Vice president dhankhad : ప్రజాస్వామ్య పరిరక్షణలో పార్లమెంటుదే కీలక పాత్ర..ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్

by vinod kumar |
Vice president dhankhad : ప్రజాస్వామ్య పరిరక్షణలో పార్లమెంటుదే కీలక పాత్ర..ఉపరాష్ట్రపతి ధన్ ఖడ్
X

దిశ, నేషనల్ బ్యూరో: రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడంలో పార్లమెంటుదే కీలక పాత్ర అని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ నొక్కి చెప్పారు. కొత్తగా ఎన్నికైన రాజ్యసభ సభ్యుల కోసం ఏర్పాటు చేసిన ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో అత్యంత కీలక పాత్ర ఎంపీలపైనే ఉంటుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో విలువలకు లోబడి పని చేయాల్సి ఉంటుందని తెలిపారు. పార్లమెంటు పూర్తి స్వయంప్రతిపత్తితో పనిచేయాలన్నారు. సరైన విధానాలను అనుసరించినట్లయితే, సభలో ఏ అంశంపై అయినా చర్చకు పరిమితి లేదని తెలిపారు.

పార్లమెంటు లోపల ఏం జరిగినా అందులో జోక్యం చేసుకునే అధికారం చైర్‌పర్స్‌న్‌కు తప్ప మరెవరికీ లేదన్నారు. కొంతమంది సభ్యుల ప్రస్తుత ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసిన ధన్‌ఖడ్..ఇతర సభ్యుల మాటలు వినకుండా, సభలో కొద్దిసేపు కనిపించడానికి, ఆ తర్వాత సభ్యులు మీడియాతో నిమగ్నమయ్యే హిట్ అండ్ రన్ వ్యూహాన్ని విమర్శించారు. కొంతమంది వ్యక్తులను సంతోషపెట్టడానికి ఉద్దేశించిన వ్యక్తిగత దాడులు సరికావన్నారు. ఈ ప్రవర్తన పూర్తి ఆందోళన కరంగా మారుతుందని చెప్పారు. పార్లమెంటు మొత్తం పనితీరు పట్ల గర్విస్తున్నారని, అయితే ప్రస్తుతం రాజకీయ సాధనాలుగా ఉపయోగిస్తున్న అవాంతరాల పట్ల మాత్రం సంతృప్తిగా లేనని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed