Vikash Yadav: పన్నూ హత్యకు కుట్రకేసులో రా మాజీ అధికారిపై అభియోగాలు

by Shamantha N |
Vikash Yadav: పన్నూ హత్యకు కుట్రకేసులో రా మాజీ అధికారిపై అభియోగాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్య కుట్ర కేసులో అమెరికా (USA) దర్యాప్తు జరుపుతోంది. ఇందులో భాగంగా భారత మాజీ ఇంటెలిజెన్స్ (RAW) అధికారి వికాస్‌ యాదవ్‌పై ఇటీవల అభియోగాలు నమోదయ్యాయి. అయితే, వికాస్‌ పరారీలో ఉన్నట్లు అమెరికా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ నోటీసులు జారీ చేసింది. ఆ అధికారిని ఢిల్లీ పోలీసులు గతేడాది కిడ్నాప్‌, దోపిడీ కేసులో అరెస్టు చేసినట్లు జాతీయ మీడియాల్లో కథనాలు వెల్లడించాయి. ఢిల్లీలోని రోహిణీ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి గతేడాది డిసెంబరులో వికాస్‌ యాదవ్‌పై ఫిర్యాదు చేశాడు. వికాస్‌తో తనకు 2023 నవంబరులో పరిచయం ఏర్పడిందని, కొంతకాలం పాటు టచ్‌లో ఉన్నామని చెప్పారు. అయితే, గతేడాది డిసెంబరులో ఓ హోటల్‌కు పిలిచి తనపై దాడి చేసి దోపిడీకి యత్నించాడని పేర్కొన్నారు. దీంతో గతేడాది డిసెంబరు 18న వికాస్‌, అతడి అనుచరుడిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసినట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. దీనిపై ఈ ఏడాది మార్చిలో ఛార్జ్‌షీట్ దాఖలు చేయగా.. ఆ మరుసటి నెలలోనే వికాస్‌కు బెయిల్‌ మంజూరైనట్లు తెలుస్తోంది.

పన్ను హత్యకు కుట్ర

పన్నూ హత్యకు కుట్ర కేసులో అతడిపై అభియోగాలు నమోదైన వేళ.. ఈ వార్తలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కుట్ర కేసుకు సంబంధించి న్యూయార్క్‌లోని కోర్టులో న్యాయశాఖ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. అందులో భారత పౌరుడైన వికాస్‌యాదవ్‌ (39)పై మనీలాండరింగ్‌, కుట్రకు వ్యక్తులను నియమించడం, పన్నూ హత్యకు ప్రణాళిక రచించడం వంటి అభియోగాలు మోపారు. ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియరావడం లేదని అందులో పేర్కొన్నారు. వికాస్‌ గతంలో భారత ప్రభుత్వ అధికారిగా విధులు నిర్వహించారు. భారత విదేశీ ఇంటిలెజెన్స్‌ విభాగం, రా విభాగాన్ని నిర్వహించే కేబినెట్‌ సెక్రటేరియట్‌లో ఉద్యోగిగా పనిచేశారు. అమెరికాలో పన్నూ హత్యకు కుట్ర జరిగిందని, దాన్ని తాము భగ్నం చేశామని అగ్రరాజ్యం గతేడాది ఆరోపించింది. అయితే, ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించిన భారత్‌.. దీనిపై విచారణ జరిపేందుకు దర్యాప్తు కమిటీని ఏర్పాటుచేసింది. ఈ క్రమంలోనే ఇటీవల భారత అధికారుల బృందం అమెరికాలోని విదేశాంగ శాఖ, న్యాయశాఖ అధికారులతో సమావేశమైంది. అయితే, వికాస్ యాదవ్ భారత ప్రభుత్వంలో పనిచేయట్లేదని అమెరికా వెల్లడించింది.

Advertisement

Next Story

Most Viewed