తెరుచుకున్న ‘రత్న భాండాగారం’

by S Gopi |
తెరుచుకున్న ‘రత్న భాండాగారం’
X

దిశ, నేషనల్ బ్యూరో: ఒడిశాలోని శ్రీ జగన్నాథ దేవాలయంలో ఉన్న 'రత్న భండార్' (నిధి)ని ఎట్టకేలకు నాలుగు దశాబ్దాల తర్వాత ఆదివారం తెరిచారు. ఆదివారం మధ్యాహ్నం 1.28 గంటలకు రహస్య గదిని తెరవగా, మొదట ఖజానాలోకి ప్రవేశించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 11 మంది సభ్యులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. పురాతన ఆభరణాలు, ఇతర విలువైనవి ఉన్నాయనే కారణంతో భాండాగారం తలుపులు తెరిచే విషయంలో ఎప్పటినుంచో వివాదం జరుగుతోంది. అందుకోసం గదిని తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కోరడంతో, పర్యవేక్షణ నిమిత్తం ఆలయ ప్రధాన అధికారికి బాధ్యతలు అప్పగిస్తూ ఒడిశా న్యాయశాఖ మంత్రి పృథ్విరాజ్ నిర్ణయించారు. దాంతో ఒరిస్సా హైకోర్టు న్యాయమూర్తి విశ్వనాథ్ రథ్, శ్రీ జగన్నాథ ఆలయ పరిపాలన చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీ, ఎఎస్‌ఐ సూపరింటెండెంట్ డీబీ గడానాయక్, పూరీ రాజ ప్రతినిధి భాండాగారం తెరిచే బృందంలో భాగమైనట్లు సంబంధిత అధికారులు తెలిపారు.

తెరిచే ముందు పూజలు..

రత్న భాండాగారం తెరిచే ముందు శ్రీక్షేత్రంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గుండిచా మందిరంలో జగన్నాథుడిని దర్శించుకుని, ఆ తరాత లోకనాథ ఆలయంలో పూజలు చేశారు. అక్కడి నుంచి పూలమాలను తీసుకుని ఖజానా గదికి వెళ్లారు. అక్కడ ఉండే మహాలక్ష్మి, విమలాదేవీలకు పూజలు చేశారు. అయితే, 46 ఏళ్ల తర్వాత గదిని తెరుస్తున్న నేపథ్యంలో గదిలో పాములు ఉంటాయనే సందేహంతో అధికారుల బృందం స్నేక్ క్యాచర్స్, ఇతర రక్షణ బృందాలను ఆలయం బయట సిద్ధంగా ఉంచారు. చివరిసారిగా 1978లో రత్న భాండాగారాన్ని తెరిచారు. నాలుగన్నర దశాబ్దాలు గడిచిన నేపథ్యంలో ఈసారి ఇందులోని చెక్క పెట్టెల్లో భద్రపరిచిన ఆభరణాల లెక్కింపును డిజిటలైజ్ చేయనున్నారు. నిధిని తరలించేందుకు అధికారులు 15 చెక్క పెట్టెలను సిద్ధం చేసి తీసుకెళ్లారు.

రత్న భాండాగారం తెరిచే సమయంలో అస్వస్థతకు గురైన ఎస్పీ..

పూరీ జగన్నాధుడి రత్న భాండాగారాన్ని తెరిచే సమయంలో ఎస్పీ పినాక్ మిశ్రా కొంత అస్వస్థతకు గురయ్యారు. గదిలోనే సొమ్మసిల్లి పడిపోయారు. అక్కడే ఉన్న ఎమర్జెన్సీ డాక్టర్ వారికి ప్రథమ చికిత్స చేయడంతో ఆయన తిరిగి కోలుకున్నారు.

లెక్కింపు మొదలైన కాసేపటికే నిలిపివేత..

రత్నభాండాగారం నగల లెక్కింపును కొద్ది సేపటికే అధికారులు ప్రక్రియను ఆపేశారు. చీకటి పడిన కారణంగా కర్రపెట్టెల్లో ఉన్న ఆభరణాలను లెక్కించకుండానే ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దాంతో రత్న భాండాగారం గదికి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తాళం వేశారు. సోమవారం మరోసారి కమిటీ సమావేశమై ఆభరణాల లెక్కింపుపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

రత్న భాండార్ గురించి..

ఈ ఆలయం 12వ శతాబ్దానికి చెందినది. ఆలయంలోని అత్యంత విలువైన ఆస్తిగా ‘రత్న భండార్’ను పరిగణిస్తారని ఒడిశా మ్యాగజైన్ పేర్కొంది. జగన్నాథుడి ఆలయానికి ఉత్తర దిశగా ఉండే ఈ భండార్‌లోనే భక్తులు ఇచ్చే ఆభరణాలు, విరాళాలను ఉంచుతారు. ప్రతి ఏటా రథయాత్ర జరిగే సమయంలో సుబాబేషా ఆచారంలో భాగంగా దేవుడి విగ్రహాల అలంకరణకు అవసరమైన ఆభరణాల కోసం బయటి గదిని తెరుస్తారు. కానీ, లోపలి ఖజానాను తెరచి 46 ఏళ్లు అవుతోంది. గతంలో మూడేళ్లకొకసారి గది తలుపు తెరిచి సంపదను లెక్కించేవారు. చివరగా 1978లో లెక్కించేందుకు 70 రోజుల సమయం పట్టింది. అయితే, అప్పట్లో లెక్కింపు ప్రక్రియపై అనేక సందేహాలున్నాయి. ప్రస్తుతం పూరీ ఆలయంలో రథయాత్ర జరుగుతోంది. ఈ నెల 19వ తేదీ వరకు జగన్నాథుడు, బలభద్ర, సుభద్రలు ఆలయం వెలుపల ఉంటారు. దేవుడు లేని సమయంలో అధికారులు రహస్య గదిని తెరిచి లెక్కింపు ప్రక్రియ నిర్వహిస్తారు. ప్రస్తుతానికి ఈ లెక్కింపు ప్రక్రియకు ఎన్ని రోజుల సమయం పడుతుందనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. 1978లో లెక్కించినపుడు రత్న భండార్‌లో 12,831 భారీల (ఒక భారీ 11.66 గ్రాములు) బంగారం, 22,153 భారీల వెండి ఉన్నట్టు సమాచారం ఉంది. కానీ, వీటి మొత్తం విలువపై సమాచారం అందుబాటులో లేదు.

ఖజానా లోపల ఏముంది..

* జగన్నాథునికి సమర్పించే విలువైన బంగారు, వజ్రాభరణాలకు ఈ ఖజానా నిలయం. ఒడిశా మ్యాగజైన్ ప్రకారం, ఒడిశా రాజు అనంగభీమ దేవ్ జగన్నాథుడి ఆభరణాలు సిద్ధం చేయడానికి 2.5 లక్షల మాదాల(1 మాదా 1/2 తులం అంటే 5.8319 గ్రాములు) బంగారాన్ని విరాళంగా ఇచ్చాడు.

* రత్న భండార్‌లో రెండు గదులు ఉన్నాయి - భితర్ భండార్ (లోపలి ఖజానా), బహార్ ట్రెజరీ (వెలుపలి ఖజానా). బయటి ఖజానాలో జగన్నాథుని బంగారు కిరీటం, ఒక్కొక్కటి 120 తులాల బరువున్న మూడు బంగారు హారాలు (హరిదకంఠి మాలి) ఉన్నాయని స్థానిక పత్రికలు పేర్కొన్నాయి.

* భితర్ భండార్‌లో దాదాపు 74 బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఒక్కొక్కటి 100 తులాల కంటే ఎక్కువ బరువుంటాయని నివేదికలు చెబుతున్నాయి.

* ఇంకా బంగారం, వజ్రం, పగడాలు, ముత్యాలతో తయారు చేసిన ప్లేట్లు ఉన్నాయని, ఇవి కాకుండా 140కి పైగా వెండి ఆభరణాలు కూడా ఖజానాలో భద్రపరిచారని సమాచారం.

Advertisement

Next Story