశం తాజాగా 12వ స్థానానికి చేరగా, మొత్తం నమోదైన కేసుల్లో 7వ స్థానంలో కొనసాగుతోంది. గడిచిన నాలుగు రోజుల్లోనే సమారు 1000 మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు చైనాతో పోలిస్తే మూడు రెట్లు అవడానికి చేరువలో ఉన్నాయి.

15 రోజుల్లో రెట్టింపు

కరోనా కేసులు గడిచిన 15 రోజుల్లో రెట్టింపు అవగా మరణాలు 17రోజుల్లో డబుల్ అయ్యాయి. మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్ రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తి రోజురోజుకూ తీవ్రమవుతోంది. దేశంలోనే ఎక్కువ కేసులు నమోదైన మహారాష్ట్రలో ఒక్కరోజే 2,933పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.కొత్తగా రికార్డైన కేసులతో కలిపి మహారాష్ట్రలో కరోనా కేసుల సంఖ్య 77,793కి చేరింది.అక్కడ గడిచిన 19 రోజులుగా 2వేలకు పైనే కొత్త కేసులు రికార్డవుతున్నాయి. ఒక్కరోజులోనే 123 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,710కి చేరింది. రాజధాని ముంబైలో ఒక్కరోజే 1,442 కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 44,,704కు చేరింది. ముంబైలో కొత్తగా 48 మంది కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోగా, నగరంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య 1,465కి చేరింది. తమిళనాడులో ఒక్కరోజే 1.373 కొత్త కేసులు నమోదవడంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 27,256కు చేరింది. రాష్ట్రంలో కరోనాతో ఒక్కరోజే 12మంది మరణించడంతో, ఇప్పటివరకు చనిపోయిన వారి సంఖ్య 220కి చేరింది.ఇక్కడ ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య12,132గా ఉంది. గుజరాత్‌లో ఒక్కరోజే 492 కొత్త కేసులు నమోదవగా, మొత్తం కేసుల సంఖ్య18,601కి చేరింది. ఇక్కడ ఒక్కరోజే 33 మంది కరోనాతో చనిపోవడంతో ఇప్పటివరకు వ్యాధి సోకి మరణించిన వారి సంఖ్య 1,155కి చేరింది. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కరోజే కొత్తగా 141 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇక్కడ మొత్తం కేసుల సంఖ్య 4,112కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 1033 యాక్టివ్ కేసులున్నాయి. కరోనా బారిన పడి గడిచిన 24 గంటల్లో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా, మొత్తం మరణాల సంఖ్య 71కి చేరింది.

Advertisement

Next Story