Wayanad Landslides: 'సూపర్ హీరో' మిస్సింగ్.. ద్వంసమైన స్థితిలో జీపు లభ్యం

by Shamantha N |
Wayanad Landslides: సూపర్ హీరో మిస్సింగ్.. ద్వంసమైన స్థితిలో జీపు లభ్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: జలవిలయంతో కేరళలోని వయనాడ్ పరిస్థితి అధ్వానంగా మారింది. అయితే, ఈ క్లిష్ట సమయంలో ప్రజీశ్ అనే వ్యక్తి ప్రాణాలకు తెగించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. కొండచరియలు విరిగిపడటంతో వరదలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రమాదాన్ని లెక్కచేయలేదు. ఎంతో మందిని కాపాడిన ఆ సూపర్ హీరో మిస్సింగ్ విషయం బయటకు రావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వయనాడ్‌లోని చూరాల్మలకు చెందిన ప్రజీశ్‌ కొండచరియలు విరిగిపడటంతో సహాయకచర్యలు చేపట్టేందుకు రంగంలోకి దిగారు. ముండకై ప్రాంతంలో కొండచరియలు విరిగిపడ్డాయని తెలియగానే, రక్షించేందుకు ప్రజీశ్ జీప్‌లో వెళ్లారు. అలా రెండుసార్లు పలువురిని కాపాడారు. ఆ తర్వాత కుటుంబంతో కలిసి సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అంతలోనే సహాయం కోసం మరో ఫోన్ కాల్ వచ్చింది. దీంతో మళ్లీ అదే ప్రాంతానికి జీప్‌లో వెళ్లి తిరిగి రాలేదు. చురాల్మల ప్రాంతంలో ప్రజీశ్ జీప్ ధ్వంసమైన స్థితిలో కన్పించింది. కానీ ఆయన జాడ మాత్రం తెలియరాలేదు.

ప్రజీశ్ మా సూపర్ హీరో

ప్రజీశ్ మిస్ అవ్వడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘‘ప్రజీశ్‌ అంటే అందరికీ ఇష్టం. మా ఇళ్లలో ఎలాంటి కార్యక్రమమైనా ఆయన తన సహాయం అందిస్తాడు. నా కూతురి పెళ్లికి ఆయన ఎంతో సాయం చేశాడు” అని ఒకరు తెలిపారు. ఆ కొండ ప్రాంతానికి వెళ్లొద్దని చెప్పినా ప్రజీశ్ వినలేదని అతడి స్నేహితులు పేర్కొన్నారు. ముండకై ప్రాంతంలో చాలా మంది చనిపోయారని.. వారిని రక్షించాలని వెళ్లినట్లు తెలిపారు. ‘‘అతడు మా సూపర్ హీరో. ఇప్పుడతడు మా ముందు లేడు’’ అంటూ వాపోయారు. కొండచరియలు విరిగిపడటంతో ముండకై, చూరాల్మల ప్రాంతాల్లో వందలాది ఇళ్లు ఆనవాళ్లు లేకుండా పోయాయి. ఇప్పటివరకు పలువురి డెడ్ బాడీలను వెలికితీశారు. గల్లంతయిన మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story