Russian- Ukraine War: రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ సైన్యం

by Shamantha N |
Russian- Ukraine War: రష్యా భూభాగంలోకి ఉక్రెయిన్ సైన్యం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్‌ బలగాలు రష్యా భూభాగంలోకి చొరబడ్డాయి. రష్యా సేన ఉక్రెయిన్ బలగాలతో భీకరపోరు కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని మాస్కో ప్రకటించింది. ఇప్పటివరకు ఐదుగురు సామాన్య పౌరులు చనిపోయినట్లు తెలిపింది. మరో 31 మంది తీవ్రంగా గాయపడినట్లు వెల్లడించింది. గాయపడిన వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నట్లు పేర్కొంది. అయితే, రష్యాతో యుద్ధం గురించి ఉక్రెయిన్ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరోవైపు, రష్యాలోని కుర్క్స్‌ ప్రాంతంలో ఆత్యయిక స్థితి విధించినట్లు ఆ ప్రాంత గవర్నర్‌ అలెక్సీ స్మిర్నోవ్‌ వెల్లడించారు. ఉక్రెయిన్ సైన్యాన్ని తరిమికొట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఉక్రెయిన్ చర్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని పుతిన్ అన్నారు. అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలపైకి విచక్షణారహితంగా కాల్పులు చేస్తున్నారని ఆరోపించారు.

సుడ్జా సిటీలోకి ఉక్రెయిన్ బలగాలు

మంగళవారం సాయంత్రం దాదాపు వెయ్యి మంది ఉక్రెయిన్‌ సైనికులు సుడ్జా సిటీలోకి ప్రవేశించినట్లు మాస్కో తెలిపింది. మరోవైపు, 11 యుద్ధ ట్యాంకులు, 20 సాయుధ వాహనాలతో ఉక్రెయిన్ సైన్యం చొరబడినట్లు వెల్లడించింది. రష్యా సైనికులు వారితో పోరాడుతున్నట్లు పేర్కొంది. ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. యుద్ధ విమానాలను సైతం రంగంలోకి దించింది. ముందస్తు జాగ్రత్తగా ప్రమాదకర ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభం అయ్యాక ఉక్రెయిన్ బలగాలు రష్యా భూభాగంలోకి ప్రవేశించడం ఇదే తొలిసారి. అయితే, సుడ్జా గ్యాస్‌ కేంద్రాన్ని ఉక్రెయిన్‌ బలగాలు తమ నియంత్రణలోకి తీసుకున్నట్లు ఆ దేశ ఎంపీ ఓలెక్సియ్‌ హోన్‌చరెంకో బుధవారం సాయంత్రం ప్రకటించారు. ఈయూకి గ్యాస్ ను సరఫరా చేసేందుకు రష్యాకు ఉన్న ఏకైక మార్గం ఇదే. అయితే, ఉక్రెయిన్ ఎంపీ ప్రకటనతో రష్యాలోకి తమ బలగాలు ప్రవేశించినట్లు అనధికారికంగా అంగీకరించినట్లే ఆయన వ్యాఖ్యలు ఉన్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి.

Advertisement

Next Story